నక్కెర పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! | Sagubadi: Amagzing Benefits Of Nakkera fruit | Sakshi
Sakshi News home page

నక్కెర పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Nov 20 2026 10:35 AM | Updated on Nov 20 2026 10:35 AM

Sagubadi: Amagzing Benefits Of Nakkera fruit

నక్కెర పండు జనంలోకి అంతగా చేరలేదు. కానీ ఈ పండు సింధూరం రంగులో తెల్లటి మైనపు పూతతో చాలా  ఆకర్షణీయంగా గోళీకాయంత ఉంటుంది. ఇవి ఒకటి లేక రెండు–మూడు ఒకే దగ్గర ఉంటాయి. అడవిలో చెట్లపై పండిన పండ్లను అల్లంత దూరం నుంచి చూసి ఇది నక్కెర చెట్టని గుర్తించవచ్చు. అంతటి రంగు కల్గిన పండ్ల చెట్టు ఇది. ఈ పండ్లలో నిమ్మ పండు రంగు ఉన్నవి కూడా ఉన్నాయి.  

ఉనికి:
నక్కెర చెట్లకు వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే గుణం ఉంది. ఇది ఉష్ణమండలం, చలి ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉష్ణ మండల ప్రాంతాల్లో దీని ఉనికి ఉంది. నక్కెర ఎద్దడిని తట్టుకొని నిలువ గలదు. ఇది 500 మిల్లీమీటర్ల వర్షపాతమున్న ప్రాంతాల్లో కూడా ఎదుగుతుంది. వీటికి పదునైన ముళ్లు ఉంటాయి. ఈ చెట్టు అధిక కొమ్మలతో కూడుకొని ఉంటుంది. ఎత్తు ఇంచుమించు 5–7 మీటర్లు పెరుగుతుంది. 

వీటి స్వస్థలం (సహజంగా లభించే ప్రాంతాలు) ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాలు, ఆగ్నేయాసియా, న్యూజిలాండ్, పసిఫిక్‌ ద్వీపాలు, వెస్ట్‌ఇండీస్, మధ్య ఉత్తర–దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా. సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తువరకు వీటి ఉనికిని గమనించవచ్చు. ఈ పండ్ల చెట్లు ప్రపంచంలో చాలా దేశాల్లో విస్తరించి ఉన్నందున దీని ఉనికికి ఎలాంటి ప్రమాదం లేదు. దీన్ని సాగుకు అనువుగా చేయలేదు. దీన్ని (Least Categorised & LC) గ్రూపులో చేర్చారు. ఏదైనప్పటికీ పరిశీలన, ప్రయోగాలు కొనసాగింపు చేసినప్పుడే దాని ఉనికి అనేది బయటి ప్రపంచానికి తెలుస్తుంది.   

నల్లమల అడవుల్లో, ప్రత్యేకించి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని అడవుల్లో, నక్కెర చెట్లు అనేకం ఉన్నాయి. చిట్టడవుల్లో కూడా నక్కెర ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ్ల చెట్లు ఉన్నప్పటికీ, జనానికి అంత చేరువగా లేవు. కొంతవరకు ఇవి–పక్ష్యాదులకు ఉపయోగపడుతున్నాయి. ఇంతటి పోషక విలువలు ఉన్న ఈ పండ్ల జాతిపై సమగ్రంగా పరిశీలన, పరిశోధన ఎంతైనా అవసరం. 

ఎద్దుల పాదాల్లో(గిట్టెలు) పురుగుల నివారణకు నక్కెరాకు, బిల్లుడాకు కలిపి దంచిన మిశ్రమాన్ని, పురుగులు పడ్డ దగ్గర పెడితే పురుగులు చనిపోవటంగానీ, పుండు నుంచి కింద పడిపోవటం గానీ జరుగుతుంది. ఈ చికిత్స నాడు–నేడు కూడా అక్కడి గిరిజనులు, ఇతరులు వాడుతున్నారు.  

ఉపయోగాలు :   
ఇతర పండ్ల చెట్లవలె నక్కెర కూడా ఎన్నో ఉపయోగాలు కలిగినది. చెట్టు పెద్దగా ఉండదు కానీ దీని నుంచి బొగ్గును తయారు చేసి వంట చెరకుగా వాడతారు.  ఓ మోస్తరు కొమ్మలను రోకలిబండకు ఎక్కువగా వాడుతారు. పొలం చుట్టు కంచెగా వాడవచ్చు. పండ్లను నేరుగా తినవచ్చు. మంచిగా పండినవి రుచికరంగా ఉంటాయి. కానీ గుజ్జు చాలా స్వల్పంగా ఉంటుంది. గింజ శాతం ఎక్కువ. ఈ పండ్ల గుజ్జు నుంచి జామ్, జెల్లిలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చు. 

గింజల్లో 60% నూనె ఉంటుంది. ఈ నూనెను ఆఫ్రికా దేశాల్లో బటర్‌ రూపంలో వాడతారు. ఈ నూనెను అనేక విధాలుగా అంటే.. కండిషనర్స్‌గా బాడీ లోషన్లలో, తలవెంట్రుకల నూనెల్లో, సబ్బుల తయారీలో, లూబ్రికెంట్స్‌ (కందెనలు), పెదవుల సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. చెట్టు చేవ నుంచి, పూల నుంచి కూడా నూనె తీయవచ్చు. దాన్ని ఫ్యుమిగేషన్‌ మొదలగు పనుల్లో వాడతారు. మలేరియా, చర్మవ్యాధులు, సుఖరోగాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, దగ్గు, చలి, విరేచనాలు తగ్గించటానికి వాడతారు. కంటి మందును కూడా తయారు చేస్తారు. 

నోటిలోషన్‌ ముఖ్యంగా పిప్పిపళ్ళ నుంచి గొంతు సంబంధిత జబ్బులను నయం చేయటానికి వాడతారు. ఆకులను యాంటిడోట్‌గా కూడా వాడతారు. వేర్లను అనేక జబ్బులను అంటే చర్మ వ్యాధులు, తలనొప్పులను, లెప్రసీ, రక్తపు విరేచనాలు, నిద్రలేమి, గినివార్మ్స్‌ను నివారించటానికి వాడతారు. బెరడును మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేయటానికి వాడతారు. వీటి ఆకులను పూలదండల మధ్య గుచ్చితే దండలకు అందం చేకూరుతుంది.  

వాడుక భాషల్లో నక్కెర పండ్ల జాతి పేర్లు : 
ఇంగ్లీష్‌ : హాగ్‌ ప్లం, సిసైడ్‌ ప్లం, సిలెమాన్, ఎల్లోప్లం, స్పెనిప్లం, వైల్డ్‌ ప్లం, టల్లోవుడ్, వైల్డ్‌ ఒలివెయిన్, బ్లుసోర్‌ ప్లం, ఫాల్స్, సండల్‌ మడ్‌ ప్లం, చెబ్బులి 
కన్నడ : నగరిగిడ, కడునక్కెరె 
తమిళం : చిరు–ఇల్లంతై 
తెలుగు : నక్కెర 
నక్కెర పండ్లు ఎక్కువగా లేనందున ఏమోగాని ఇతర రాష్ట్ర భాషల్లో వెతికినా దొరకలేదు. కొన్ని రాష్ట్రాల వారిని సంప్రదించగా ఈ పండ్ల జాతి పేరు తెలియదన్నారు.   
పూత : మార్చి – ఏప్రిల్‌ 
పండ్లు : మే – జులై  

ఎండిన పండులో పోషక వివరాలు (100 గ్రా. పండులో) మినరల్స్‌
వివరాలు            విలువలు
పొటాషియం        690 మి.గ్రా.
మెగ్నీషియం        10.67 మి.గ్రా.
భాస్వరం            4.48 మి.గ్రా.
సోడియం            0.65 మి.గ్రా.
ట్యానిన్స్‌            74.8 మి.గ్రా.
ఫైటేట్‌            29.43 మి.గ్రా.
ముడి ప్రోటీన్లు        7.26%   
ముడి లిపిడ్స్‌        13.0%   
బూడిద            10.5%   
తేమ (పండ్లు)        64%   
ఆస్కార్బిక్‌ ఆమ్లం        21.12 మి.గ్రా/100 గ్రా 

నక్కెరు పండులో పోషకాలు (100 గ్రా. గుజ్జు) 
వివరాలు            విలువలు
టిఎస్‌ఎస్‌ (బ్రిక్స్‌)        17.01 నీ 0.07   
పిహెచ్‌            4.20 నీ 0.91   
తేమ (%)        75.16 నీ 0.03   
కొవ్వు (గ్రా.)        1.43 నీ 0.05   
బూడిద (%)        5.23 నీ 0.42   
క్రూడ్‌ ప్రోటీన్లు (%)    1.44  

డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924 

ఇదీ చదవండి: నీటి బడ్జెటింగ్‌తో.. కరువు నేలలో సిరుల పంట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement