శతక మోత | India defeated West Indies by 8 wickets in the first ODI | Sakshi
Sakshi News home page

శతక మోత

Sep 28 2026 2:47 AM | Updated on Sep 28 2026 2:47 AM

India defeated West Indies by 8 wickets in the first ODI

విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలు

తొలి వన్డేలో టీమిండియా జయభేరి 

8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ పరాజయం 

జస్టిన్‌ గ్రీవ్స్‌ శతకం వృథా

4 వికెట్లతో మెరిసిన కుల్దీప్‌ యాదవ్‌

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించిన విరాట్‌ కోహ్లి... వెస్టిండీస్‌పై విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స్‌లతో కరీబియన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన పరుగుల దాహం ఇంకా తీరలేదని నిరూపించుకున్నాడు. కోహ్లి దూకుడుకు సారథి శుబ్‌మన్‌ గిల్‌ శతకం తోడవడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా విజయఢంకా మోగించింది.  

తిరువనంతపురం: విరాట్‌ కోహ్లి (88 బంతుల్లో 139 నాటౌట్‌; 10 ఫోర్లు, 9 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (108 బంతుల్లో 110; 13 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో రెచ్చిపోవడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 

జస్టిన్‌ గ్రీవ్స్‌ (108 బంతుల్లో 101; 12 ఫోర్లు) సెంచరీ సాధించగా... జాన్‌ క్యాంప్‌బెల్‌ (60 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అమిర్‌ జంగూ (43 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్‌ యాదవ్‌ 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి, గిల్‌ సెంచరీల మోత మోగించగా... ‘హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ఇరు జట్ల మధ్య బుధవారం గువాహటిలో రెండో వన్డే జరగనుంది. 

సిక్స్‌లతో రెచ్చిపోయిన ‘కింగ్‌’ 
రెండు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెట్టిన ‘కింగ్‌’ కోహ్లి... తనకు అలవాటైన రీతిలో రెచ్చిపోయాడు. సాధారణంగా సిక్స్‌ల కంటే ఫోర్లు ఎక్కువ కొట్టే అలవాటున్న కోహ్లి... ఆదివారం అభిమానులకు భారీ సిక్సర్లతో విందు భోజనం పెట్టాడు. ఓపెనర్లు రోహిత్, గిల్‌ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభం అందించగా... కోహ్లి ఎదుర్కొన్న నాలుగో బంతికే సిక్సర్‌ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ఇక అక్కడి నుంచి మొదలుకొని మ్యాచ్‌ ముగిసేంత వరకు విరాట్‌ వీరవిహారం కొనసాగింది. 

కోహ్లికి మరో ఎండ్‌ నుంచి గిల్‌ చక్కటి సహకారం అందించడంతో భారత ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. ఈ క్రమంలో గిల్‌ 49 బంతుల్లో, విరాట్‌ 40 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన ‘చేజ్‌ మాస్టర్‌’ అల్జారీ ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’ ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. 

వన్డేల్లో పదో సెంచరీ అనంతరం గిల్‌ అవుట్‌ కాగా... కోహ్లి 74 బంతుల్లో శతకం ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అతడికి 55వ సెంచరీ కాగా... ఓవరాల్‌గా 86వది. మూడంకెల స్కోరు అందుకున్న తర్వాత మరింత దూకుడు పెంచిన విరాట్‌... మోతీ ఓవర్‌లో 6,4, అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, కార్టీ ఓవర్‌లో రెండు వరుస సిక్స్‌లతో మరో 50 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

విరాట్‌ @ 15,000
ఈ మ్యాచ్‌ ద్వారా ‘రన్‌ మెషీన్‌’ విరాట్‌ కోహ్లి మరో ఘనత ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 15,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా విరాట్‌ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్‌ ప్రస్తుతం 315 మ్యాచ్‌ల్లో 15,080 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

సంగక్కర (14,234), పాంటింగ్‌ (13,704), జయసూర్య (13,430) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో కోహ్లి ఒక దేశంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి భారత్‌లో 7,006 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్‌ (భారత్‌లో 6976 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.

55 వన్డేల్లో విరాట్‌ సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్‌లో అతడిదే అగ్రస్థానం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (49) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక అన్నీ ఫార్మాట్‌లలో కలిసి సచిన్‌ 100 సెంచరీలు చేయగా... ప్రస్తుతం కోహ్లి 86 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.  

9 ఈ మ్యాచ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్‌లు. ఒక వన్డేలో అతడికివే అత్యధికం. 2023లో శ్రీలంకతో వన్డేలో కోహ్లి 8 సిక్స్‌లు బాదాడు.

స్కోరు వివరాలు 
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (సి) ప్రసిధ్‌ (బి) కుల్దీప్‌ 62; గ్రీవ్స్‌ (ఎల్బీ) (బి)కుల్దీప్‌ 101; కార్టీ (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 13; హోప్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌12; అమిర్‌ జంగూ (నాటౌట్‌) 58; జెవెల్‌ ఆండ్రె (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 0; చేజ్‌ (బి) ప్రసిధ్‌ 24; ఫోర్డ్‌ (సి) నమన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 7; మోతీ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 295. వికెట్ల పతనం: 1–135, 2–176, 3–195, 4–198, 5–198, 6–250, 7–288. బౌలింగ్‌: ప్రసిధ్‌ కృష్ణ 10–0–60–2; నితీశ్‌ రెడ్డి 5–0–45–1; బ్రార్‌ 10–0–60–0; జడేజా 10–0–54–0; నమన్‌ ధీర్‌ 5–0–33–0; కుల్దీప్‌ 10–1–40–4. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఆండ్రె (బి) అల్జారీ జోసెఫ్‌ 32; గిల్‌ (సి) ఆండ్రె (బి) చేజ్‌ 110; కోహ్లి (నాటౌట్‌) 139; రుతురాజ్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (41.4 ఓవర్లలో 2 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–74, 2–225. బౌలింగ్‌: జైడెన్‌ సీల్స్‌ 7–0–32–0; మాథ్యూ ఫోర్డ్‌ 5–0–39–0; అల్జారీ జోసెఫ్‌ 9–1–81–1; గుడాకెశ్‌ మోతీ 10–0–66–0; రోస్టన్‌ చేజ్‌ 10–0–64–1; కార్టీ 0.4–0–17–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement