Stock Market: రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. | Market crash wipes off Rs 6 lakh crore Sensex down over 900 points key factors | Sakshi
Sakshi News home page

Stock Market: రూ.6 లక్షల కోట్లు ఆవిరి..

Sep 28 2026 11:38 AM | Updated on Sep 28 2026 12:03 PM

Market crash wipes off Rs 6 lakh crore Sensex down over 900 points key factors

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తరువాత భగ్గుమన్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ రాబడుల్లో పెరుగుదల మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈ బెంచ్మార్క్ నిఫ్టీ 50 300 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.6 లక్షల కోట్లు ఆవిరైంది. శుక్రవారం నాటి రూ.48.18 లక్షల కోట్ల నుంచి రూ.47.6 లక్షల కోట్లకు తగ్గింది.

ఉదయం 11:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 973.63 పాయింట్లు లేదా 1.32 శాతం క్షీణించి 72,922.11 వద్ద, నిఫ్టీ 1.32% లేదా 306.25 పాయింట్లు కోల్పోయి 22,834.25 వద్ద ట్రేడవుతున్నాయి. 

స్టాక్‌ మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలివే..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, బాండ్‌ ఈల్డ్స్‌ ఎగబాకడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌-అమెరికా మధ్య దౌత్యపరమైన పరిష్కారానికి అవకాశాలు సన్నగిల్లడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ, చమురు, బాండ్‌ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది.

హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచి, పోరాటాన్ని ముగించేందుకు ఇరాన్‌ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్‌తో వివాదాన్ని దౌత్యపరమైన మార్గంలోనే పరిష్కరించగలమని ఇరాన్‌ స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా సంక్షోభం త్వరగా సమసిపోయే అవకాశాలపై మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది.

ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపించింది. దక్షిణ కొరియా మార్కెట్‌ సుమారు 2 శాతం నష్టపోగా, జపాన్‌ నిక్కీ 0.10 శాతం క్షీణించింది. చైనా మార్కెట్లు కూడా 1 శాతానికి పైగా నష్టాలతో ట్రేడయ్యాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో చమురు సరఫరాపై ఆందోళనలు మళ్లీ పెరిగాయి.

చమురు ధరల సెగ

సరఫరా అంతరాయాల భయాలతో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 2.2 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 106.6 డాలర్లకు చేరాయి. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడ్‌ ధర 1.45 శాతం పెరిగి 93.76 డాలర్లకు చేరుకుంది. భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దిగుమతి వ్యయం పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు కరెంట్‌ ఖాతా లోటు పెరిగే ఆందోళన ఉంది.

బాండ్‌ ఈల్డ్స్‌ కూడా పైకి..

చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో బాండ్‌ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం, రేట్ల మార్పులకు సున్నితమైన అమెరికా రెండేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 5 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.90 శాతానికి చేరింది. 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4 బేసిస్‌ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి చేరుకుంది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో పెట్టుబడుల ఆకర్షణ తగ్గే అవకాశం ఉంటుంది.

ఎఫ్‌పీఐల అమ్మకాలు

దేశీయ మార్కెట్లపై మరో ప్రధాన ఒత్తిడి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) విక్రయాలు. జూలై, ఆగస్టు నెలల్లో నికర కొనుగోలుదారులుగా ఉన్న ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో అమ్మకాల వైపు మళ్లారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ.17,131 కోట్ల విలువైన భారతీయ స్టాక్స్‌ను విక్రయించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల మొత్తం విక్రయాలు రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement