ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు
5 శాతం పైగా పెంపు
అక్టోబర్ 1 నుంచి అమలు..
ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరిగిపోవడం కారణం
అదే బాటలో మొబైల్స్ కూడా
న్యూఢిల్లీ: సాధారణంగా పండగ సీజన్‌లో డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఈసారి అందుకు విరుద్ధంగా రేట్ల బాదుడుకు తెరతీశాయి. దీనితో ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లతో పాటు ఇతరత్రా గృహోపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి కంపెనీలు వీటి రేట్లను 5 నుంచి 8 శాతం వరకు పెంచనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో రాగి, ఉక్కులాంటి ముడి వస్తువుల వ్యయాలు.. రవాణా ఖర్చులు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ క్షీణించడం తదితర అంశాలు ఇందుకు కారణం.
2026లో రేట్లను పెంచడం ఇది మూడోసారి కానుంది. బ్లూస్టార్, గోద్రెజ్ అప్లయెన్స్, హైయర్, దైకిన్, సూపర్ ప్లాస్ట్రోనిక్స్‌లాంటి కంపెనీలు ఇప్పటికే వివిధ ఉత్పత్తుల శ్రేణివ్యాప్తంగా 4–10 శాతం మేర రేట్ల పెంపును ప్రకటించాయి. ఎల్‌జీ, బాష్ హోమ్ కంఫర్ట్ (హిటాచీ బ్రాండ్) ఏసీల ధరలు సుమారు 5–7 శాతం వరకు పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల రాగి, ఉక్కు, ప్లాస్టిక్స్‌లాంటి కమోడిటీల రేట్లు పెరిగిపోతుండటంతో ఉత్పత్తుల ధరల పెంపు తప్పడం లేదని బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. అయితే, గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే వ్యయాలు 15 శాతం పెరిగినప్పటికీ జీఎస్‌టీపరంగా లభించే ప్రయోజనాలతో పోలిస్తే కస్టమర్లపై పడే ప్రభావం సుమారు ఐదు శాతమే ఉంటుందని యన పేర్కొన్నారు.
గత పెంపు తర్వాత కమోడిటీల రేట్లు 8–10 శాతం పెరగడంతో పరిశ్రమవ్యాప్తంగా ధరల పెంచక తప్పని పరిస్థితి నెలకొందని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ (అప్లయెన్సెస్ బిజినెస్) కమల్ నంది తెలిపారు. వివిధ కేటగిరీవ్యాప్తంగా ధరల పెంపు 5–7 శాతం వరకు ఉంటుందన్నారు. కొన్ని కంపెనీలు అక్టోబర్‌లో, కొన్ని నవంబర్‌లో పెంచవచ్చని..ఏదైనప్పటికీ పెంచడం మాత్రం ఖాయమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, థామ్సన్, కోడక్ తదితర టీవీల బ్రాండ్లను భారత్‌లో తయారు చేసి, విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సైతం 7 శాతం వరకు రేట్లను పెంచనున్నట్లు తెలిపింది. ఉపకరణాల ధరలను ఇప్పటికే 4–5 శాతం పెంచినట్లు వివరించింది.
పెంచినా కష్టమే.. పెంచకపోయినా కష్టమే..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచకపోతే నష్టపోవాల్సి వస్తుంది. అలాగని పెంచితే, అమ్మకాలపై స్పల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. ఏది ఏం జరిగినా పెంచడం తప్ప మరో మార్గం లేదు’’ అని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ సతీష్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి రూమ్ ఏసీలపై రేట్లను 5 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
ఒకవేళ ముడి వస్తువుల రేట్ల పెరుగుదల కొనసాగితే దీపావళి అనంతరం అలాగే జనవరిలోను విడతలవారీగా ఐదు శాతం చొప్పున మళ్లీ మళ్లీ పెంపు ఉండొచ్చన్నారు. మొత్తం మీద ఇప్పటి నుంచి జనవరి వరకు 15 శాతం వరకు పెంపునకు అవకాశం ఉందని చెప్పారు. ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు మొదలైన వాటి ధరల పెంపు 2–3 శాతం మేర ఉంటుందని ఆయన ధృవీకరించారు. గతేడాది టన్నుకు 8,000–9,000 డాలర్లుగా ఉన్న రాగి ధర ప్రస్తుతం 14,500 డాలర్లకు ఎగిసిందని, ఇది ఇంకా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయని సతీష్ తెలిపారు. ఒక్కో ఏసీకి 3–4 కేజీల రాగి అవసరమవుతుందని పేర్కొన్నారు.
ఇక సెప్టెంబర్ 16 నుంచే తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం మేర పెంచినట్లు దైకిన్ ఎయిర్‌కండీషనింగ్ సీఎండీ కన్వల్‌జీత్ జావా తెలిపారు. రాగి ధరలు 25–35 శాతం పెరగ్గా, డాలరు .. కమోడిటీల రేట్లు కూడా పెరుగుతుండటంతో కంపెనీలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే వినియోగదారుల నుంచి డిమాండ్ బాగానే ఉందని, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు.
సాధారణంగా వినియోగదారులు డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లను ఆశించే పండగ సీజన్లో ఇలా రేట్లను పెంచడం వల్ల డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ అవీ్నత్ సింగ్ మార్వా చెప్పారు. డిమాండు, ధర మధ్య సమతౌల్యం పాటించేలా చూసేందుకు మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా హెడ్ (ప్రోడక్ట్ మార్కెటింగ్ అండ్ ప్లానింగ్–ఏసీ కేటగిరీ) అభిషేక్ వర్మ చెప్పారు. రవాణా వ్యయాలు, సరఫరా వ్యవస్థ అంతరాయాల వల్ల దీపావళి తర్వాత చిన్న టీవీల రేట్లు 20 శాతం వరకు, పెద్ద టీవీల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు.
శాంసంగ్ ఎస్26 ఫోన్ల రేట్లు 17% జంప్..
ఎల్రక్టానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను 17 శాతం వరకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. లాంచ్ ధర రూ. 87,999తో పోలిస్తే బేసిక్ వెర్షన్ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 17 శాతం అధికంగా రూ. 1,02,999కి చేరినట్లు పేర్కొన్నాయి. దీనితో ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్ల రేట్లు రూ. లక్షకు పైబడే ఉన్నాయని వివరించాయి. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన ఐఫోన్ 18 సిరీస్ ధరలు కూడా ఐఫోన్ 17 సిరీస్‌తో పోలిస్తే భారత్‌లో దాదాపు 20 నుంచి 43 శాతం అధిక స్థాయిలోనే ఉన్నాయని తెలిపాయి.
రూ. 3.25 లక్షల కోట్లకు డ్యూరబుల్స్ మార్కెట్..
దేశీయంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల మార్కెట్ 2030 నాటికి ఏటా 8–10 శాతం వృద్ధితో ఏకంగా రూ. 3–3.25 లక్షల కోట్ల స్థాయికి చేరనుంది. వాటికి అదనంగా విలువను జోడించే మెటీరియల్స్, విడిభాగాల తయారీకి సంబంధించి కొత్తగా రూ. 40,000–50,000 కోట్ల స్థాయిలో వ్యాపార అవకాశాలు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (బీసీజీ), పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన సంయుక్త నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
ఆదాయాలు, చిన్న కుటుంబాలు, రుణ లభ్యత పెరుగుతుండటం, ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ నెలకొనడం తదితర అంశాల కారణంగా వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న కన్జూమర్ డ్యూరబుల్స్ మార్కెట్‌గా భారత్ కొనసాగవచ్చని వివరించింది. ఈ వృద్ధికి రూమ్ ఏసీల విభాగం దన్నుగా నిలుస్తుందని తెలిపింది. అయితే, వ్యాపార అవకాశాలు ఉన్నప్పటికీ దేశీయంగా విడిభాగాలు, మెటీరియల్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోకపోతే దిగుమతులపైనే ఆధారపడాల్సి రావచ్చని నివేదిక పేర్కొంది. మరోవైపు, ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా 2030 వరకు ఏటా 1–2 శాతం మేర, అమెరికా 3 శాతం, జపాన్ 1–3 శాతం మేర వృద్ధి చెందనున్నాయి.


