సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆటో చార్జీల మోత మోగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆటోరిక్షా చార్జీలను పెంచుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం జీఓ విడుదల చేశారు. గతంలో మొదటి 1.6 కి.మీ దూరానికి రూ.20, ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.11 చొప్పున చార్జీలు ఉండగా, కొత్తగా పెంచిన చార్జీల ప్రకారం మొదటి 1.6 కి.మీ దూరానికి రూ.30, ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.14 చార్జీ ఉంటుంది. ఆటో నిరీక్షణ చార్జీలు ప్రతి నిమిషానికి 75 పైసల చొప్పున వసూలు చేస్తారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీలపై ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంటుంది.
లగేజీపైనా భారం పెంచారు. ఒక్కో ప్యాకేజీపై 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 100 కిలోల వరకు అనుమతిస్తారు. కొత్త చార్జీలకు అనుగుణంగా ఆటోడ్రైవర్లను డిజిటల్ మీటర్‌లను ఏర్పాటు చేసుకోవాలని రవాణా కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ఇందుకోసం 3 నెలల గడువు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. నగరంలో రవాణా శాఖ లెక్కల ప్రకారం సుమారు 1.4 లక్షల ఆటోలున్నాయి. పెంచిన చార్జీల ప్రకారం సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు రోజుకు కనిష్టంగా 3 కి.మీ ప్రయాణిస్తారని భావిస్తే.. రోజుకు రూ.1.14 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.


