ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుముక లాంటి ఓటు హక్కు పరిరక్షణపై ఉన్నత న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులు, వ్యాఖ్యలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వర్తించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను ఎత్తి చూపుతున్నాయి. ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, బాంబే, కేరళ హైకోర్టుల తీర్పులు ఈ అంశంలో అత్యంత కీలకమైనవిగా మారాయి.
‘సర్’ ప్రక్రియను విశ్లేషిస్తూ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేసిన అంశాలు రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని చాటిచెబుతున్నాయి. ‘రాజ్యాంగం పౌరులను ఓటుహక్కు ఉన్నవారు, లేనివారు అని వేర్వేరు కేటగిరీలుగా విభజించట్లేదు. నిజమైన అర్హులు ఓటు హక్కుకు దూరంగా ఉంటూ సొంత దేశంలోనే ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చే ప్రక్రియ ఏదైనా సరే నిరంకుశమైనదే అవుతుంది’ అన్నారు.
బాంబే హైకోర్టు ఏమందంటే..
మరొకవైపు, పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం ప్రాథమిక ధ్యేయమని బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా చూసేందుకు, వారిని వీలైనంత ఎక్కువగా జాబితాల్లోకి చేర్చడానికి ఈసీ చొరవ చూపాలని నిర్దేశించింది. సాంకేతిక కారణాలు లేదా నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క అర్హుత కలిగిన వ్యక్తి ఓటరు జాబితా నుంచి బయటకు రాకూడదని ఈ తీర్పు తేటతెల్లం చేసింది.
కేరళ హైకోర్టు ఇలా..
అలాగే సరైన విచారణ, ముందస్తు సమాచారం లేకుండా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘ఓటరు వాదన వినిపించే కనీస అవకాశమివ్వకుండా పేరు తొలగించడం ఎలా ఆమోదయోగ్యం అవుతుంది? ఓటు హక్కు చాలా విలువైంది. ఇష్టారీతిన దాన్ని ఎవరూ హరించలేరు’ అని గతంలో ఆదేశాలు జారీ చేసింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడం చెల్లదని కోర్టు తేల్చింది.
ఈ పరిణామాలన్నీ రాజ్యాంగబద్ధమైన బాధ్యతల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎంత పారదర్శకంగా, జాగ్రత్తగా వ్యవహరించాలో గుర్తు చేస్తున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కును రక్షించడం అంటే ప్రజాస్వామ్య పరిరక్షణే. అర్హులైన ప్రతి పౌరుడి ఓటును కాపాడటంలో ఈసీ నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడమే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు నిజమైన గౌరవం.
ఇదీ చదవండి: వందలో ముగ్గురే రిచ్.. ఎందుకో తెలుసా?


