పారిస్ సహా ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలు
పోలీసులతో ఘర్షణ.. రాళ్లు రువ్విన నిరసనకారులు
బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించిన పోలీసులు
కనీసం 1,000 మంది అరెస్టు
నిరసనల్లో 4.10 లక్షల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం వెల్లడి
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ సహా ప్రధాన నగరాలు శనివారం నిరసనల ర్యాలీలు, ఆందోళనలతో దద్దరిల్లాయి. పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేకపోవడం, జీవన వ్యయం భారీగా పెరుగుతుండడం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడంపై జనం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అసమర్థతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వారు.
పలు నగరాల్లో జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. కనీసం 1,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా చర్యల్లో వేల సంఖ్యలో జవాన్లను మోహరించారు. పారిస్‌లో లక్ష మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నగరంలో ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ నిరసనకారులు లెక్కచేయలేదు.
1.10 లక్షల మంది తరలివచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో 4.10 లక్షల మంది పాల్గొన్నారని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. లియోన్, క్లెర్మాంట్–ఫెర్రాండ్, స్ట్రాస్‌బర్గ్‌తో సహా పలు నగరాల్లో ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది.
పోలీసులు బలప్రయోగం చేయడంతో పలువురు గాయపడ్డారు. పారిస్‌లో 64 మందిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. అరెస్టయిన వారిలో ఆరుగురు మైనర్లు సైతం ఉన్నారు. ఆయుధాలతో నేరాలకు పాల్పడటం, హింసకు, ఆస్తి నష్టానికి పాల్పడే బృందంలో ఉండడం వంటి అభియోగాలతో అరెస్టు జరిగాయి.
నిరసనల సందర్భంగా పలువురు యువతీ యువకులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. 27 ఏళ్ల కమిల్ చెస్నియర్ అనే యువతి మాట్లాడుతూ... ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ తనకు ఇంకా ఉద్యోగం దొరకలేదని చెప్పారు. తనలాంటి వాళ్లు లక్షల మంది చాలామంది ఉన్నారని తెలిపారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తన లాంటి వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో తమ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు.
31న భారీ నిరసనకు పిలుపు
పారిస్‌కు ఆగ్నేయంగా ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో సిబ్బంది కొరతపై గత నెలలో ప్రారంభమైన నిరసన నేడు దేశవ్యాప్తంగా వ్యాపించింది. మెరుగైన పాఠశాలలు కావాలని కోరుతున్న విద్యార్థులు, అధిక వేతనాలు, పెన్షన్లు కోరుతున్న కారి్మకులు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్‌విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో రిటైరైన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం వల్ల ప్రభుత్వ మాధ్యమిక, ఉన్న త పాఠశాలలు 15.4 మిలియన్ల బోధనా గంటలను కోల్పోయాయి. ఇది నిర్ణిత బోధనా సమ యంలో 7.5 శాతానికి సమానం.
ఫ్రాన్స్‌లో ఇంధన ధరలు గత ఏడాదితో పోలిస్తే సెపె్టంబర్‌లో 21.3 శాతం అధికంగా ఉన్నాయి. ఇది మొత్తం ద్రవ్యోల్బణం 3.1 శాతానికి చేరడానికి దోహదపడింది. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ శుక్రవారం ఉన్నత పాఠశాల ప్రతినిధులతో సమావేశ మయ్యారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టేదాకా వెనక్కి తగ్గబోమని నిరసనకారులు తేల్చిచెప్పారు. నిరసన తెలిపే హక్కును పరిరక్షించుకోవడానికి ఉద్యమ నిర్వాహకులు అక్టోబర్ 31న భారీ నిరసనలకు పిలుపునిచ్చారు.


