breaking news
Water cut
-
60 వేల ఎకరాలకు నీరు కట్
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ సాగు ప్రారంభమయ్యూక జిల్లా యంత్రాంగం విపరీత నిర్ణయం తీసుకుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున డెల్టాలో మెరక ప్రాంతాలకు నీరివ్వలేమని, డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తి చేసిన చేలకు మాత్రమే నీరివ్వాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయశాఖాధికారులు కాకినాడలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. తద్వారా మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలన్న జిల్లా సాగునీటి పారుదల శాఖ సలహా మండలి (ఐఏబీ) నిర్ణయాన్ని ధిక్కరించారు. ముందు నీరిస్తామనడంతో సాగు సన్నాహాల్లో నిమగ్నమైన ఆయూ ఆయకట్ల అన్నదాతల్లో అనేకులు.. ఇప్పుడు కోత పెట్టాలనుకోవడంతో హతాశులవుతున్నారు. డెల్టాలో పూర్తి ఆయకట్టులో సాగుకు 12 టీఎంసీల నీటి కొరత ఉందని అధికారులకు ముందే తెలుసు. ఇదే విషయాన్ని ఐఏబీ సమావేశానికి ముందే ‘ఆయకట్టు అంతటికీ నీరు కత్తిమీద సామే’ ‘సీలేరుపైనే ఆధారం’ కథనాలతో ‘సాక్షి’ ఎత్తి చూపింది. జిల్లా ప్రజాప్రతినిధులు ఈ లెక్కలతో సంబంధం లేదని, మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల కోసం ఏదైనా చేస్తాం, ఎంతైనా ఖర్చుపెడతాం. అవసరమైతే ఒడిశాకు విద్యుత్ ఇచ్చి జోలాపుట్ రిజర్వాయర్ నుంచి కావాల్సిన 12 టీఎంసీలను తెప్పించగలరు’ అని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ధీమాగా చెప్పారు. ఇప్పుడు జోలాపుట్ నుంచి నీరు రాదని తేలిపోయింది. వేసవిలో విద్యుత్ కొరత దృష్ట్యా సీలేరు నుంచి వచ్చే నీటినే పూర్తిస్థాయిలో ఇవ్వలేమని జెన్కో అధికారులు తేల్చేశారు. మరోవైపు గోదావరికి సహజ జలాలు తగ్గాయి. డెల్టాలో అన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లే ఆరంభం కాకపోయినా.. సీలేరు నుంచి బైపాస్ పద్ధతిలో రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని సేకరించాల్సి వస్తోంది. ఇంత చేసినా శివార్లకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ స్థితిలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 16 వేలు, తూర్పుడెల్టాలో 27 వేలు, మధ్యడెల్టాలో 17 వేల ఎకరాల్లో రబీ సాగుకు కోత పెట్టాని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయించారు. కొందరికిచ్చి.. కొందరికి ఎగనామమా! రబీలో మొత్తం ఆయకట్టుకు నీరిస్తామని, మధ్యలో కొరత అంటూ అన్ని ప్రాంతాల్లో మెరక, శివారు ఆయకట్లకు ఇవ్వలేమనడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా సాగు ఆరంభమైంది. ఒకే కాలువ మీద కొందరికి నీరిచ్చి, మిగిలిన వారికి ఇవ్వకుంటే అన్యాయమంటున్నారు. చాలా మంది డిసెంబరు 20 తరువాత కూడా నారుమళ్లు వేయగా జనవరి పది తరువాత కూడా నాట్లు పడే అవకాశముంది. అధికారులు డిసెంబరు 31 నాటికి నాట్లు పడ్డ చేలకు మాత్రమే నీరిస్తామనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మౌనమేల వర్మ గారూ! ‘గోదావరికి, ఏలేరుకు నీటి కొరత వచ్చినప్పుడల్లా పిఠాపురం నియోజకవర్గ ఆయకట్టుకు కోతపెడుతున్నారు. మీరు ఎలా తెస్తారో అనవసరం మా పీబీసీ ఆయకట్టుకంతా నీరివ్వాల్సిందే’ అని ఐఏబీలో పట్టుబట్టిన ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సమక్షంలోనే ఇప్పుడు పీబీసీలో 16 వేల ఎకరాల ఆయకట్టుకు జిల్లాయంత్రాంగం కోతపెట్టింది. అయినా ఆయన మౌనం వహించడం పట్ల రైతులు భగ్గుమంటున్నారు. -
నీటి సరఫరాలో కోత విధించబోం: బీఎంసీ
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త! ఏడాదిపాటు నీటి సరఫరాలో కోత ఉండబోదు. ఈ విషయాన్ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం ప్రకటించింది. గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఈసారి జలాశయాల్లో నీటినిల్వలు గణనీయంగా నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో 13.97 లక్షల మిలియన్ లీటర్ల వరకు ‘యూజ్‌ఫుల్ స్టాక్’ నమోదైందన్నారు. అదేవిధంగా తుల్సీ, మోదక్‌సాగర్, తాన్సా, విహార్, మధ్య వైతర్ణ జలాశయాలు ఇప్పటికే పొంగిపొర్లుతున్నాయి. గత మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు కళకళలాడుతున్నాయి. మరో 350 రోజుల వరకు నగర వాసులకు ఎలాంటి నీటి కోత సమస్య ఉండదు. జలాశయ పరీవాహక ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టం స్థాయి భారీగా పెరిగింది. ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో నగరవాసులు నీటి కోతలను ఎదుర్కోవాల్సివచ్చింది. దీంతో బీఎంసీ గృహ సముదాయాలకు 20 శాతం నీటి కోత విధించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు ఆలస్యంగా కురిసినా అనుకున్నంత స్థాయిలో కురవడంతో బీఎంసీ నీటి కోతలను ఎత్తివేసింది. అంతేకాకుండా వచ్చే ఏడాది వరకు నగర వాసులకు సరిపడా నీటి నిల్వలు ఈసారి నమోదయ్యాయి. ప్రస్తుతం తుల్సి, మోదక్‌సాగర్, తాన్సా, విహార్, మధ్య వైతర్ణ జలాశయాలు ఇప్పటికే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు ఇదేవిధంగా కురిస్తే ఎగువ వైతర్ణ జలాశయం కూడా ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ హైడ్రాలిక్ ఇంజినీర్ ఎ.ఎస్.తవాడియా మాట్లాడుతూ పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని తెలిపారు. నగరానికి సరిపడా నీటిమట్టాలు జలాశయాల్లో నమోదయ్యాయన్నారు. సాధారణంగా నీటి సరఫరాను అక్టోబర్ నుంచి జూలై వరకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు.