టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన సామగ్రి
కోనసీమ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటు వేశారనే కక్షతో ఆ పార్టీ కార్యకర్త కుటుంబంపై టీడీపీ నాయకుడు, అతడి బంధువులు దాడికి పాల్పడ్డారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీకి చెందిన మల్లాడి శ్రీలక్ష్మి, ఆమె భర్త మల్లాడి శ్రీనుపై తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు మల్లాడి లోవరాజు, అతని బంధువులైన బలుసుతిప్పకు చెందిన సుమారు 30 మంది దాడికి పాల్పడ్డారు. శ్రీను ఇంటిపైకి వెళ్లి ఇనుప రాడ్లతో దాడి చేశారు.
ఇంటి ఆవరణలోని మోటార్ సైకిళ్లను, సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇంట్లోకి కూడా చొరబడి టీవీ, ఫర్నిచర్, వంట సామగ్రి, బీరువా పగులగొట్టి సామగ్రి ధ్వంసం చేశారు. శ్రీలక్ష్మిని జుట్టు పట్టుకొని ఈడ్చేసి, పిడిగుద్దులు గుద్దారు. దుస్తులు పూర్తిగా చిరిగిపోయినా వదల్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి సమయంలో చుట్టుపక్కల మహిళలు అడ్డుకున్నా లెక్క చేయలేదు. కాగా.. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లాడి శ్రీనును స్థానికులు ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద తనను టీడీపీ నేతలు బెదిరించారని, వైఎస్సార్ సీపీకి ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని శ్రీను చెప్పారు. ఈ క్రమంలోనే తమ ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు.


