ఎల్‌నినో విపత్తు వేళ రైతులకు అండగా ‘ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌’ | PepsiCo India, Bayer, GIZ Launch Project Harvest to Shield Farmers from El Nino | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో విపత్తు వేళ రైతులకు అండగా ‘ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌’

Nov 16 2026 12:03 PM | Updated on Nov 16 2026 12:07 PM

PepsiCo India, Bayer, GIZ Launch Project Harvest to Shield Farmers from El Nino

35 వేల మంది రైతులకు ఆధునిక సాగులో శిక్షణ

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో 60 వేల ఎకరాల్లో పునరుత్పాదక వ్యవసాయం

పెప్సికో ఇండియా, జీఐజెడ్‌, బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ల భాగస్వామ్యం

మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో దేశ వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. అస్తవ్యస్తమైన వర్షపాతం, కరువు ఛాయలు, అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీనివల్ల ప్రధానంగా మొక్కజొన్న సాగుపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా, మానసికంగా కుదేలవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి అన్నదాతలను గట్టెక్కించి వారిని వాతావరణ మార్పులను తట్టుకునేలా సన్నద్ధం చేసేందుకు ప్రముఖ ఆహార, పానీయాల సంస్థ పెప్సికో ఇండియా, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ జర్మన్‌ సొసైటీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ (జీఐజెడ్‌), బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ సంయుక్తంగా నడుం బిగించాయి. ఈ సంస్థల సమన్వయంతో ‘ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

లక్ష్యాలు - అమలు ప్రణాళిక

పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాల ఉత్పాదకతను, రైతుల నికర ఆదాయాన్ని పెంపొందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తొలి దశలో భాగంగా ప్రధాన మొక్కజొన్న ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 2029 వరకు అంటే మూడేళ్ల పాటు కొనసాగే ఈ బృహత్తర ప్రణాళిక ద్వారా మొత్తం 35 వేల మంది మొక్కజొన్న రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా సుమారు 60 వేల ఎకరాల విస్తీర్ణంలో వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

గత అనుభవాలతో విస్తరణ

కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా పెప్సికో ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌, ఇండియా మార్కెట్‌ సప్లై ఆఫీసర్‌ అశోక్‌ రాయ్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తమ సంస్థకున్న సుదీర్ఘ అనుభవాన్ని వివరించారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 36 వేల మందికి పైగా రైతులతో పెప్సికో కలిసి పనిచేస్తోంది. గతంలో బంగాళాదుంపల సాగులో భూసార పరిరక్షణకు పెద్దపీట వేస్తూ రైతులతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించడంలో విజయం సాధించాం. ఇప్పుడు అదే అనుభవాన్ని, నైపుణ్యాన్ని జీఐజెడ్‌, బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ల సాంకేతిక భాగస్వామ్యంతో మొక్కజొన్న సాగుకూ విస్తరిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

సుస్థిర వ్యవసాయమే ధ్యేయం

పెప్సికో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పెప్సికో పాజిటివ్‌ (పెప్‌+)’ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌’ రూపుదిద్దుకుందని అశోక్‌ రాయ్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నేల సారాన్ని పెంచే పద్ధతులను నేర్చుకోవడమే కాకుండా నీటి యాజమాన్యం, ఇతర సహజ వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా సాంకేతికతను రైతుల ముంగిటకు చేర్చడమే ఈ మూడు సంస్థల ఉమ్మడి ఆశయమని, ‘పురోగతి కోసం భాగస్వామ్యం’ అనే తత్వానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement