విపత్తులు చుట్టుముట్టినా.. సర్కారు సాయం సున్నా..
అర్నబ్, మురసు తుపాన్లతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం
కోతకు సిద్ధమైన వరి నేలవాలి.. నీటిలో నాని మొలకెత్తిన కంకులు
ఎకరాకు రూ.35–రూ.40 వేల పెట్టుబడి.. చేతికి రాని పంట
కౌలుతో సహా లక్షల రూపాయల నష్టాల్లో రైతులు
కోత ఖర్చులు మూడు రెట్లు.. ఎటు చూసినా పీకల్లోతు కష్టాలు
మొంథా తుపాను పరిహారం ఏడాది దాటినా రైతుల ఖాతాల్లో జమ కాని వైనం
ఉచిత పంటల బీమా రద్దుతో రైతులపై ప్రీమియం భారం
పంట నష్టం అంచనాల్లో జాప్యం.. క్షేత్రస్థాయిలో కనిపించని అధికారులు
ప్రకటించిన 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాల జాడేది?
అప్పుల ఊబిలో అన్నదాతలు.. వ్యవసాయం వదిలేయాల్సిన దుస్థితి
రైతుల కడగండ్లపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : ఏ పల్లెకు వెళ్లినా నేలవాలిన పంటలు.. ఏ రైతును కదిపినా కన్నీటి గాథలే! వరి మొదలు కొని పత్తి వరకు..అరటి మొదలు బొప్పాయి వరకు ఏ పంట చూసినా మోకాల్లోతు ముంపు నీటిలో నానిపోతున్నాయి. మరో వారం పది రోజులు ఆగితే సిరులు కురిపించే ఆ పచ్చని చేలు జీవం లేని పచ్చిక బయళ్లు మాదిరిగా తయారయ్యాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి చివరి వరకు వర్షాభావం, సాగునీటి ఎద్దడితో రైతులు అల్లాడారు. దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో సాగు జరగలేదు. సాగైన భూముల్లోనూ సగానికి పైగా విస్తీర్ణం ఎండుముఖం పట్టింది.
అయినా కష్టనష్టాలకోర్చి కృష్ణా, గోదావరి డెల్టాల్లో సాగు చేపట్టిన రైతులకు పంట చేతికొచ్చే వేళ సెప్టెంబర్ భారీ వర్షాలు, ఆపై అర్నబ్, మురసు తుపాన్లు కోలుకోలేని దెబ్బతీశాయి. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము మొదలుకొని అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయల వరకు పంటలన్నీ నీటమునిగి, నేలవాలి కుళ్లిపోతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు తుపాన్ల ప్రభావం తీవ్రంగా ఉండగా.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్టం మరింత ఎక్కువగా ఉంది. కోనసీమలో వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. క్షేత్రస్థాయిలో పర్యటించిన సాక్షి బృందానికి ఎక్కడ చూసినా రైతుల దీనగాథలే కనిపించాయి.
ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడులు నీటిపాలై, అప్పులు పెరిగి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు గద్దెనెక్కింది మొదలు ఓ వైపు కరువు కాటకాలు, మరొక వైపు వరదలు, తుపానులు, భారీ వర్షాలు వంటి వరుస విపత్తులు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. రైతుల కన్నీళ్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా.. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ సమీక్షలు, ఏరియల్ సర్వేలకే పరిమితమైందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిహారం, సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు.. ప్రభుత్వం ఆదుకోకపోతే వ్యవసాయాన్ని వదులుకోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు.
కౌలురైతులకు కోలుకోలేని దెబ్బ
గోదావరి, కృష్ణా డెల్టాల్లో వ్యవసాయం చేస్తున్న వారిలో కౌలురైతులే అధికం. వరితో సహా ప్రధాన పంటలు సాగు చేస్తున్న రైతుల్లో 70 శాతం మంది కౌలురైతులే. వరుస తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయింది కూడా వారే. రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న కౌలురైతులు తాజాగా అర్నబ్, మురసు తుపాన్ల దెబ్బకు విలవిల్లాడుతున్నారు. వరి సాగుకు ఎకరాకు 17–20 బస్తాల ధాన్యం భూయజమానికి కౌలుగా ఇవ్వాల్సి ఉండగా, ఇతర వాణిజ్య పంటలకు ఏడాదికి ఎకరాకు రూ.40 వేల వరకు కౌలు చెల్లించాలి.
కులమతాలకు అతీతంగా భూయజమానులతో సమానంగా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. మూడేళ్లుగా ఏ ఒక్క కౌలురైతుకూ ఈ సాయం అందలేదు. మరోవైపు కౌలు కార్డులు లేక బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకార్ల వద్ద రూ.2–3 వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు.
ఒక్కో కౌలురైతుపై సగటున రూ.5–7 లక్షల అప్పుల భారం ఉంది. అర్నబ్, మురసు తుపాన్లతో మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఈ ఖరీఫ్‌లో ఎకరాకు 40–45 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించారు. ఇప్పటికే ఎకరాకు రూ.35–40 వేల పెట్టుబడి పెట్టారు. సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడి పంటలను కాపాడుకునేందుకు అదనంగా ఎకరాకు రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. సాధారణంగా కోతలు, మాసూళ్లకు ఎకరాకు రూ.4–5 వేలు ఖర్చయ్యేది. కానీ తుపాను దెబ్బకు నేలవాలిన పంటలను కోసే పరిస్థితి లేక కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కిస్తీకి కూడా సరిపోయే పరిస్థితి లేదు..
మిగిలిన కొద్దిపాటి పంట చేతికి రావాలంటే మిషన్లతోనే కోత కోయించాల్సి వస్తోంది. నేలవాలిన పంట కోతకు ఎకరాకు నాలుగైదు గంటలు పడుతుందని, గంటకు రూ.3–4 వేల చొప్పున కనీసం రూ.15 వేల అదనపు ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టి కోసి, ఆరబెట్టినా 20–25 బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అందులో 17 బస్తాలు భూయజమానికే కౌలుగా ఇవ్వాలి. ఇక తమకు మిగిలేదేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పెట్టుబడి మాట దేవుడెరుగు.. కనీసం భూయజమానికి కౌలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పంట తడిసిపోవడంతో ధాన్యంలో అధిక తేమ, రంగు మారడం, మొలకలు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

మరోవైపు రెల్లుపురుగు నేలవాలిన వరి దుబ్బులను కొరికేస్తుండటంతో, వడ్లు నేలరాలి పనికిరాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి పంటను ఒబ్బిడి చేసినా మద్దతు ధర మాట అటుంచి, కొనేవారే ఉండరేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాన్ల దెబ్బకు వరి రైతులు పెట్టుబడులు కోల్పోగా, అరటి తదితర వాణిజ్య పంటల రైతులు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే వ్యవసాయం మానుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కుబడిగా పంట నష్టం అంచనాలు..
తుపానులు తీరం దాటి దాదాపు పది రోజులు కావస్తున్నా పంట నష్టం అంచనాలు నత్తనడకన సాగుతున్నాయి. అర్నబ్ తుపాను ప్రభావంతో ప్రాథమికంగా 15 జిల్లాల్లో 6.21 లక్షల మంది రైతులకు చెందిన 9.38 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటిలో 8.64 లక్షల ఎకరాల్లో వరి, 39 వేల ఎకరాల్లో అరటి, 10 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 10 వేల ఎకరాల్లో మినుము పంటలు ఉన్నాయి. మురసు తుపాను ప్రభావంతో 9 జిల్లాల్లో 1.86 లక్షల మంది రైతులకు చెందిన 3.33 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
వీటిలో 2.50 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో పత్తి, 11 వేల ఎకరాల్లో మినుము పంటలు దెబ్బతిన్నాయి. అర్నబ్ తుపానుతో రూ.4,500 కోట్లు, మురసుతో రూ.1,900 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అర్నబ్ తుది పంట నష్టం అంచనాలను ఈనెల 6, మురసు నష్టం అంచనాలను ఈనెల 9 నాటికి పూర్తి చేయాలని ఆదేశించినా.. అర్నబ్ నష్టం అంచనాలే దాదాపు పూర్తయ్యాయని, మురసు నష్టం అంచనాలు 35 శాతం కూడా దాటలేదని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు రైతులే స్వయంగా పంట నష్టాన్ని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ తుపాన్లతో అత్యధికంగా నష్టపోయింది చిన్న, సన్నకారు రైతులే అయినా.. గ్రామాల్లో టీడీపీ నేతలు స్వీయ నమోదు ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సిబ్బందిని సైతం తమకు అనుకూలంగా వివరాలు నమోదు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో అసలైన బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మోంథా తుపాను సాయం ఇచ్చేశామంటూ పచ్చి అబద్ధాలు!
మోంథా తుపాను సంభవించి ఏడాది దాటినా బాధిత రైతులకు పరిహారం అందలేదు. ఈ తుపాను ప్రభావంతో 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు తొలుత ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత నష్టాన్ని 3.45 లక్షల ఎకరాలకు కుదించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బాధిత రైతులకు అండగా నిలవడంతో చివరకు 4.27 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు లెక్క తేల్చింది. రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అంచనా వేసి, చివరకు 3.23 లక్షల మంది రైతులకు రూ.411 కోట్లకు కుదించింది. నిధుల విడుదల నాటికి మళ్లీ కోతలు విధించి రూ.280.68 కోట్లకే పరిమితం చేసింది.
ఈ మేరకు జూన్ 30న జీవో ఆర్టీ నెం.70 జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడి నాలుగు నెలలు గడిచినా ఒక్క రైతు ఖాతాలోనూ పైసా జమ కాలేదు. ఇటీవల తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో బాధిత రైతులు ఇదే విషయాన్ని నిలదీస్తే.. మోంథా తుపాను సాయం ఇప్పటికే ఇచ్చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పడం రైతులను విస్మయానికి గురిచేసింది. గడిచిన రెండున్నరేళ్లలో ప్రతి సీజన్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నా ఏ ఒక్క రైతుకూ కరువు సాయం అందలేదు. మోంథాతో పాటు ఈ కాలంలో 20కి పైగా ప్రకృతి విపత్తులు సంభవించినా, కృష్ణా వరదలు మినహా మరే విపత్తుకూ ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. కరువు సాయంతో పాటు ప్రకృతి విపత్తుల పరిహారం కలిపి రూ.2 వేల కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఎగ్గొట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటల బీమాపైనా కపట నాటకాలు..
ప్రీమియం చెల్లించలేదు కాబట్టి కౌలురైతులకు బీమా పరిహారం ఎలా వస్తుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ రెండున్నరేళ్లలో ప్రీమియం చెల్లించిన రైతులకు సైతం బీమా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లపాటు రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచిత పంటల బీమా విధానాన్ని అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి, స్వచ్ఛంద నమోదు విధానం తీసుకొచ్చింది. దీంతో ప్రీమియం భారం రైతులపై పడింది. ఎన్నికల కోడ్ కారణంగా 2024 జూన్‌లో చెల్లించాల్సిన ప్రభుత్వ వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రైతులకు రావాల్సిన రూ.1,385 కోట్ల బీమా పరిహారం నిలిచిపోయిందని విమర్శలు ఉన్నాయి.
రబీ–2024, ఖరీఫ్–2025 సీజన్లలోనైనా ప్రభుత్వ వాటా ప్రీమియం చెల్లించి ఉంటే మరో రూ.2,500 కోట్లకు పైగా పరిహారం అందేదని అంచనా. ప్రభుత్వ ప్రీమియం బకాయిల కారణంగా రబీ–2025 సీజన్లో ఏపీని బీమా కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి. ఆ తర్వాత ఖరీఫ్–2026 సీజన్‌కు బీమా పోర్టల్ తెరిచినా.. సాగు చేయని ప్రాంతాల్లోనూ రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. దరఖాస్తుల్లో పేర్కొన్న పంటలకు, క్షేత్రస్థాయిలో సాగు చేసిన పంటలకు మధ్య వ్యత్యాసాలు ఉండటంతో ఏ ఒక్కరికి పైసా పరిహారం వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
జాడలేని ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, 2,619 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సెప్టెంబర్ 25న జరిగిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ప్రకటించారు. ఈ ఏడాది 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు 31 వేల వాహనాలు, 6.10 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధం చేశామని, 24 వేల మంది సిబ్బందిని వినియోగిస్తామని, నవంబర్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించారు.
దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లకు ఏపీఏఐఎంఎస్ యాప్‌ను అనుసంధానించడంతో పాటు ఈ–పంట నమోదు, ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేయడం రైతులకు అదనపు భారంగా మారింది. తుపాన్లకు నీట మునిగిన పంటను ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో, ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియక పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం నోరుమెదపట్లేదు
ఆరు ఎకరాల కౌలు భూమిలో బోరు కింద వరి సాగు చేశా. ముందస్తుగా చెల్లించిన కౌలుతో కలిపి ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. వరుస తుఫాన్ల కారణంగా కోతకు వచ్చే సమయంలో పంట పూర్తిగా నేలవాలింది. ఎందుకూ పనికిరాకుండా పోయింది. కౌలు భూమి కావడంతో పంట బీమా చేయించుకోలేకపోయా. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం మొత్తం తుపాను పాలైంది. సాయంపై ప్రభుత్వం అసలు నోరుమెదపట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. – రుసుం శ్రీనివాసరావు, రైతు, నకరికల్లు, పల్నాడు జిల్లా
ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యం..
రెండు ఎకరాల్లో కర్పూరం అరటి సాగు చేశా. పంట మంచి దిగుబడితో పక్వానికి వచ్చింది. కార్తీక మాసంలో కర్పూరం అరటి గెలలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే ఎకరాకు రూ.60 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. అరటి గెలలు పడిపోకుండా బొంగులు నిలబెట్టేందుకు ఎకరాకు మరో రూ.40 వేలు ఖర్చు చేశా. అర్నబ్, మురసు తుపాన్లకు తోటంతా నేలకొరిగింది. అరటిచెట్లు విరిగిపోవడంతో పాటు బొంగులు ముక్కలయ్యాయి. అరటి గెలలు దేనికీ పనికిరాకుండా పోయాయి.
ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి నష్టపరిహారం కోసం నివేదిక ఇచ్చినా ఫలితం శూన్యం. గత ఏడాది మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న అరటి తోటకు నేటికీ పరిహారం అందలేదు. పంట కోసం చేసిన అప్పులు తీర్చే దారే కనిపించడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యం. – చిట్నీడి సతీష్, రైతు, సిరివాడ గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా
గతేడాది మోంథా తుపాను సాయం నేటికీ రాలేదు..
ఖరీఫ్‌లో నాకున్న 13 ఎకరాల్లో వరి సాగు చేశా. వర్షాభావంతో ఆకుమడి దశ నుంచే నీటి ఎద్దడి తలెత్తింది. పంటకు నీరు పెట్టడం కష్టంగా మారింది. సాధారణంగా ఎకరాకు రూ.30 వేలు ఖర్చవుతుండగా, ఈ ఏడాది అదనంగా మరో రూ.10 వేలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పంట చేతికొచ్చే సమయంలో రెండు తుపాన్లు దెబ్బతీశాయి. అర్నబ్ తుపానుకు పంటంతా నేలకొరిగింది.
మురసు తుపాను ప్రభావంతో పొలాల్లోకి నీరు చేరి వరి దుబ్బులు కుళ్లిపోయాయి. పంట పాలుపోసుకునే దశలో తుపాన్లు రావడంతో తీవ్రంగా నష్టపోయా. గతేడాది మోంథా తుపాను పరిహారం నేటికీ అందలేదు. ఈ ప్రభుత్వంలో రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం అందని ద్రాక్షగా మారాయి. – కొలుసు గణపతిరావు, రైతు, దెందులూరు, ఏలూరు జిల్లా
ఉచిత పంటల బీమా లేక ఇక్కట్లు
నాకున్న రెండు ఎకరాల్లో అరటి, మూడు ఎకరాల్లో వరి సాగు చేశా. వర్షాభావం కారణంగా బోర్ల ద్వారా నీరు అందించాల్సి వచ్చింది. అరటి సాగుకు ఎకరాకు రూ.70 వేల చొప్పున కౌలు చెల్లించడంతో పాటు, రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. వరి సాగుకు ఎకరాకు రూ.40 వేల కౌలు, మరో రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టా. తుపాన్ల దెబ్బకు 1.50 ఎకరాల్లో అరటి, ఎకరంలో వరి పంట పూర్తిగా నేలమట్టమయ్యాయి. వరుస తుపాన్లతో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. ఉచిత పంటల బీమా లేక ఇక్కట్లు పడుతున్నాం. గతేడాది మోంథా తుపాను పరిహారం కూడా నేటికీ నా ఖాతాలో జమ కాలేదు. – శిరసాని సోమిరెడ్డి, రైతు, కొల్లిపర, గుంటూరు జిల్లా

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. ఎకరాకు రూ.40 వేల చొప్పున కౌలు చెల్లించి, మరో రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టా. మరో పది రోజుల్లో పంట కోతకు వస్తుందనగా రెండు తుఫాన్లు కోలుకోలేని దెబ్బతీశాయి. చేలల్లో వరి కంకులు నేలకొరిగి నీటిలో నానుతున్నాయి. పడవలపై వెళ్లి కోత కోసినా ఫలితం దక్కడం లేదు. కోతకు భారీగా ఖర్చవుతుండటంతో పంటను వదిలేయాల్సి వచ్చింది. 20 ఎకరాల్లో చేతికొచ్చిన పంట కళ్లెదుటే కుళ్లిపోతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. కౌలుతో సహా దాదాపు రూ.15 లక్షల వరకు నష్టపోయా. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి కనిపించడం లేదు. ప్రభుత్వం ఆదుకోవట్లేదు. మా పరిస్థితి దయనీయంగా మారుతుంది. – మోటుపల్లి రాజు, కౌలు రైతు, మాదివాడ, పశ్చిమగోదావరి జిల్లా
అధికారులెవ్వరూ రావడంలేదు..
సొంతంగా 50 సెంట్లు, కౌలుకు రెండు ఎకరాలు తీసుకుని వరి సాగు చేశా. వరుస తుఫాన్ల ప్రభావంతో పంట పూర్తిగా నేలపాలైంది. పంట మరింత దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో పసిరిగానే కోత కోశా. ఇప్పుడు ఎండబెడుతున్నా.. ధాన్యానికి ఎంత ధర వస్తుందో, అసలు అమ్ముడవుతుందో లేదో తెలియడం లేదు. ఇప్పటివరకు ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు పెట్టా. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూస్తున్నా. దెబ్బతిన్న పంటను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రోజూ అడుగుతున్నా.. ఇదిగో వస్తాం, అదిగో వస్తాం అంటున్నారే తప్ప రావడం లేదు. రైతు సేవా కేంద్రానికి రెండు, మూడుసార్లు వెళ్లినా అధికారులు అందుబాటులో లేరు. – లుక్కా అమలేశ్వరరావు, రైతు, కొంకేపూడి, కృష్ణా జిల్లా

వైఎస్ జగన్ ప్రభుత్వంలో వెంటనే పరిహారం
ఆరు ఎకరాలు కౌలుకు, మరో మూడు ఎకరాలు సొంత భూమిలో వరి సాగు చేశా. ఎకరాకు రూ.45 వేల వరకు పెట్టుబడి పెట్టా. మరో పది రోజులు ఆగితే పంట చేతికి వచ్చేది. ఆర్నబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట నేలకొరిగింది. మురసు తుపానుకు మిగిలిన ఆరు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించేది.
ఏ విపత్తుతో పంట నష్టపోయినా ఏడాది తిరక్కుండానే పరిహారం అందేది. కానీ కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భరించలేక బీమా చేయించుకోలేదు. దీంతో పరిహారం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడాది మొంథా తుపాను పరిహారం కూడా నేటికీ జమ కాలేదు. ఇలాగేఉంటే వ్యవసాయం వదిలేయడం తప్ప మాకు మరో దారి కనిపించడం లేదు. – ఇంటి వెంకట్రావు, రైతు, వికె రాయపురం, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా
వరదలో కొట్టుకుపోయిన మిర్చి పంట.. రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి నష్టం!
చెరుకుమల్లి శ్రీనివాసరావు, సందెపూడి, యడ్లపాడు మండలం, పల్నాడు జిల్లా: 30 ఏళ్లుగా వ్యవసాయమే జీవనాధారం. ఈ ఏడాది రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని ఆరుమూరి రకం మిర్చి సాగు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి.. రెండు ఎకరాలకు రూ.40 వేల కౌలు ముందస్తు చెల్లింపు. అర్నబ్ తుపానుకు పడిపోయిన మొక్కలను 15 మంది కూలీలతో తిరిగి నిలబెట్టి, మందులు కొట్టి పంటను కాపాడుకున్నారు. మరో నెలలో 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించారు.
ఇంతలో మురసు తుపానుతో నల్లమడ వాగు పొంగి, కట్టలు తెగి రెండు రోజుల పాటు పంటపై వరద ప్రవహించడంతో రెండు ఎకరాల మిర్చి పూర్తిగా నాశనం. పంట బీమా చేయించుకోకపోవడంతో పరిహారంపై అనిశ్చితి. గత ఏడాది మోంథా తుపాను నష్టపరిహారం కూడా అందలేదు. పొలంలోని వ్యర్థాలు తొలగించేందుకే మరో రూ.5 వేల ఖర్చు. తిరిగి సాగు చేయడానికి పెట్టుబడి లేదు.. ప్రత్యామ్నాయ పంటకు నీటి సదుపాయం లేదు. 30 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉన్నా.. ఇప్పుడు మళ్లీ సాగు ఎలా ప్రారంభించాలో దిక్కుతోచని పరిస్థితి.
మురసు దెబ్బకు ఏడెకరాల పత్తి నాశనం.. రూ.2 లక్షల నష్టం!
కొర్లగంటి మస్తాన్‌రావు, గణపవరం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా: ఎకరంన్నర సొంత పొలంతో పాటు ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు. ఎకరాకు రూ.40 వేలకుపైగా పెట్టుబడి. మురసు తుపానుతో ఏడెకరాల పత్తి పూర్తిగా నీట మునిగి, ఇసుక మేటలు వేసి మొక్కలు కుళ్లిపోయాయి. పత్తి తీసేందుకు కూలీ ఖర్చులు కూడా రావని పంటను వదిలేసిన పరిస్థితి. ఫసల్ బీమా కింద ఎకరాకు రూ.1,900 ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదు. గత ఏడాది మోంథా తుపాను నష్టపరిహారం కూడా రాలేదు. ఈ ఏడాది సుమారు రూ.2 లక్షల పెట్టుబడి నష్టం. వరుస తుపాన్లతో పంటలు పోతున్నా బీమా, పరిహారం అందక అప్పులు ఎలా తీర్చాలో తెలియని దుస్థితి.

ఖరీఫ్, రబీ పంటలకు ఎకరాకు 30 బస్తాల కౌలు
ఒప్పందంతో 8 ఎకరాలు సాగు చేస్తున్నా.. ఖరీఫ్ పంటకు రూ.2.40 లక్షల పెట్టుబడి. అర్నబ్ తుపాను దెబ్బకు ఐదు ఎకరాల్లో వరి పూర్తిగా నేలవాలి మొలకెత్తి కోతకు పనికిరాకుండా పోయింది. మిగిలిన మూడు ఎకరాల్లో కేవలం 30 బస్తాల దిగుబడే వచ్చే పరిస్థితి. నేలవాలిన పంట కోతకు మూడు రెట్లు ఖర్చు కావడంతో రూ.27 వేలు కోతకే, మరో రూ.3 వేలు ఆరబోతకు ఖర్చు. రూ.50 వేల ధాన్యం విలువలో చేతికి మిగిలేది కేవలం రూ.20 వేలే. గత ఏడాది మొంథా తుపానుతో 70 శాతం పంట నష్టపోయినా పరిహారం అందలేదు. ఈ ఏడాది అర్నబ్, మురసు తుపాన్లతో మళ్లీ సర్వం కోల్పోయా. పెట్టుబడి పోయింది.. పరిహారం లేదు.. ఇక ఎలా బతకాలో తెలియడం లేదు. – సంగీత నారాయణరావు, కొత్తపేట, కోనసీమ జిల్లా


