అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పుంజుకుని ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటడంపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి స్పందించారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని తాను ఏళ్లుగా చెబుతున్నానని పేర్కొంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేశారు.
ప్రస్తుతం బంగారం ధర 4,400 డాలర్ల స్థాయిలో ఉండటాన్ని ప్రస్తావించిన కియోసాకి.. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇటీవల భారీ పతనం తర్వాత బంగారం మళ్లీ పుంజుకుందని, ఆగస్టులోనే ధర సుమారు 9 శాతం పెరిగిందని రాయిటర్స్ నివేదించింది. ఆగస్టు 19న స్పాట్ గోల్డ్ 4,487.91 డాలర్లకు చేరగా, 20న లాభాల స్వీకరణతో 4,484.95 డాలర్లకు తగ్గింది.
యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి కీలకం
బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒకటని కియోసాకి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు సాధారణంగా సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ కూడా ఇరాన్ యుద్ధం, చమురు సరఫరా ఆందోళనలు బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావం
అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని కియోసాకి వివరించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గితే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం తగ్గుతుందన్న అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు తగ్గుతాయన్న అంచనాలు పెరిగి బంగారం 4,400 డాలర్లకు పైగా వెళ్లింది.
అప్పులు కూడా కారణమే..
అమెరికా ప్రభుత్వ రుణభారం, భారీగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలు తమ ఖర్చులను నియంత్రించలేనప్పుడు, కరెన్సీ విలువపై ఆందోళనలు పెరిగినప్పుడు బంగారం ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక రుణాల బైబ్యాక్ కార్యక్రమాన్ని పెంచనున్నట్లు ప్రకటించిన తర్వాత బాండ్ ఈల్డ్స్, డాలర్‌పై ప్రభావం పడటంతో బంగారం ధర ఒక్క రోజులో 4 శాతానికి పైగా పెరిగింది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లను ప్రస్తావించిన కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం తన వాదనకు కీలక ఆధారమని కియోసాకి పేర్కొన్నారు. చైనా, భారత్, పోలాండ్, టర్కీ, సింగపూర్ వంటి దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని ఆయన తెలిపారు. రాయిటర్స్ ప్రకారం, తాజా దశలో కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి బంగారంపై డిమాండ్ తిరిగి పెరుగుతోంది.
‘బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు’
తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని కియోసాకి తెలిపారు. అలాగే చౌకగా ఉన్నప్పుడు వెండిని, బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్ల వద్ద కొనుగోలు చేశానని చెప్పారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పరిమిత సరఫరా ఉన్న ఆస్తులపై తనకు దీర్ఘకాలిక నమ్మకం ఉందన్నారు.
“బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు. నిజమైన డబ్బు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కియోసాకి.. పేపర్ కరెన్సీల విలువ కాలక్రమంలో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గింపు వంటి కారణాలతో దెబ్బతింటుందని అన్నారు. బంగారం మాత్రం వేల సంవత్సరాలుగా విలువను నిలబెట్టుకుంటూ వస్తోందని పేర్కొన్నారు.


