సాక్షి, కాకినాడ: అర్నబ్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అందించాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాకినాడలోని సంజయ్ నగర్, దుమ్ములపేట, నూకలమ్మ మాన్యం ప్రాంతాల్లో టీడీపీ నేతలు రేషన్ బియ్యం కోసం కూపన్లు (స్లిప్పులు) పంపిణీ చేస్తున్నారు.
అయితే అందులో టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారంటూ పలువురు బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్లిప్పులు లేకుండా రేషన్ దుకాణాలకు వెళ్తే బియ్యం ఇవ్వడం లేదని, ముందుగా కూపన్లు తెచ్చుకోవాలని డీలర్లు చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.
దీంతో తుఫాన్ బియ్యం కోసం రేషన్ దుకాణాల వద్ద బాధితులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అందించే సహాయం పొందేందుకు కూడా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి ఎలాంటి వివక్ష లేకుండా రేషన్ బియ్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి


