తాడేపల్లి: ఇతరుల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడవద్దని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమను ఆదేశించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తెలిపారు. అలాంటి నీతి చంద్రబాబు కూటమికి ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు.
తాడేపల్లిలో లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వారి కుటుంబాలను సరిగా చూసుకోకుండా వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై ఎందుకు ఆరోపణలు చేస్తారు? పవన్ కల్యాణ్ సైతం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై మాట్లాడారు. సిగ్గు ఉంటే పవన్ కల్యాణ్ తన మాటలపై పునఃపరిశీలన చేసుకోవాలి. పవన్ కల్యాణ్ పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు తన వ్యక్తిగత జీవితం ఆదర్శంగా ఉండాలి. మహిళలపై జనసేన నేతలు, కార్యకర్తలు లైంగిక దాడులు చేస్తున్నారు. మహిళలపై అరాచకాలు చేస్తున్నారు.
పవన్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇతరుల జోలికి వెళ్లకూడదనీ, అబద్దాలు ట్రోల్స్ చెయకూడదని పవన్ ఏనాడైనా చెప్పారా? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తే పవన్ దాన్ని అందిపుచ్చుకున్నారు. వాస్తవాలతో పని లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేశారు. అసలు పవన్ కల్యాణ్ ఎప్పటికీ లీడర్ కాలేరు. చంద్రబాబు చెంతన చేరి మరింత నీచ రాజకీయాలు చేయటం సిగ్గు చేటు. ప్రజలను గాలికి వదిలేసి చంద్రబాబు భజనలోనే పవన్ ఉన్నారు.
సొంత పార్టీలోని మహిళలకు అన్యాయం జరిగినా పవన్ పట్టించుకోలేదు. గీతాంజలి అనే మహిళకు ఇంటి స్థలం వచ్చిందని చెబితే ట్రోల్స్ చేసి చంపేశారు. ఐ-టీడీపీ చేస్తున్న దారుణాలపై పవన్ ఎందుకు మాట్లాడరు? మహిళల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబును అదే మహిళలు రాజకీయ సమాధి చేస్తారు. చంద్రబాబులాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకోవటం దుర్మార్గం. సొంత చెల్లెళ్లను కూడా కనీసం ఇంటికి పిలవని చంద్రబాబు పవన్‌కు ఆదర్శమా?’’ అని నిలదీశారు.


