అగౌరవపరిచి.. ఆహ్వానాలా? | Andhra University Under Fire Over Defence Studies Centre Closure Ahead Of Kovind Visit, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అగౌరవపరిచి.. ఆహ్వానాలా?

Nov 11 2026 11:55 AM | Updated on Nov 11 2026 12:04 PM

Andhra University Defence Centre Closure Row Ahead Of Kovind Visit

విశాఖ విద్య: ఆర్భాటపు స్వాగతాలు.. ఘనమైన ఏర్పాట్లు.. ఇవన్నీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేస్తున్న హడావుడి. కానీ ఎనిమిదేళ్ల క్రితం ఆయన రాష్ట్రపతి హోదాలో ప్రారంభించిన ప్రతిష్టాత్మక రక్షణ అధ్యయన కేంద్రాన్ని నిర్వీర్యం చేసి అగౌరవపరిచిన పాలకవర్గం.. ఇప్పుడు దాని వ్యవస్థాపకుడికి స్వాగతం పలికేందుకు మాత్రం హైరానా పడుతుండటాన్ని విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏయూను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ యంత్రాంగం వివాదాస్పద నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.

ఎనిమిదేళ్ల క్రితం ఘనంగా ప్రారంభం..
2017, డిసెంబర్‌ 7న భారత రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ను ప్రారంభించారు. త్రివిధ దళాలకు చెందిన సిబ్బందికి ఉన్నత విద్యావకాశాలు కల్పించడంతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే ఇది ఏయూకు ప్రత్యేక గుర్తింపుగా నిలవడంతో పాటు ఆదాయ వనరుగా కూడా మారింది. వివిధ రక్షణ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్యా, పరిశోధనా కార్యక్రమాలను విస్తరించింది. పీహెచ్‌డీ కోర్సులు నిర్వహించే స్థాయికి తీసుకెళ్లి, ప్రత్యేక స్కూల్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌గా అభివృద్ధి చేయాలని గతంలో విశ్వవిద్యాలయ సెనేట్‌ సైతం నిర్ణయించింది.

నాక్‌ గుర్తింపులోనూ కీలక పాత్ర
రక్షణ అధ్యయన కేంద్రం కార్యకలాపాలు ఏయూ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పాయి. 2023లో జరిగిన నాక్‌ గుర్తింపు ప్రక్రియలో విశ్వవిద్యాలయం తన ప్రత్యేక విజయాలుగా ప్రస్తావించిన అంశాల్లో ఈ కేంద్రం కార్యకలాపాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ విభాగానికి సంబంధించి 400కి 400 పాయింట్లు సాధించినట్లు అధికారులే చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కేంద్రాన్ని మరింత విస్తరించాల్సింది పోయి.. చివరకు మూసివేయడం విమర్శలకు తావిస్తోంది.

మూసివేతతో అవకాశాలకు గండి..
ఏయూ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.పి.రాజశేఖర్‌ హయాంలో 2025లో ఈ కేంద్రాన్ని మూసివేయడం వివాదాస్పదమైంది. సంబంధిత వర్గాల అభిప్రాయాలను, కేంద్రం భవిష్యత్తుపై స్పష్టత లేకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇక్కడ కొనసాగిన విద్యా, పరిశోధనా కార్యక్రమాలకు విఘాతం కలగడమే కాకుండా, ఆయా అవకాశాలు ఇతర సంస్థలకు, ముఖ్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు మళ్లినట్లు పలువురు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయూకు ప్రత్యేక గుర్తింపు, ఆదాయం తెచ్చిపెట్టిన కేంద్రం నేడు నిరుపయోగంగా మారడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సెలవు రద్దు చేశారు.. సమాధానం చెబుతారా?
మాజీ రాష్ట్రపతి ప్రసంగాన్ని విద్యార్థులు, అధ్యాపకులు వినాలనే ఉద్దేశంతో రెండో శనివారం సెలవును రద్దు చేస్తూ ఏయూ యంత్రాంగం సర్క్యులర్‌ జారీ చేయడం చర్చనీయాంశమైంది. మాజీ రాష్ట్రపతి పర్యటనకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు.. ఆయన స్వయంగా ప్రారంభించిన కేంద్రాన్ని ఎందుకు మూసివేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అని విద్యావర్గాలు నిలదీస్తున్నాయి. దేశ రక్షణలో సేవలందించే సైనిక, నౌకాదళ, వాయుసేన సిబ్బందికి ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన కేంద్రాన్ని మూసివేయడం వారి సేవలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నాయి.

స్వాగతం సరే.. ఆత్మపరిశీలన ఏదీ?
మాజీ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకడం, ఆయన ప్రసంగానికి ఏర్పాట్లను పక్కనపెడితే.. ఆయన ప్రారంభించిన సంస్థకు జరిగిన పరిణామాలపై కూడా యూనివర్సిటీ యంత్రాంగం సమాధానం చెప్పాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం మూసివేతకు దారితీసిన పరిస్థితులేమిటి? తిరిగి ప్రారంభించే ఆలోచన ఉందా? గతంలో సాధించిన గుర్తింపును పునరుద్ధరించేందుకు ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే మాజీ రాష్ట్రపతి పర్యటన మరో ఆర్భాటపు కార్యక్రమంగానే మిగిలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రారంభించిన కేంద్రాన్నే కొనసాగించలేని యంత్రాంగం.. ఇప్పుడు ఆయనకు ఏ ముఖం పెట్టుకుని స్వాగతం పలుకుతుందని విద్యావేత్తలు సైతం ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement