మరింత బలపడనున్న ఎల్ నినో.. దేశవ్యాప్తంగా పంటల దిగుబడులపై దెబ్బ
వందేళ్లలో 13వ అత్యల్ప వర్షపాతం.. రబీ సాగుపై నీటి కొరత ప్రభావం
తెలంగాణలో 18 జిల్లాల్లో లోటు.. వరి సాగు కూడా గణనీయంగా తగ్గుదల
తెలంగాణ ధాన్యం తగ్గితే కేంద్ర సేకరణ, ఎఫ్‌సీఐ నిల్వలపైనా ప్రభావం
బియ్యం, పప్పులు, నూనెల సరఫరాపై ఒత్తిడి.. పెరగనున్న ధరల ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుండటంతో దేశ ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే బలహీనమైన నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటల సాగు, దిగుబడులపై ప్రభావం చూపుతుండగా.. తగ్గిన జలాశయాల నిల్వలు రబీ పంటలకు నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరోవైపు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ అంచనాలు రాబోయే శీతాకాలంలో ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
దీంతో ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడులతోపాటు రబీ ఉత్పత్తులపైనా తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో కీలకమైన రాష్ట్రాలు దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం దేశ ఆహార సరఫరా వ్యవస్థపై పడుతుంది.
తెలంగాణలో ఖరీఫ్, రబీ పంటలకు దెబ్బ
నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని తీవ్రంగా నిరాశపరిచాయి. జూన్–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా 759.4 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీర్ఘకాలిక సగటు 868.6 మి.మీ.తో పోలిస్తే ఇది 87.4 శాతం మాత్రమే. 1901 తర్వాత నమోదైన అత్యల్ప రుతుపవనాల్లో ఇది 13వ స్థానం కాగా.. 2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం 16.32 లక్షల హెక్టార్లు తగ్గడం ఆహార భద్రత కోణంలో కీలక పరిణామంగా మారింది.
రాష్ట్రంలో నైరుతి సీజన్‌లో 17 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్ర సగటు ఐఎండీ ప్రమాణాల ప్రకారం సాధారణ కేటగిరీలోనే ఉన్నప్పటికీ.. 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో ఈ సీజన్‌లో వరి సాగు 54.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణ సాగు 65.96 లక్షల ఎకరాలు ఉండగా.. 12 లక్షల ఎకరాల మేర తక్కువగా ఉంది.
రబీలో 50.20 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రబీలో తెలంగాణలో దొడ్డు వడ్లనే సాగు చేస్తారు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న సన్న బియ్యం లోటు మరింత పెరుగుతుంది. రాష్ట్ర అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. సెంట్రల్ పూల్‌కు వెళ్లే బియ్యం తగ్గనుండటంతో ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉండనుంది.
పప్పులు, నూనెలపైనా ప్రభావం
ఆహార భద్రత అంటే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చక్కెర, కూరగాయల ఉత్పత్తి కూడా కీలకమే. దేశవ్యాప్తంగా పంటల దిగుబడులపై వర్షాభావం ప్రభావం చూపితే.. పంట ఉత్పత్తి తగ్గుతుంది. సరఫరా తగ్గితే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. పంటల దిగుబడి మరింత తగ్గితే పరిస్థితి కఠినంగా మారే అవకాశం ఉంది.
దేశ ఆహార నిల్వలపై ప్రభావం
వరి సాగు తగ్గితే ఆహార భద్రతలో కీలకమైన ఉచిత బియ్యం పంపిణీలో లోటు ఏర్పడనుంది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ పంట కోతలు ప్రారంభం కాగా, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల వద్దకు వచ్చి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారు. ఎంఎస్‌పీ రూ.2,461 ఉండగా, అంత కన్నా ఎక్కువగా సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.3,200 వరకు చెల్లిస్తున్నారు.
దేశంలోని పేదలకు రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలకు అవసరమైన ధాన్యం, మార్కెట్‌లో ధరలను నియంత్రించేందుకు అవసరమైన బఫర్ నిల్వలు.. అన్నింటికీ ప్రభుత్వానికి తగినంత ధాన్యం అవసరం. అందువల్ల ఒకటి రెండు ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గినా.. దాని ప్రభావం కేంద్ర నిల్వలపై పడుతుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో వరి సాగు తగ్గితే, రెండు సీజన్ల ఉత్పత్తిపై ఒకేసారి ప్రభావం పడుతుంది. ఇది దేశ ధాన్యం సేకరణ వ్యవస్థకూ సమస్యగా మారుతుంది.


