చాన్ ష్యూహ్, హరూకీ మురకామి, సల్మాన్ రష్డీ
ఫండే
లిట్‌వరల్డ్
ప్రతి సంవత్సరం అక్టోబర్ 5–12 తేదీల మధ్యలో, ఆ ఏడాది నోబెల్ సాహిత్యపురస్కారం ఎవరు గెల్చుకున్నారో ప్రకటించడం స్వీడిష్ ఎకాడెమీకి ఆనవాయితీ. బహుశా ఈ ఏడాది కూడా అదే సమయంలో– అంటే, మరికొద్ది రోజుల్లో– 2026 సంవత్సరానికిగాను నోబెల్ సాహిత్యపురస్కారం ఎవరు గెల్చుకున్నారో ప్రకటితమవుతుంది. ఈ పురస్కారం ఎవరికి దక్కబోతోందన్న విషయంపై, ప్రపంచ సాహిత్యవర్గాల్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.
2026 నోబెల్ సాహిత్యపురస్కారానికి సంబంధించినంత వరకూ వీటిని నామినేషన్లుగా పేర్కోవడం కద్దు. ఇంతవరకు, 287 నామినేషన్లు వచ్చాయని వినికిడి. వాటిల్లో కొందరికి విజయావకాశాలు పుష్కలంగా వున్నాయని కొందరు ‘నిపుణులు’ ఊహాగానాలు చేస్తున్నారు. ఈ ‘బుక్కీల’ ఊహాగానాలపై ఆధారపడి ‘బెట్టింగులు’ కూడా సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
సాహిత్య బుక్కీల ఊహాగానాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో, ముందుగా చెప్పుకోవలసిన పేరు చైనీస్ రచయిత్రి చాన్ ష్యూహ్. ‘కురిసే మంచు’ అనేది ఈ కలంపేరుకు అర్థమట. ఆమె అసలు పేరు డెంగ్ షియవోహువా. తొలితరం చైనీస్ రచయితల రచనాధోరణికి పూర్తి భిన్నమైన రీతిలో సాగింది చాన్ రచన.
పదమూడు పద్నాలుగు శతాబ్దాలకు చెందిన ఇటాలియన్ కవి– తాత్త్వికుడు– రచయిత డాంటే, పందొమ్మిది– ఇరవై శతాబ్దాలకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ చెక్ రచయిత కాఫ్కా, అతనికి సమకాలికుడైన అర్జెంటీన్ రచయిత– తాత్త్వికుడు– హొర్హే బొర్హే, చాన్‌ను గాఢంగా ప్రభావితం చేశారు. చాన్ నవల ‘చివరి ప్రేమికుడు’ 2015లో ఉత్తమ అనువాద గ్రంథంగా పురస్కారం పొందింది. మరో అయిదేళ్ళ తర్వాత, ఆమె రాసిన ‘మహారాణి’ కథానిక రెండేళ్ళకు ఒకసారి ప్రకటించే దాయీ సాహిత్య పురస్కారం దక్కింది. మరో రెండేళ్ళకు ‘మనోహరమైన ఇతరుల జీవితాలు’ నవలకు ‘హువా జాంగ్ ప్రపంచప్రసిద్ధ చైనీస్ రచన’ పురస్కారం దక్కింది. మరో రెండేళ్ళకు, అమెరికన్ సాహిత్య పురస్కారం గెల్చుకుంది. అప్పటినుంచీ నోబెల్ సాహిత్యపురస్కారానికి అర్హుల జాబితాలో, చాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే వుంది.
చాన్ నోబెల్ బుక్కీల తొలి ఎంపిక అయితే, మలి ఎంపికగా చెప్పుకోదగిన పేరు సర్ అహ్మద్ సల్మాన్ రష్డీ. భారత దేశం స్వాతంత్య్రం సంపాదించుకోడానికి రెండునెల్ల ముందు– ఆనాటి బొంబాయి మహానగరంలో– పుట్టారు రష్డీ. పద్నాలుగోయేట ఇంగ్లండ్ తరలివెళ్ళిన రష్డీ, మరో యేడేళ్ళకు కేంబ్రిజ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టాపుచ్చుకున్నారు. 1900లో ఫ్రాంక్ బాం రాసిన నవల ఆధారంగా రూపొందించిన ‘ద విజార్డ్ ఆఫ్ ద ఓజ్’ చిత్రం చూసి తాను రచయితనయ్యానన్నారు రష్డీ.
పీ.జీ.వుడ్‌హౌస్, అగాథా క్రిస్టీల రచనలు గుట్టలు గుట్టలుగా చదివిపారేశానన్నరాయన. కాపీరైటర్‌గా జీవితం మొదలుపెట్టిన పుష్కరానికి–1981లో– రష్డీ ప్రచురించిన నవలే ‘మిడ్‌నైట్స్ చిల్డ్రెన్’. ఈ రచన రష్డీకి నిత్యాధునికవాదిగానూ, అద్భుత వాస్తవవాదిగానూ పేరు తెచ్చిపెట్టింది. ఆ నవల బుకర్ పురస్కారం గెల్చుకుంది. ఇదే రచన 1993లో ‘బెస్ట్ ఆఫ్ బుకర్స్’ పురస్కారాన్నీ, 2008లో ‘బుకర్ ఆఫ్ బుకర్స్’ పురస్కారాన్నీ గెల్చుకుంది. దాంతో ఈ నవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అప్పటినుంచీ, రష్డీ పేరు కాబోయే నోబెల్ పురస్కార విజేతల జాబితాలో కనిపిస్తూనే వుంది. ఈసారి అతగాడి అదృష్టం ఎలావుందో మరి!
హరూకీ మురకామి జపనీస్ కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త మురకామి రచనలు ఇప్పటికి యాభై భాషల్లోకి అనువాదమయ్యాయి. స్వదేశీ– విదేశీ మార్కెట్లలో, మురకామీ రచనల ప్రతులు మిలియన్ల కొద్దీ అమ్ముడయ్యాయి. ఆయన తొలి నవల ‘గాలిపాట వినండి!’ నూతన రచయితలకు ఇచ్చే ‘గుంజో’ పురస్కారాన్ని 1979లోనే గెల్చుకుంది. ఆ తర్వాత మురకామి –‘పిన్ బాల్’, ‘కొండగొర్రె వేట’, ‘డాన్స్ డాన్స్ డాన్స్’– అనే మరో మూడు గొలుసుకట్టు నవలలు వెలువరించారు.
వాటిని అన్నింటినీ కలిపి ‘మూషిక చతుష్టయం’ అని కూడా పిలుస్తారు. 1982లో మురకామి నవల ‘కొండగొర్రె వేట’ నోమా సాహిత్యపురస్కారాన్ని గెల్చుకుంది. 2006లో మురకామికి ‘ఫ్రాంజ్ కాఫ్కా పురస్కారం’ దక్కింది. అదే సంవత్సరం మురకామి ‘ఫ్రాంక్ ఓకానర్ అంతర్జాతీయ కథా సాహిత్యపురస్కారం’ గెల్చుకున్నారు. ఆ పురస్కారానికి గాను 35 వేల డాలర్ల ప్రతిఫలం మురకామికి ముట్టింది. మురకామిపై కాఫ్కా ప్రభావం ఎంత ప్రగాఢమైందో ప్రపంచానికి తెలిసిందే! ఇన్ని బహుమతులు అందుకున్న హరూకీ మురకామియే 2026 నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకుంటారన్నది కొందరు బుక్కీల అంచనా.
సుప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత థామస్ పించాన్ పేరు, కెనడియన్ నవలారచయిత్రి– కవయిత్రి– విమర్శకురాలు– మార్గరెట్ యాట్వుడ్ పేరు కూడా కాబోయే నోబెల్ సాహిత్యపురస్కార విజేతల పేర్ల జాబితాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. 66 పుస్తకాలు వెలువరించి, రెండుసార్లు బుకర్ పురస్కారం, అర్థర్ క్లార్క్ పురస్కారం, ఆర్డర్ ఆఫ్ కెనడా, కాఫ్కా పురస్కారం, ఆస్ట్రియా రాకుమారుడి సాహిత్య పురస్కారం, జాతీయ విమర్శకుల పురస్కారం, అమెరికన్ పెన్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ప్రసిద్ధురాలు మార్గరెట్. ఈ అయిదుగిరిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా నోబెల్ సాహిత్య పురస్కారం దక్కి తీరుతుందని బుక్కీలు ఢంకా బజాయించి చెప్తున్నారు. అదీ చూద్దాం!!
- మందలపర్తి కిషోర్
ఇదీ చదవండి: చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు!


