మెక్రోగ్రీన్స్ సాగు
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. సాంప్రదాయ సాగు విధానాలు దెబ్బతింటున్న ఈ తరుణంలో, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ నీటితో, పరిమిత స్థలంలో అత్యధిక పోషకాలను అందించే ‘మైక్రోగ్రీన్స్’ (అతిచిన్న మొక్కలు లేదా అతిచిన్న ఆకుకూరల) సాగు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ఈ అతిచిన్న ఆకుకూరల సాగు ఇటు పట్టణ/నగర పరిసర ప్రాంతాల రైతులకు, అటు ఇంటిపంటలు/ మిద్దెతోటల సాగుదారులతో పాటు వినియోగదారులకు వరం. ఎల్‌నినో గడ్డు పరిస్థితుల్లో సాంప్రదాయ పంటలతో పోలిస్తే మైక్రోగ్రీన్స్ సాగు రైతులకు లాభసాటి వ్యాపారంగా మారుతోందని బెంగళూరులోని ఐకార్–భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐకార్–ఐఐహెచ్‌ఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి. కలైవనన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.
మైక్రోగ్రీన్స్ ప్రయోజనాలు...
→ అత్యల్ప నీటి వినియోగం: ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులు అడుగంటుతున్న తరుణంలో, పొలాల్లో సాంప్రదాయ ఆకుకూరల సాగుతో పోలిస్తే మైక్రోగ్రీన్స్ సాగుకు 90% తక్కువ నీరు సరిపోతుంది
→ స్వల్పకాలిక పంట: ఇవి కేవలం 7 నుంచి 14 రోజుల్లోనే కోతకు వస్తాయి. తద్వారా రైతులు తక్కువ సమయంలోనే త్వరగా ఆదాయాన్ని పొందవచ్చు
→ ఇంటిపంట: స్థలం, నీటి కొరత ఉండే పట్టణ, అర్బన్ ప్రాంతాల్లో రూఫ్‌టాప్‌లు, బాల్కనీలు లేదా ఇండోర్ షెల్ఫ్‌లలో వీటిని సులభంగా సాగు చేయవచ్చు. గృహిణులు, పట్టణవాసులు ఇళ్లలోనే చిన్న ట్రేలు, కొబ్బరిపొట్టు సహాయంతో సొంతంగా వీటిని పండించుకోవచ్చు
→ అధిక లాభాలు: ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన మైక్రోగ్రీన్స్కు భారీ ధర పలుకుతుండటం వల్ల, మార్కెటింగ్ నైపుణ్యం గల అర్బన్ రైతులు తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలను ఆర్జించే అవకాశం ఉంది
→ ఆరోగ్య ప్రయోజనాలు: వాతావరణ మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు మైక్రోగ్రీన్స్ ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి
→ పోషకాల గని: పూర్తిగా పెరిగిన ఆకుకూరలు, కూరగాయలతో పోలిస్తే, మైక్రోగ్రీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అత్యధిక సాంద్రతలో ఉంటాయి
→ జీర్ణవ్యవస్థ మెరుగుదల: మైక్రోగ్రీన్స్ జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు జీవనశైలి వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.
→ ఎల్‌నినో సవాల్ విసురుతున్న ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో మైక్రోగ్రీన్స్ సాగు కేవలం ఆహార భద్రతనే కాకుండా, అర్బన్ రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని, వినియోగదారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ‘ఆరోగ్యదాయకమైన, రసాయన రహితమైన అతిచిన్న ఆకుకూరలను స్వయంగా పండించుకుందాం’ అనే నినాదంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

పెరిగిన ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో పోషకాలెక్కువ!
విత్తనాలు వేసిన తర్వాత 7–14 రోజుల్లోపు కోతకు వచ్చే అతిచిన్న ఆకుకూరలను మైక్రోగ్రీన్స్ అంటాం. రెండు నెలలు పెరిగిన ఆకుకూరల్లో కన్నా మూడు ఆకులతో ఉండే మైక్రోగ్రీన్స్ ఆకుల్లో పోషకాల సాంద్రత, సువాసన ఎక్కువగా ఉంటాయి. 2–3 అంగుళాలు ఎదిగిన ఈ అతిచిన్న మొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధిక సాంద్రతలో ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. చిన్న పాటి పాత్రలు, బాక్సుల్లో వీటిని ఇంట్లోనే పెంచుకొని తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. వాణిజ్య స్థాయిలోనూ ఉత్పత్తి చేసి పట్టణాలు, నగర ప్రాంతాల్లో విక్రయించి ఆదాయం పొందవచ్చు. మైక్రోగ్రీన్స్‌ను పెంచే శాస్త్రీయ పద్ధతులపై వచ్చే నెలలో ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం.
– డాక్టర్ డి. కలైవనన్ ,
సీనియర్ శాస్త్రవేత్త, ఐసీఏఆర్–ఐఐహెచ్‌ఆర్,
హసరఘట్ట లేక్‌పోస్ట్, బెంగళూరు
kalainith2003@gmail.com
ముఖ్యమైన చిట్కాలు
→ రోజూ నీటిని మార్చండి, శుభ్రంగా ఉంచండి
→ నేరుగా ఈ ట్రేపైన ఎండ పడకుండా, చల్లని, గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచండి
→ తేమ ఆరిపోకుండా ఉంచటం కోసం రోజుకు 2–5 సార్లు సున్నితంగా నీటిని స్ప్రే చేయండి
→ విత్తన రకాన్ని బట్టి విత్తిన 7–14 రోజులలోపు మైక్రోగ్రీన్స్‌ను ఉపయోగించుకోండి.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


