బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ | Rahul Gandhi From climbing barricades to Akashvani Bhawan twist | Sakshi
Sakshi News home page

బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ

Oct 6 2026 4:42 PM | Updated on Oct 6 2026 5:08 PM

Rahul Gandhi From climbing barricades to Akashvani Bhawan twist

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు.

పార్లమెంట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్‌సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. ఎంపీలు చేతుల్లో జ్ఞానేశ్ కుమార్ చిత్రాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ‘‘ఓటు దొంగలారా.. పదవి వదిలేయండి’’ అంటూ నినాదాలు చేశారు. నితి ఆయోగ్ కార్యాలయం సమీపంలో భారీ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.

బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపి.. 
ఈ సమయంలో రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కారు. పోలీసులు ప్రియాంక గాంధీని నిర్బంధించేందుకు బస్సులోకి తీసుకెళ్లగా, ఆమె కొద్దిసేపటికే బస్సు నుంచి దిగి రాహుల్ గాంధీతో కలిసి ఆకాశవాణి భవన్ గేటు వద్దకు చేరుకున్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మరికొందరితో కలిసి ఆకాశవాణి భవన్ స్వాగత ద్వారం నుంచి ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం వారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌ఐఆర్‌లో తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, ప్రక్రియను రద్దు చేయాలని కూడా కోరుతున్నాయి. ఫారమ్-6లో మార్పులపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. ఎన్నికల సంఘం మాత్రం ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది.

రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ ‘ఓటు చోరీ’ ద్వారా దేశాన్ని హైజాక్ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్ వారికి సహకరించారు. ఇది దేశద్రోహం. ఎవరూ తప్పించుకోలేరు. సుమారు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కలవాలనుకున్నారు. 

ఇదీ సంగతి: స్మిట్‌ మచ్చార్‌ పుర్రెకు ఫ్రాక్చర్‌, మెమరీ లాస్‌, చూపు దెబ్బతిని..

కానీ, పోలీసులు మమ్మల్ని ఇక్కడే ఆపేశారు. మేము ఎన్నికైన ప్రజా ప్రతినిధులం. అయినా మమ్మల్ని ఎందుకు ఆపారో తెలియడం లేదు. ఎన్నికల కమిషన్ కేవలం 50 మీటర్ల దూరంలో ఉండగా ఏమైందో అర్థం కావడం లేదు. దేశంలో ఏమి జరుగుతోంది? ఎన్నికల కమిషన్ ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలవకపోతే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?” అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement