అబద్దం చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి అని అంటారు. ఎందుకంటే అబద్దం చెబుతూ దొరికిపోతే పరువు తక్కువ అవుతుందని అంతా భావిస్తారు. కాని రాజకీయనేతలలో కొందరు అబద్దం ఆడడానికి అసలు భయపడరు. ఆ కోవలో ఉండే నేతలలో చంద్రబాబు ముందు వరసలో ఉంటారేమో అన్న వ్యాఖ్యలు తరచు వింటుంటాం. వాటిని ఆయన నిజం చేస్తూ ప్రసంగాలు చేస్తుంటారు. మీడియాకు చెబుతారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో, వెలుపల ఒక మాట పదే,పదే చెబుతుండేవారు. చంద్రబాబు కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవ చేసేవారు. ఆ వ్యవహార శైలి ఇప్పటికీ కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపద్యంలో చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. చంద్రబాబు చెప్పిన విషయాలు విన్నవారికెవరికైనా, వీటిలో చాలా అసత్యాలు ఉన్నాయి కదా అనిపించవచ్చు. కాని ఆ సమావేశంలో పాల్గొనే మీడియా ప్రతినిధులు వాటిని ప్రస్తావించి ప్రశ్నించే ధైర్యం చేయకపోతే, ప్రజలు ఏమి చేయగలుగుతారు!ఎక్కువ సందర్బాలలో ఆయన అబద్దాలు చెప్పడానికే అలవాటుపడ్డారన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో ఏర్పడింది. చంద్రబాబు చెప్పిన కొన్ని విషయాలను చూద్దాం. రఫ్పా,రఫ్పా రాజకీయాలను తిప్పికొట్టారు.. అని చంద్రబాబు అన్నారని ఈనాడు మీడియా బ్యానర్ కధనంగా ఇచ్చింది. ఇందులో వాస్తవం ఎంత ఉందో చంద్రబాబుకు తెలుసు.ఈనాడు మీడియాకు తెలుసు. కాని ఇద్దరి మద్య ఉన్న మాచ్ ఫిక్సింగ్ కారణంగా ఈ తరహా ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తుంటుంది.అది వేరే విషయం.
రఫ్పా , రఫ్పా అని ఎప్పుడో ఒక వైఎస్సార్‌సీపీ అభిమాని ఒక హోర్గింగ్ పెట్టారట. దానిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేశారు.ఇది జరిగి సంవత్సరం దాటిపోయినా చంద్రబాబు మాత్రం అదే ప్రచారం చేస్తుంటారు. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు కత్తుల,కటార్లతో దాడులు చేసి హత్యలు చేసిన ఘటనలు ఈ రెండున్నర ఏళ్లలో అనేకం ఉన్నాయి.అయినా అవన్ని రఫ్పా,రఫ్పా కింద రావని జనం అనుకోవాలనుకోవలన్నమాట.మున్సిపల్,జడ్పి,మండల ఎన్నికలలో ఏమి జరిగిందో అంతా చూశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డం పడడం,నామినేషన్ పత్రాలు లాక్కోవడం వంటివి చేస్తే అది రఫ్పా,రఫ్పా కిందకు రాదన్నమాట. మహిళలని కూడా చూడకుండా కొందరు టీడీపీ వారు దాడులు చేసి ఎన్నికలలో పోటీచేయనివ్వకుండా నిరోధిస్తే, అది రఫ్పా,రఫ్పా కాదా!అంతకన్నా దారుణం.. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా తరిమివేసినా చంద్రబాబు స్వేచ్చగా ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు.
పులివెందులలో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో దర్నా చేయాల్సి వచ్చిందంటే ఏపీకి సూపర్ బ్రాండ్ ఉందని జనం నమ్మాలన్నమాట. పెట్రోల్ బాంబులు విసిరే దశకు ఎన్నికలు వెళ్లాయి.ఫేక్ నామినేషన్లు వేసిన కొత్త చరిత్ర కూడా టీడీపీకే దక్కింది.ఇన్ని ఘోరాలు, ఇంత హింసాకాండ జరిగినా, అసలేమీ కానట్లే చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయన నిజం చెబుతున్నట్లా? అసత్యం చెబుతున్నట్లా?పలు చోట్ల పోలీసు అధికారులే టీడీపీ రిగ్గింగ్ లకు దగ్గరుండి సహకరిస్తే అది సుపరిపాలన అని చంద్రబాబు చెబితే ఒప్పుకోవాలన్నమాట! గతంలో టీడీపీ ఏజెంట్ మాదిరి పనిచేసిన నిమ్మగడ్డ రమేస్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఆనాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆయన ఎన్ని ఆటంకాలు సృష్టించారో తెలుసు. వాటన్నిటిని తట్టుకుని అప్పట్లో వైఎస్సార్‌సీపీ గెలిచింది.
ఇప్పుడు కూడా చంద్రబాబు నియమించిన వ్యక్తే కమిషనర్ గా ఉన్నారు.ఆయన ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి టీడీపీ సేవలో తరించారన్న విమర్శను వైఎస్సార్‌సీపీ చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీసంస్థ మాదిరి వ్యవహరిస్తే అది గొప్ప విషయం అవుతుందా? ఇంత జరిగినా వైఎస్సార్‌సీపీకి ఈ స్దాయిలో జడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలు లభించడం ప్రజాభిమానానికి దర్పణం పడుతుంది. పులివెందులలో ఎంత అరాచకం జరిగినా, రిగ్గింగ్ చేసుకున్నా, అంతిమంగా అన్ని ఓట్లు కలిపితే వైఎస్సార్‌సీపీకే మూడువేల పైగా ఓట్లు మెజార్టీ వచ్చిందన్న అంశం చంద్రబాబుకు చేదు వంటిదే. టీడీపీకి గట్టి పట్టు ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం వంటి చోట జడ్పీటీసీని వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం కూడా గమనించవలసిన పరిణామమే. చంద్రబాబు జన్మస్థలం అయిన చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ జడ్పిటిసిని మాజీ ఎమ్మెల్యే ,వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి గెలవడం ఒక విధంగా సంచలనం. అల్లూరి జిల్లా పరిషత్ ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం కీలకమైన సంగతి.
దీనిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా కనిపిస్తాయి. మత మార్పిడుల ప్రభావం అని ఆయన అంటున్నారంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగునా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. మరి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి రూరల్ లో ఏ మతమార్పిడులు టీడీపీని ఓడించాయి? అలాగే ఒక మహిళ వాకర్ తో డ్రామా నడిపిన సంగతి బహిర్గమైన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆమెకు మద్దతుగా మాట్లాడడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. అందులో నిజం ఉన్నట్లయితే అక్కడే ఉన్న పోలీసులు ఆమెను తోసినట్లు చెబుతున్న వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదో తెలియదు.
ఇంత జరిగిన తర్వాత ఆమె ఓటమిపాలవడం ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా జనం పాలనను మెచ్చుకున్నారని చంద్రబాబు అంటున్నారు. అది సత్యమా?అసత్యమా?అన్నది ఆయనకు తెలియకుండా పోతుందా?జగన్ టైమ్ లో పోర్టులు,మెడికల్ కాలేజీల నిర్మాణం,స్కూళ్ళు, ఆస్పత్రుల ఆదునీకరణ, సచివాలయ వ్యవస్థ వంటి ఎన్నో సంస్కరణలు తీసుకువస్తే అదేమో ఏపీ బ్రాండ్ పోయినట్లట.అలాంటివేమీ చేయకపోయినా, ఈ రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసిన కూటమి సర్కార్ ఏపీ బ్రాండ్ ను నిలబెట్టినట్లట. ఈవిఎమ్,బాలెట్ విధానాలు రెండిటిలో గెలిచామని ఆయన చెప్పుకునే యత్నం చేస్తున్నారు.
కాని అసెంబ్లీ ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల మిస్టరీపై ఎందుకు మాట్లాడరు? స్తానిక ఎన్నికలలో బాలెట్ రిగ్గింగ్ పై నిష్పాక్షిక విచారణకు ఒప్పుకుంటారా?ఏ తరహా ఎన్నికైనా ,రిగ్గింగ్ చేయడం ద్వారా గెలవవచ్చని చంద్రబాబు రుజువు చేశారా అని భావించాలా అన్నది వైఎస్సార్‌సీపీ ప్రశ్న?అందుకే చంద్రబాబును రిగ్గింగ్ మాస్టర్ అని జగన్ అభివర్ణించారు. ఈవీఎంలపైన, నోట్ల రద్దు వంటి అంశాలపైన చంద్రబాబు గత కొన్నేళ్లలో ఎన్నిసార్లు మాటలు మార్చింది ఆయన మనసుకు తెలియదా!23 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష కోట్ల ఉద్యాన హబ్ వంటి వివిధ అంశాలలో వాస్తవాలు ఎంత అన్నది ప్రశ్నార్దకమే! ఈ నేపధ్యంలో చంద్రబాబు ధైర్యంగా అబద్దాలు చెబుతారన్న వ్యాఖ్యలు నిజమేనని అంగీకరించక తప్పదా! అవును! నిజాలు చెప్పడానికి నిజాయితీ కావాలి.అబద్దాలు చెప్పడానికి ధైర్యం కావాలన్న సంగతిని ఒప్పుకోవల్సిందే!.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


