ఫండే
లైఫ్ జర్నీ
ఎయిర్‌హోస్టెస్‌గా ఆకాశంలో చక్కర్లు కొట్టే అమ్మాయి, కెమెరా ముందు నిలబడి చప్పట్లను వింటోంది. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఫొటోతోనే సినీ అవకాశం దక్కించుకున్న నటి రాశి సింగ్ చెబుతున్న తన సినీప్రయాణ విషయాలన్నీ ఆమె మాటల్లోనే మీకోసం...
కెమెరా కోసమే పుట్టాను!
ఛత్తీస్‌గఢ్‌లో పుట్టి, ఢిల్లీలో డిగ్రీ చేసిన వెంటనే, ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశాను. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్థిరపడాలన్నది నా కోరిక. అందుకే, ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేసేదాన్ని. ఒకసారి నా ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఓ సినిమా మేనేజర్ నన్ను సంప్రదించారు. అలా సినిమాల్లోకి వచ్చేశాను. నిజం చెప్పాలంటే, కెమెరా ముందు నిలబడటం నాకు ఎప్పుడూ కొత్తగా అనిపించలేదు. నేను కెమెరా కోసమే పుట్టానేమో అనిపిస్తుంది!
సెట్లో డ్యూటీ కష్టం!
ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసినప్పుడు నా పని కష్టమే అనుకున్నాను. కానీ సినిమాల్లోకి వచ్చాక అసలు పరీక్ష ఏంటో తెలిసింది! ఒక్కోసారి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు షూటింగ్ చేయాల్సి వస్తుంది. రాత్రంతా షూటింగ్ చేసి, మళ్లీ ఉదయాన్నే సెట్‌కు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. మొదట్లో ఇవన్నీ చూసి షాక్ అయ్యేదాన్ని. కానీ కెమెరా ముందుకొచ్చిన వెంటనే ఆ అలసట అంతా ఎక్కడికో వెళ్లిపోతుంది.
వైరల్ అవ్వడం ఓ పని!
నా ఎక్స్‌ప్రెషన్స్ గురించి చాలామంది మాట్లాడుతుంటారు. ఈ మధ్య ఫంక్షన్స్, ప్రమోషన్స్‌లో నా రియాక్షన్స్ వైరల్ అవుతుంటే నవ్వొస్తుంది. నేను ఏదైనా సీరియస్‌గా చూస్తుంటే అది కూడా మీమ్స్‌కు మెటీరియల్ అయిపోతుంది! అలా నాకు వైరల్ గర్ల్ అనే పేరు రావడం కాస్త సరదాగానే అనిపిస్తుంది.
చలిలో.. చాలెంజింగ్!
‘రంభ ఊర్వశి మేనక’ షూటింగ్ నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. రాత్రి వేళల్లో షూట్ చేశాం. ఉష్ణోగ్రత ఆరు నుంచి ఏడు డిగ్రీలకు పడిపోయేది. అంత చలిలోనూ భారీ కాస్ట్యూమ్స్, నగలు వేసుకుని పనిచేయాలి. కొన్ని కాస్ట్యూమ్స్ అయితే చాలా క్లిష్టంగా ఉండేవి. వాటిని చూసుకోవడానికి ఏకంగా ముగ్గురు అవసరమయ్యేవారు!
తగ్గిన బరువు... పెరిగిన టెన్షన్!
కొన్ని పాత్రల కోసం నా లుక్ పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా బరువు కూడా తగ్గాను. బయటికి చూస్తే గ్లామరస్‌గా కనిపిస్తాను. కానీ దాని వెనుక డైట్, వర్కౌట్, క్రమశిక్షణ చాలా ఉంటాయి. ఒక పాత్ర కోసం మన శరీరాన్నే మార్చుకోవడం అంత ఈజీ కాదు.
నా పని నాదే!
ఇండస్ట్రీలో రాజకీయాలు, గ్రూపిజం ఉన్నాయా అంటే ఉన్నాయనే చెబుతాను. కొందరు తమకు దగ్గరగా ఉన్న వాళ్లకే అవకాశాలు వచ్చేలా ప్రయత్నిస్తారు. దాని వల్ల కొన్ని అవకాశాలు మన చేతి నుంచి వెళ్లిపోవచ్చు. కానీ నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించను.
నా కలల హీరో!
నాకు ఇష్టమైన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆయనతో కలిసి పనిచేయాలన్నది నా డ్రీమ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, నటన అన్నీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను. అలాగే, ఇంకా ఎన్నో రకాల పాత్రలు చేయాలి.
ఇదీ చదవండి: అమ్మానాన్నల కోసం కార్పొరేట్ ఉద్యోగం వదులుకొని!


