బాబు పీపీపీ స్కెచ్‌.. ఇది పక్కా స్కామ్‌ | Former CM YS Jagan lashes out at CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు పీపీపీ స్కెచ్‌.. ఇది పక్కా స్కామ్‌

Nov 12 2026 4:56 AM | Updated on Nov 12 2026 4:56 AM

Former CM YS Jagan lashes out at CM Chandrababu

సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలను తెగనమ్ముతున్నారు 

రూ.వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు 

సగానికిపైగా మెడికల్‌ సీట్లను అమ్ముకునే అవకాశం..  

వీజీఎఫ్‌ పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ 

భూములు ప్రభుత్వానివి.. భవనాలన్నీ ప్రభుత్వ నిధులతోనే.. 

వీజీఎఫ్‌ రూపేణా ఇవ్వనున్న డబ్బు కూడా ప్రజాధనమే.. 

సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే.. 

మరి ప్రైవేటు సంస్థల పేరిట  స్కామ్‌ కాకపోతే ఇది ఏమిటి?  

మేం తీసుకొచ్చిన ఈ మెడికల్‌ కాలేజీలన్నీ.. టీచింగ్‌ ఆస్పత్రులే 

పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యంతోపాటు సగం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ  

మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటుతో పోలిస్తే అతి తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి 

ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేం పటిష్ట మోడల్‌ రూపొందించాం 

అలాంటి ఏర్పాట్లు ఉండగా.. పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది బాబూ? 

ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా?  

సాక్షి, అమరావతి: ‘‘మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చి, వాటిల్లో 5 కాలేజీలను అప్పట్లోనే ప్రారంభించి, మరో మూడు కాలేజీలను తరగతులకు కూడా సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1,000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. అయితే వాటిని పూర్తి చేయకుండా పీపీపీలో తెగనమ్ముతున్నారు’’అని చంద్రబాబు సర్కార్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

రూ.వందల కోట్ల విలువైన భూములకు ఎకరా రూ.100 లీజు.. సగానికిపైగా మెడికల్‌ సీట్లు అమ్ముకునే అవకాశం.. రూ.1,630 కోట్లు వీజీఎఫ్‌ పేరిట మళ్లించడం చూస్తుంటే చంద్రబాబు పీపీపీ స్కెచ్‌ పక్కా స్కామ్‌ అని అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సేవ్‌ మెడికల్‌ కాలేజీస్‌ ఇన్‌ ఏపీ’’అని బుధవారం తన ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఈ మేరకు పోస్ట్‌ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..   

ఇది దోపిడీ కాక ఏమిటి? 
చంద్రబాబూ..! పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను, ప్రజల సంపదను పీపీపీ ముసుగులో కట్టబెట్టేందుకు మీరు భారీ స్కాం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు కూడా సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1,000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కానీ మీరెందుకు ఆ పని చేయడం లేదు? మీ పీపీపీ స్కెచ్‌ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా? కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు. 

రూ.వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు. సగానికిపైగా మెడికల్‌ సీట్లను అమ్ముకునే అవకాశం, ఈ కాలేజీలకు వీజీఎఫ్‌ పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ.. అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం! మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు.. రెండేళ్లకు రూ.120 కోట్లు.. ఒక్కో కాలేజీకి! భూములు ప్రభుత్వానివి.. భవనాలన్నీ ప్రభుత్వ నిధులతోనే నిర్మించినవి! వీజీఎఫ్‌ రూపేణా ఇవ్వనున్న డబ్బు కూడా ప్రజాధనమే. సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట స్కామ్‌ కాకపోతే ఇది ఏమిటి?  

కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా? 
మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీ కూడా టీచింగ్‌ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు.. సగం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటుతో పోలిస్తే అతి తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో.. ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేం గతంలో రూపొందించాం. నిధుల కోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీ కూడా చేశాం. టీచింగ్‌ ఆస్పత్రులు కాబట్టి ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. 

టీచింగ్‌ ఆస్పత్రుల వల్ల ఈ మెడికల్‌ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా.. పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేకాదు ఈ మెడికల్‌ కాలేజీలు ఆయా జిల్లాల పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌తో అనుసంధానమై ఒక నెట్‌వర్క్‌ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్య సేవల క్వాలిటీ పెరగడంతో.. తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా?  

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పూర్తిగా నిలిపేశారు
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దెబ్బతీశారు. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులు బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో ఆ తర్వాత కూడా రూ.3 వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో ఆ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి. 

మా హయాంలో జీఎంపీ/డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల మేరకు మందులు అందిస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4 శాతానికి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళం పాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాత పరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు. విలేజ్‌ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు. ️108, 104 పరిస్థితి అగమ్య గోచరంగా తయారు చేశారు.  

స్కామ్‌లు, ఆస్తులను లూటీ చేస్తుంటే ప్రజలు ఊరుకోరు 
బాబు తీరును ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా సరే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా చంద్రబాబు ముందడుగు వేయడం దుర్మార్గం. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఈ స్కామ్‌లో ఎవరు భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అరెస్టులకూ వెనుకాడం. మీరు స్కామ్‌లు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ఊరుకోరు. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement