సాంకేతికంగా బలహీనంగానే మార్కెట్
అంతర్జాతీయ పరిణామాలు కీలకం
ముడి చమురు ధరలపై ఫోకస్
ఈ వారం ట్రేడింగ్‌పై నిపుణుల అంచనా
గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవ్వొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరలు, బాండ్లపై రాబడులు (ఈల్డ్స్), స్థూల ఆర్థిక గణాంకాలు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని భావిస్తున్నారు. ‘‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం తర్వాత డాలర్ బలం పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) నిధుల ఉపసంహరణ ఒత్తిడి పెంచుతున్నాయి.
మరోవైపు బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు 100 డాలర్ల ఎగువనే ఉండటం, అమెరికా పదేళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 5.2%కి చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెమటలు పట్టిస్తున్నాయి. భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు పెరిగి చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత ఎక్కువవుతాయి.
ఇవి భారత్ లాంటి వర్ధమాన మార్కెట్లకు విదేశీ నిధుల రాకను పరిమితం చేసే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్వల్పకాలంలో మార్కెట్ ఒత్తిడిలోనే కొనసాగవచ్చు’’ అని హెచ్‌ఎస్‌టీ వెల్త్ వ్యవస్థాపకుడు హరిసెల్వన్ రాధాకృష్ణన్ తెలిపారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 2న (శుక్రవారం) ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈక్విటీ, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు.
కొనసాగుతున్న చమురు సవాళ్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ముడిచమురు ధరలే అత్యంత కీలకమైన అంశంగా మారనున్నాయి. అమెరికా–ఇరాన్ వివాద పరిష్కారానికి యత్నాలు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై సానుకూల వార్తలతో గత శుక్రవారం (సెపె్టంబర్ 25న) బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 2.1 శాతం తగ్గి 104.32 డాలర్ల వద్ద స్థిరపడింది.
దీర్ఘకాలం పాటు చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో కొనసాగితే భారత్ దిగుమతుల భారం పెరిగి, రూపాయి క్షీణతకు కారణమవ్వడమే కాకుండా ద్రవ్యోల్బణ అంచనాలను క్లిష్టతరం చేస్తాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా పునరుద్ధరణపై స్పష్టత వస్తే ఇంధన ధరలు తగ్గి రూపాయి, స్టాక్ మార్కెట్లకు ఊరట లభిస్తుంది. స్పష్టమైన దిశానిర్దేశం వచ్చే వరకు ముడిచమురు, పశ్చిమాసియా పరిణామాలు మార్కెట్‌లో తీవ్ర అస్థిరతకు కారణమవుతాయి.
దేశీయ స్థూల గణాంకాలపై దృష్టి
దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఆగస్టు పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటా సోమవారం విడుదల కానుంది. హెచ్‌ఎస్‌బీసీ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు సైతం కీలకంగా మారనున్నాయి. మరోవైపు పండుగ సీజన్ ఆరంభంలో ఇన్వెస్టర్లు వాహన అమ్మకాల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఎఫ్‌ఐఐలు ఆరోవారమూ అమ్మకాలే..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీలు) లావాదేవీలు కీలకంగా మారనున్నాయి. గతవారంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ. 11,490 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఎఫ్‌ఐఐల అమ్మకాల పరంపర వరుస ఆరోవారమూ కొనసాగినట్లైంది. అయితే, పబ్లిక్ ఇష్యూల కారణంగా సంస్థాగత ఇన్వెస్టర్ల రూ.16,398 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి.
నిఫ్టీకి 23,000 వద్ద కీలక మద్దతు
నిఫ్టీకి ఈ వారంలో 23,000 స్థాయి అత్యంత కీలకమైన మద్దతుగా నిలవనుంది. ప్రస్తుతం నిఫ్టీ ఇండెక్స్ 21, 55, 100, 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (ఈఎంఏ)ల కన్నా దిగువున ట్రేడవుతుండటం మార్కెట్లో సాంకేతిక బలహీనతను సూచిస్తోంది. ఒకవేళ 23,000 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీ 22,600 స్థాయికి దిగిరావొచ్చు. రికవరీ సాధిస్తే ఎగువున 23,450 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. ‘‘ నిఫ్టీ 23,450 దిగువున ఉన్నంతవరకు మార్కెట్లో బలహీనత కొనసాగుతుంది. మార్కెట్ పెరిగిన ప్రతిసారీ లాభాల స్వీకరించే వ్యూహాన్ని అనుసరించడం ఉత్తమం’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రావి సింగ్ సూచించారు.
ఏడో వారమూ వీడని నష్టాలు
క్రూడ్ సెగలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఏడో వారమూ దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. గత వారంలో సెన్సెక్స్ 399 పాయింట్లు , నిఫ్టీ 210 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.


