మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే? | Funday Mistic World Story On Prakash Varnesh Reincarnation Case Ian Stevenson India | Sakshi
Sakshi News home page

మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే?

Sep 27 2026 9:03 AM | Updated on Sep 27 2026 9:21 AM

Funday Mistic World Story On Prakash Varnesh Reincarnation Case Ian Stevenson India

ఫండే

మిస్టిక్‌ వరల్డ్‌

అది 1955 నాటి ఉత్తరప్రదేశ్‌... చిన్న పట్టణం ఛత్తా. అందులో సువిశాలమైన ఓ పెంకుటిల్లు... 
తల్లి తన నాలుగున్నరేళ్ల కుమారుడు ప్రకాశ్‌ వర్ణ్షేకి గోరుముద్దలు తినిపిస్తోంది. రెండు ముద్దలు తిన్న ఆ బాలుడు– మూడో ముద్ద పెడుతుంటే తల్లి చేతిని వెనక్కి నెట్టేశాడు. ‘‘నన్ను నా ఇంటికి తీసుకెళ్లండి. నా కోసం కోసికలాన్‌లో నా వాళ్లు ఎదురుచూస్తున్నారు’’ అనేసరికి తల్లి బిత్తరపోయింది.

ఆ రాత్రి నిద్రలో నుంచి లేచిన బాలుడు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. తల్లిదండ్రులు ఎంత ఆపినా వినకుండా ఒకటే ఏడుపు. ‘‘నేను ఇక్కడివాడిని కాదు. కోసికలాన్‌లో నా ఇల్లు ఉంది. నా పేరు ప్రకాశ్‌ కాదు, నిర్మల్‌. వెంటనే నన్ను అక్కడకు తీసుకెళ్లండి’’ అని మారాం చేశాడు.

నాలుగున్నరేళ్ల బాలుడు కోసికలాన్‌ గురించి మాట్లాడటమేంటి? అసలు ఆ ఊరి పేరు ఈ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ ఎత్తలేదే! అని తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రకాశ్‌ ప్రవర్తన మరింత విచిత్రంగా మారసాగింది. తన తండ్రి పేరు బోలానాథ్‌ అని, ఆయనకు నాలుగు దుకాణాలు ఉన్నాయని చెప్పేవాడు. పాత ఇంటికి తీసుకెళ్లాలని గట్టిగా పట్టుబట్టేవాడు. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచి, ‘‘నా కడుపు మండిపోతోంది. మంచం చుట్టూ జనం ఉన్నారు. నేను చనిపోతున్నాను!’’ అంటూ భయంతో వణికిపోయేవాడు.

కోసికలాన్‌ తీసుకెళ్తే తప్ప తమ కుమారుడి విషయంలో మార్పు రాదని భావించిన తల్లిదండ్రులు 1956లో బాలుడిని తీసుకుని కోసికలాన్‌ వెళ్లారు. అయితే, ఆ సమయంలో బోలానాథ్‌ లేకపోవడం వల్ల కలవకుండానే వెనక్కి వచ్చేశారు. కానీ ప్రకాశ్‌ జ్ఞాపకాలు మాత్రం కోసికలాన్‌కు ప్రయాణిస్తూనే ఉన్నాయి. పలుమార్లు కొసికలాన్‌కు వెళ్లడానికి విఫలయత్నాలు చేశాడు.

ఓరోజు పెద్ద మేకును పట్టుకుని కోసికలాన్‌ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. ప్రకాశ్‌ నాన్న వెంటనే గమనించి ఆపాడు. చేతిలో ఉన్న మేకు ఏమిటని అడిగితే– ‘‘ఇది నా ఇనప్పెట్టె తాళం చెవి’’ అని చెప్పాడు. 
ప్రకాశ్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి కోసికలాన్‌ గురించి మరింత మారాం చేస్తుండటంతో 1961లో మళ్లీ అతడిని తీసుకుని వెళ్లారు. బస్సు దిగీదిగగానే వడివడిగా నడవడం మొదలుపెట్టాడు. ఆ వెనుకే అతడి తల్లిదండ్రులు కూడా అనుసరించారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పాత డాబా ఇంటి ముందు ఆగాడు.
‘‘ఇదే నా ఇల్లు!’’ అన్నాడు గట్టిగా.

ఇంట్లోంచి బయటకు వచ్చిన మహిళను చూడగానే ప్రకా‹శ్‌ కళ్లు చెమ్మగిల్లాయి. ‘అమ్మా!’ అంటూ ఆమెను హత్తుకున్నాడు. పక్కనే నిలబడిన ఓ యువకుడిని ‘‘నువ్వు నా తమ్ముడు దేవేంద్ర కదా’’ అని అడిగాడు. ‘‘తారక్క ఎక్కడుంది?’’ అని ప్రశ్నించాడు. ఇది చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. బోలానాథ్‌ జైన్‌ కుమారుడు నిర్మల్‌ నిజంగానే ఉన్నాడని, 1950లో సుమారు పదేళ్ల వయసులో మశూచితో మరణించినట్లు తెలిసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ప్రకాశ్‌ అంతటితో ఆగలేదు. ఆ ఇల్లంతా తిరిగాడు. ఏ గది ఎక్కడుందో, వెనుక పెరట్లో ఏముందో చెప్పాడు.
ఇవన్నీ చూసిన నిర్మల్‌ తల్లి కన్నీటిపర్యంతమైంది. మరోవైపు తమ బిడ్డ తమకు దక్కకుండా పోతాడేమోనని ప్రకాశ్‌ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ చూశారు. ఆ క్షణంలో ఆ వాకిట్లో నిశ్శబ్దం ఆవరించింది. రెండు కుటుంబాల మధ్య మమకారాలు, అనుమానాలు, అంతుచిక్కని కాలచక్రపు రహస్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. చివరకు, బాలుడి భవిష్యత్తు కోసం ప్రకాశ్‌ను అతడి తల్లిదండ్రులతోనే పంపాలని అందరూ నిర్ణయించుకున్నారు.

ఈ విషయం పునర్జన్మలపై అధ్యయనం చేస్తున్న అమెరికా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఇయాన్‌ స్టీవెన్‌సన్‌కు తెలిసింది. దీంతో ఆయన 1961లో భారత్‌కు వచ్చారు. ప్రకాశ్, అతడి కుటుంబం, జైన్‌ కుటుంబం, స్థానిక సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. 1964లో మరోసారి భారత్‌కు వచ్చి వివరాలు సేకరించారు. 
ఈ కేసులో ఆయన దృష్టిని ఆకర్షించిన అంశం భౌగోళిక దూరం. ప్రకాశ్‌ కుటుంబం నివసించే ఛత్తా, నిర్మల్‌ కుటుంబం నివసించే కోసికలాన్‌  పట్టణాల మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్ల లోపే! పైగా రెండు కుటుంబాలకు ముందుగా పరిచయం కూడా లేదు. డాక్టర్‌ స్టీవెన్‌సన్‌  ఈ కేసును ‘పునర్జన్మ కేసు’గా పరిగణించారు.

ప్రకాశ్‌ చెప్పిన పేర్లు, కుటుంబ సంబంధాలు, దుకాణాల వివరాలు, ఇంటి నిర్మాణం వంటి కొన్ని అంశాలు జైన్‌  కుటుంబానికి సంబంధించిన సమాచారంతో సరిపోలినట్లు గుర్తించారు. పునర్జన్మలపై తాను రాసిన పుస్తకంలో ప్రకాశ్‌ ఉదంతం గురించి వివరంగా రాశారు. కాలం గడిచేకొద్దీ ప్రకాశ్‌ సాధారణ జీవితంలోకి వెళ్లాడు. అయితే బాల్యంలో తనకు కలిగిన నిర్మల్‌ జ్ఞాపకాల ప్రభావం పూర్తిగా మాయం కాలేదు.

ఒక చిన్నారి తనకు తెలియని మరో కుటుంబం, మరో ఊరు, మరో వ్యక్తి పేరు ఎందుకు చెప్పాడు? ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు కొన్ని వ్యక్తులను, ప్రదేశాలను గుర్తించినట్లు ఎందుకు ప్రవర్తించాడు? అతడు చెప్పిన కొన్ని వివరాలు అక్కడి వాస్తవాలతో ఎలా సరిపోయాయి? ఇవన్నీ పునర్జన్మకు సాక్ష్యాలేనా? లేక ఇప్పటికీ పూర్తిగా అర్థంకాని బాల్య జ్ఞాపకాలు, సమాచార మార్పిడి, మానసిక ప్రక్రియల ఫలితమా?
ప్రకాశ్‌ వర్ణే›్ష ఉదంతం ఈ ప్రశ్నలకు తుది సమాధానం ఇవ్వకపోయినా, ‘మరణం తర్వాత కూడా జ్ఞాపకం కొనసాగుతుందా’ అనే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది.

- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇదీ చదవండి: చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్‌ రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement