ఫార్మాకు వెలుపల అతిపెద్ద హెల్త్‌కేర్ ఎకానమీ
ఆసుపత్రుల నుంచి హోమ్‌కేర్ వరకూ వేగంగా విస్తరణ
‘హెల్త్ డెలివరీ’ విలువే వచ్చే రెండేళ్లలో రూ.10 లక్షల కోట్లకు
ప్రివెంటివ్‌పై అవగాహనతో పెరుగుతున్న హెల్త్‌కేర్ వ్యవస్థ
ఆసుపత్రులు, పరీక్షలు, బీమా, పరికరాలు, హెల్త్‌టెక్ ఇంకా ఎన్నో
ప్రతి రంగంలోనూ మార్పులు... వేగంగా ఎదుగుతున్న దిగ్గజాలు
ముందుగా గుర్తించి ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో అవకాశాలు
హెల్త్‌కేర్... ఈ మాట వినగానే గుర్తుకొచ్చేది ఆసుపత్రులు... ఫార్మా కంపెనీలే. మరి డయాగ్నస్టిక్స్... వైద్య పరికరాలు... హెల్త్‌టెక్.. ఆరోగ్య బీమా... టెలీ టూరిజం.. టెలీ మెడిసిన్ వీటి సంగతేంటి? వీటి చుట్టూ అల్లుకున్న వందలాది అనుబంధ రంగాల మాటేంటి? గత ఏడాది ఏకంగా 600 బిలియన్ డాలర్లను దాటేయటంతో పాటు ఏటా 22.5 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధిని నమోదు చేస్తోందంటే భారత హెల్త్‌కేర్ రంగం ఎంత పెద్దదో తేలిగ్గానే అర్థంచేసుకోవచ్చు.
పైపెచ్చు 2023లో దేశ జీడీపీలో 3.3 శాతంగా ఉన్న హె ల్త్‌కేర్ ఖర్చు 2030 నాటికి 5 శాతాన్ని మించిపోతాయనేది ఆర్థిక సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో ఎక్కువ వృద్ధిని నమోదు చేసే పరిశ్రమలేంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? భవిష్యత్ లీడర్లెవరు? ఏ కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఎక్కువ రాబడులొస్తాయి? దీనిపై ‘సాక్షి వెల్త్’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి కథనమిది.
దశాబ్దాలుగా దేశంలో హెల్త్‌కేర్ అంటే ఫార్మా సంస్థలే. హెల్త్‌కేర్ వృద్ధిపై ఇన్వెస్టర్లు ఏం మాట్లాడినా మందుల తయారీ కంపెనీలు... జనరిక్ మందులు... ఏపీఐల గురించే. కానీ పరిస్థితి మారింది. మన హెల్త్‌కేర్ ఎకానమీలో ఇపుడు ఆసుపత్రులు, ఆరోగ్య బీమా, డయాగ్నస్టిక్స్, మెడికల్ డివైజ్‌లు, స్పెషాలిటీ కేర్, హెల్త్‌టెక్, మెడికల్ టూరిజం, హోమ్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా చేరాయి. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆవిష్కృతమయ్యింది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. మరి జనం ఖర్చులు పెరగటం వల్లే ఇదంతా సాధ్యమయ్యిందా?
కానే కాదు. జనం ఆయుష్షు పెరిగింది. జీవనశైలి మారింది. ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రివెంటివ్ కేర్‌పై శ్రద్ధ... బీమా కవరేజీ పెరిగాయి. స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల బదులు చాలామంది వ్యవస్థీకృత ప్రయివేటు ఆసుపత్రులకు మళ్లారు. ఆసుపత్రుల పడకలు పెరిగాయి. వైద్యపరీక్షల్లో ఆధునికత పెరిగింది. వైద్య పరికరాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ హెల్త్‌కేర్ ప్రతిదశలోకీ డిజిటల్ టెక్నాలజీ చొచ్చుకుపోయింది. వీటన్నిటి ఫలితమే సమగ్ర హెల్త్‌కేర్ ఎకానమీ.
హెల్త్ డెలివరీ @ రూ.10 లక్షల కోట్లు!
హెల్త్‌కేర్ పరిశ్రమపై తాజాగా సెబీ నిర్వహించిన సమావేశంలో 2025లో హెల్త్‌కేర్ డెలివరీ పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల రెవెన్యూను నమోదు చేసినట్లు అంచనా వేశారు. ఇది 2028 ఆర్థిక సంవత్సరానికల్లా 10–12 శాతం వార్షిక వృద్ధితో 9.8 లక్షల కోట్లను చేరుతుందని పేర్కొన్నారు. అదే సమావేశంలో... మెడికల్ డివైజెస్, డయాగ్నస్టిక్స్ మార్కెట్లు గత ఏడాది రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చూశాయని, ఇవి 11–12 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని అంచనా వేశారు. ఇక ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్, సర్జికల్స్, హెల్త్‌టెక్, స్పెషాలిటీ కేర్, రిహాబిలిటేషన్, హోమ్ హెల్త్‌కేర్, మెడికల్ టూరిజంలను కూడా కలిపితే ఎకానమీ ఎంత పెద్దదో తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు ఏదో ఒక రంగంలో కాకుండా మొత్తం వ్యవస్థలో అవకాశాలు ఎక్కువన్నది అర్థమవుతుంది.
మందులొక్కటే కాదు... మొత్తం వ్యవస్థపై ఖర్చు
మనం ఎక్కువగా ఏ మందులు వాడుతున్నామన్నది గతంలో ఇన్వెస్టర్లు చూసిన కోణం. కానీ ఇపుడు... దేనిపై ఖర్చు చేస్తున్నారన్నదే ముఖ్యం. ఆరోగ్య బీమాతో మొదలుపెడితే... ఒక పేషెంట్ తన వ్యాధి నుంచి బయటపడేందుకు ఆసుపత్రి... డయాగ్నస్టిక్ సెంటర్... సీటీ/ఎంఆర్‌ఐ/పెట్ స్కాన్... మెడికల్ డివైజ్... సర్జికల్ ఇంప్లాంట్.. కన్సూమబుల్స్... ఫార్మసీ... ఫాలో అప్ పరీక్షలు.. హోమ్ హెల్త్‌కేర్... డిజిటల్ పర్యవేక్షణ .. వీటన్నింటిపై ఖర్చుచేస్తాడు. ఆ పేషెంట్ నుంచి వీటన్నిటికీ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ మొత్తం వ్యవస్థను చూడాల్సి ఉంటుంది.
హెల్త్‌కేర్ ఎందుకు పెరుగుతోందంటే...
ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ
అనారోగ్యం బారిన పడకుండా ప్రివెంటివ్ పరీక్షలు, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ సేవలు, ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవటంపై మన వాళ్లలో బాగా శ్రద్ధ పెరుగుతోంది. తాజా ఎన్‌ఎస్‌ఓ హెల్త్ సర్వేలో... 2017–18తో పోలిస్తే త మకు వ్యాధులున్నాయని చెప్పినవారి సంఖ్య 2025లో బాగా పెరిగింది. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను వినియోగించుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. దీనర్థం హెల్త్‌కేర్ మార్కెట్ పెరుగుతోందనే.
జీవనశైలి వ్యాధులు
దేశంలో డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వీటికి సాధారణంగా ఒకసారి వైద్యం చేస్తే సరిపోదు. ఏళ్ల తరబడి... దశాబ్దాల తరబడి హెల్త్‌కేర్ వినియోగం అవసరం. ఉదాహరణకు మధుమేహంతో ఉన్న వ్యక్తి తరచూ డాక్టర్ని కలవాలి. రక్త పరీక్షలు చేయించాలి. రెగ్యులర్‌గా మందులు తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. దీర్ఘకాలం పర్యవే„ý ణ అవసరమైన వ్యాధి ఇది. అందుకే ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నకొద్దీ హెల్త్‌కేర్ డిమాండూ పెరుగుతుంది.
పెరిగిన ఆయుఃప్రమాణం
హెల్త్‌కేర్ ఎకానమీతో జనం ఆయుఃప్రమాణం పెరిగింది. ఆసుపత్రులు, చికిత్సల కోసం యువత ఎక్కువ ఖర్చు చేయకున్నా వయసు మళ్లినవారికి తప్పటం లేదు. గుండె, కేన్సర్, కీళ్లు, కళ్లు, కిడ్నీ, రిహాబిలిటేషన్, దీర్ఘకాల మందులు, హోమ్ హెల్త్‌కేర్, సహాయకులపై వీరు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ ఆసుపత్రులను దాటి అవకాశాలు పెరుగుతున్నాయి. మున్ముందు హెల్త్‌కేర్ అనేది పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటంతోనే ఆగిపోదు. హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, రిమోట్ పర్యవేక్షణ పెరుగుతాయి. ఈ రంగంలో భవిష్యత్తు ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను గుర్తించవచ్చు కూడా.
బీమా.. సమగ్ర మార్పు
ఆసుపత్రి బిల్లు కోసం అప్పులపాలై జీవితాంతం ఇబ్బందులు పడ్డ దృష్టాంతాలు ఇప్పటికీ ఉన్నా... గతంకన్నా తగ్గాయి. కారణం... బీమాపై అవగాహన పెరగటం. ఇపుడు హెల్త్‌కేర్‌పై చేస్తున్న ఖర్చులు అత్యధికం బీమా కంపెనీల నుంచో, ప్రభుత్వ స్కీముల నుంచో చేస్తున్నవే తప్ప వ్యక్తుల నుంచి కాదు. అందుకే 2013–14లో 1.3 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఖర్చు 2022–23 నాటికి 3.85 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆరోగ్య రంగంపై పెడుతున్న ఖర్చులో ప్రభుత్వ వాటా 28 శాతం నుంచి 43.7 శాతానికి పెరగ్గా... వ్యక్తులు సొంతంగా చేస్తున్న ఖర్చు 64 శాతం నుంచి 43.4 శాతానికి పడిపోయింది. ఆర్థికంగా ఇది అత్యంత ప్రాధాన్యమున్న పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ లేదా బీమా కవరేజీ ఉన్న సందర్భాల్లో జనం చికిత్స విషయంలో పెద్దగా వెనకాడరు. త్వరగా నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల మొత్తం ఆరోగ్య ఎకానమీపై పెట్టే ఖర్చు పెరుగుతుంది.
విస్తరణ అవకాశాలెక్కువే...
జాతీయ హెల్త్ పాలసీ ప్రకారం ప్రతి వెయ్యి మందికి రెండు ఆసుపత్రి పడకలుండాలి. కానీ ఇపుడున్నది 1.4 మాత్రమే. అందులో ప్రభుత్వానిది 0.6. ఈ గ్యాప్‌తో విస్తరణకు ఎంత అవకాశముందో అర్థమవుతుండగా ప్రయివేటు రంగం దీన్ని అందుకోవటానికి వేగంగా అడుగులేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 18 ప్రముఖ ఆసుపత్రులో మరో 34వేల పడకలు జత చేయనున్నాయనేది తాజా ‘ఇక్రా’ అ«ంచనా. కాకపోతే ఇలా పడకలు పెరుగుతున్న కొద్దీ... ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు కూడా మరింత పెరుగుతుంది. వీటివల్ల ప్రధానం ఆసుపత్రి భవనం.. మెడికల్, ఐసీయూ, డయాగ్నస్టిక్ పరికరాలు, సర్జికల్ ఉత్పత్తులు, డాక్టర్లు, నర్సులు, ఫార్మసీ, బీమా, హెల్త్‌కేర్ ఐటీ... ఇలా అన్నీ పెరుగుతాయి. అందుకే ఆసుపత్రి ఆదాయం ఒక్కటే కాకుండా ఆసుపత్రి విస్తరణ వల్ల మొత్తం హెల్త్‌కేర్ ఎకానమీపై ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి.
ఆరోగ్య రంగ దిగ్గజాలను ఇలా చూడొచ్చు...
ఆసుపత్రులు
2026 హెల్త్‌కేర్ రివ్యూ ప్రకారం ఆసుపత్రుల రెవెన్యూ 15 శాతం వృద్ధి చెందుతోంది. బెడ్ ఆక్యుపెన్సీ 60–75 శాతం వరకూ ఉంది.
→ అపోలో హాస్పిటల్స్
→ మ్యాక్స్ హెల్త్‌కేర్
→ ఫోరి్టస్ హెల్త్‌కేర్
→ ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్
→ మెదాంతా/ గ్లోబల్ హెల్త్
→ నారాయణ హృదయాలయ
→ కిమ్స్
→ రెయిన్‌బో చిల్డ్రన్స్
→ యథార్థ్ హాస్పిటల్స్
డయాగ్నస్టిక్స్
కన్సాలిడేషన్, విస్తరణ, హోమ్ కలెక్షన్, డిజిటల్ బుకింగ్, ప్రత్యేక పరీక్షలతో వ్యవస్థీకృత డయాగ్నస్టిక్ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇవి 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 25 శాతానికిపైగా ఎబిటా మార్జిన్లను సాధించాయి.
→ డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్
→ మెట్రోపోలిస్ హెల్త్‌కేర్
→ విజయ డయాగ్నస్టిక్స్
→ థైరోకేర్
→ క్రిస్నా డయాగ్నస్టిక్స్
→ సురక్షా డయాగ్నస్టిక్స్
మెడికల్ డివైజెస్, సర్జికల్ ప్రొడక్ట్స్
ఈ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ అన్‌లిస్టెడ్‌గానే ఉన్నాయి. కాబట్టి ఇందులో లిస్టయ్యే కంపెనీలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
→ పాలీ మెడిక్యూర్
→ ప్రివెస్ట్ డెంట్‌ప్రో
→ న్యురెకా
→ జీకేబీ ఆప్తాల్మిక్స్
→ శ్రీ పేస్‌ట్రానిక్స్
→ హేమంత్ సర్జి్కల్
ఆరోగ్య బీమా
హెల్త్‌కేర్‌కు ఫైనాన్సింగ్ ఇంజిన్‌గా పనిచేస్తున్న ఈ రంగం... ప్రివెంటివ్ కేర్‌పై పెరుగుతున్న అవగాహన కారణంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో స్టాండలోన్ కంపెనీలు తక్కువే.
→ స్టార్ హెల్త్
→ నివా బూపా
→ ఐసీఐసీఐ లాంబార్డ్ (డైవర్సిఫైడ్)
సీఆర్‌ఓ/ సీడీఎంఓ
భారత ఫార్మా ఎగుమతులిపుడు జనరిక్ మందులకే పరిమితం కాదు. డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ రీసెర్చ్, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, తయారీ, స్పెషాలిటీ కెమిస్ట్రీ, బయాలాజిక్స్ వంటి రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు భారత సంస్థలపై ఆధారపడుతున్నాయి. దీంతో సీఆర్‌ఓ/సీడీఎంఓ అవకాశాలు పెరుగుతున్నాయి.
→ సింజీన్ ఇంటర్నేషనల్
→ అరాజెన్ లైఫ్‌సైన్సెస్
→ సాయి లైఫ్ సైన్సెస్
→ ఆంథెమ్ బయోసైన్సెస్
→ న్యూలాండ్ ల్యా»ొరేటరీస్
→ గ్లాండ్ ఫార్మా
→ పిరమల్ ఫార్మా
→ లారస్ ల్యాబ్స్
→ దివీస్ ల్యాబొరేటరీస్
హెల్త్‌టెక్, డిజిటల్ హెల్త్
పేషెంట్ రికార్డులు, డయాగ్నస్టిక్ చిత్రాలు, ల్యాబ్ రిపోర్ట్‌లు, బిల్లింగ్, బీమా క్లెయిమ్‌లు, ప్రిస్క్రిప్షన్లు... ఇలా అన్నింటికీ డిజిటల్ సేవలు అవసరమే. → టాటా ఎలక్సీ
→ పెర్సిస్టెంట్ సిస్టమ్స్
→ కొఫోర్జ్
→ ఇన్ఫోసిస్
→ టీసీఎస్
→ విప్రో
→ ఎంఫసిస్
ఇంకా హోమ్ హెల్త్‌కేర్, వృద్ధుల సంరక్షణ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నా వీటిలో లిస్టెడ్ కంపెనీలు ప్రత్యేకంగా ఏమీ లేవు. చాలా ఆసుపత్రులు ఈ సేవల్ని అందిస్తుండగా... కొన్ని స్టార్టప్‌లు సైతం వేగంగా ఎదుగుతున్నాయి. కాబట్టి ఈ రంగాల్లో అవకాశాలను, మార్పులను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి.
తదుపరి భాగంలో... ఆసుపత్రుల కేరాఫ్ ఎవరిది?
అపోలో.. మాక్స్.. ఫోర్టిస్.. ఆస్టర్.. మెదాంతా.. నారాయణ.. కిమ్స్.. రెయిన్‌బో.. యథార్థ్ ఇవన్నీ అగ్రశ్రేణి ఆసుపత్రులే. మరి వీరిలో బాగా లబ్ధి పొందేదెవరు? ఎవరి ఆర్థిక పనితీరు అద్భుతంగా ఉండబోతోంది? తదుపరి 50వేల పడకల్లో ఎవరి వాటా ఎంత? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి?.. వచ్చేవారం ‘సాక్షి వెల్త్’లో తెలుసుకుందాం.
రమణమూర్తి మంథా


