సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులకు కొన్ని రోజులుగా మంచి నీటి కష్టాలు తప్పడం లేదు. సెక్రటేరియెట్‌లో ఉద్యోగులు, సిబ్బందికి తాగునీటిని సరఫరా చేసే ఏజెన్సీలు నీటి సరఫరాను నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతోనే ఏజెన్సీలు సరఫరా ఆపినట్లు తెలుస్తోంది.
సెక్రటేరియెట్‌లో తాగునీటి సరఫరా కోసం నాలుగు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అయితే ఆయా ఏజెన్సీలకు చెల్లించాల్సిన బిల్లులు పెద్ద మొత్తంలో (రూ.50 లక్షలు)పెండింగ్‌లో ఉండటంతో నీటి సరఫరాపై ప్రభావం పడింది. ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయట. ఇలా బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని ఏజెన్సీలు ఇప్పటికే సరఫరాను నిలిపివేశాయి.
దీనికి తోడు సెక్రటేరియెట్‌లోని మంచి నీటి ఫిల్డర్లు పని చేయడం ఆగిపోయాయి. దీంతో ఉద్యోగులు బయట నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులుగా నీటి సమస్య కొనసాగుతుండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే తాగునీటి బాటిళ్లు తెచ్చుకోవాలని అధికారులు సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సెక్రటేరియట్ అధికారులు స్పందించాల్సి ఉంది.
మరోవైపు.. సెక్రటేరియెట్‌లో ఉద్యోగులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలోనూ ఇప్పటికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యల నేపథ్యంలో లంచ్ బంద్ చేసేశారు. ఇప్పుడు తాగునీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భారీ స్థాయిలో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న చర్చ సెక్రటేరియెట్‌లో జరుగుతోంది.
బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? నీటి సరఫరా ఎప్పటిలోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఉన్నతాధికారులు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై అధికారుల నుంచి స్పందన రావాల్సి ఉంది.


