టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ విషయంలో టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్.. కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకుండా కొనసాగించే దిశగా పునర్‌వ్యవస్థీకరణకు ప్రతిపాదించింది.
ఈ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TESS), టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ (TCE) రెండు కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని టాటా ట్రస్ట్స్.. టాటా సన్స్ బోర్డును కోరింది. అయితే.. దీనికోసం అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ముందస్తు నిరభ్యంతర పత్రం (NOC) పొందాల్సి ఉంటుంది.
టాటా సన్స్ ప్రస్తుతం ప్రధానంగా టాటా గ్రూప్‌లోని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉన్న హోల్డింగ్ కంపెనీగా ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం TESS, TCEలను టాటా సన్స్‌లో విలీనం చేస్తే.. టాటా సన్స్‌కు నేరుగా వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు ఉండే అవకాశం ఏర్పడుతుంది. అంటే కంపెనీ మళ్లీ ఒక ఆపరేటింగ్ కంపెనీగా మారుతుందన్నమాట.
దీంతో టాటా సన్స్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) నిబంధనల పరిధిలోకి రాకుండా ఉండే అవకాశం ఉంటుందని టాటా గ్రూప్ భావిస్తోంది. ఫలితంగా కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సిన అవసరం కూడా తప్పుతుందని టాటా ట్రస్ట్స్ భావిస్తోంది.
నిజానికి.. టాటా సన్స్‌కు గతంలోనే సొంత వ్యాపార కార్యకలాపాలు ఉండేవి. 2004లో టీసీఎస్‌ను ప్రత్యేక అనుబంధ సంస్థగా విడదీయడానికి ముందు టాటా సన్స్ నేరుగా వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని ఆర్జించేది. ఇప్పుడు ప్రతిపాదించిన విలీనంతో టాటా సన్స్‌ను మళ్లీ అదే తరహా ఆపరేటింగ్ మోడల్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారు.
టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకుండా.. అన్‌లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీగా కొనసాగించాలన్నది టాటా ట్రస్ట్స్ ప్రతిపాదనగా ఉంది. టాటా సన్స్‌లో మెజారిటీ వాటా.. టాటా ట్రస్ట్స్‌దే కావడంతో ఈ విషయంలో వాటి నిర్ణయానికి ప్రాధాన్యం ఉంది.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. RBI కొత్త రూల్స్ తెలుసా?


