పతకమోత... | India adds seven medals to its tally on the eighth day of the Asian Games 2026 | Sakshi
Sakshi News home page

పతకమోత...

Sep 28 2026 2:35 AM | Updated on Sep 28 2026 2:35 AM

India adds seven medals to its tally on the eighth day of the Asian Games 2026

ఆసియా క్రీడల్లో ఎనిమిదో రోజు భారత్‌ ఖాతాలో ఏడు పతకాలు

రజతాలు గెలిచిన లాంగ్‌జంపర్‌ అన్సీ సోజన్, హైజంపర్‌ సర్వేశ్‌

కాంస్యాలు సాధించిన డెకాథ్లెట్‌ తేజస్విన్, స్ప్రింటర్‌ హరిత, స్టీపుల్‌ఛేజర్‌ పారుల్‌

స్క్వాష్‌లో అనాహత్, అభయ్‌ వెండి వెలుగులు

అంచనాలను అందుకుంటూ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు  అదరగొడుతున్నారు. పసిడి పతకం ఇంకా గెలవకపోయినా మన అథ్లెట్లు రజత, కాంస్యాలతో మెరిపిస్తున్నారు. ఎనిమిదో రోజు ఆదివారం భారత్‌ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరగా... అందులో ఐదు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ ఎడిపిల్లి... పురుషుల హైజంప్‌లో సర్వేశ్‌ కుశారే రజత పతకాలు గెలిచారు. పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌... మహిళల 200 మీటర్ల స్ప్రింట్‌ రేసులో హరిత భద్ర... మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్‌ చౌధరీ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 

స్క్వాష్‌లో అనాహత్‌ సింగ్, అభయ్‌ సింగ్‌ పసిడి పోరులో ఓటమి పాలై రజత పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం  కాగా... ఆర్చరీలో భారత కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరుకొని పతకం బరిలో నిలిచారు. బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌ షట్లర్లు ఈసారి రిక్తహస్తాలతో తిరిగిరానున్నారు. సెమీఫైనల్‌ చేరితే నాలుగు పతకాలు ఖాయమయ్యే పరిస్థితిలో భారత షట్లర్లందరూ క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగారు.  

నగోయా: పసిడి అందకపోయినా పతకాల వేటలో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఆసియా క్రీడల ఎనిమిదో రోజు భారత్‌కు త్రుటిలో రెండు స్వర్ణాలు చేజారిపోయాయి. మహిళల లాంగ్‌జంప్‌లో ఆఖరి ప్రయత్నంలో చైనా అథ్లెట్‌ దెబ్బకొట్టగా... పురుషుల హైజంప్‌లో కౌంట్‌బ్యాక్‌లో బంగారు పతకాలు దూరమయ్యాయి. మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 26 ఏళ్ల అన్సీ సోజన్‌ వరుసగా రెండో ఆసియా క్రీడల్లో రజత పతకంతో సంతృప్తి పడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ అన్సీ రెండో స్థానంలో నిలిచింది. 

ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా కామన్వెల్త్‌ గేమ్స్‌కు కూడా దూరమైన అన్సీ కేవలం రెండు సెంటీమీటర్ల వ్యత్యాసంతో పసిడి పతకాన్ని కోల్పోయింది. అన్సీ 6.53 మీటర్ల దూరం గెంతగా... చైనా ప్లేయర్‌ అమ్మాయి యింగ్‌యింగ్‌ హువాంగ్‌ 6.55 మీటర్లతో స్వర్ణాన్ని ఎగురేసుకపోయింది. ఐదో ప్రయత్నంలో అన్సీ 6.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానంలో ఉండగా... యింగ్‌యింగ్‌ చివరిదైన ఆరో ప్రయత్నంలో 6.55 మీటర్ల దూరం గెంతి విజేతగా నిలిచింది. మెంగీ టాన్‌ (చైనా; 6.46 మీటర్లు) కాంస్యం దక్కించుకోగా... మరో భారత లాంగ్‌జంపర్‌ శైలి సింగ్‌ 6.42 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.  

56 ఏళ్ల నిరీక్షణకు తెర...
గత జూలైలో జరిగిన గ్లాస్గో కామన్వెల్‌ గేమ్స్‌లో రజతం గెల్చుకున్న సర్వేశ్‌ కుశారే అదే ప్రదర్శనను ఆసియా క్రీడల్లో పునరావృతం చేశాడు. తద్వారా 1970 తర్వాత ఆసియా క్రీడల పురుషుల హైజంప్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన అథ్లెట్‌గా 31 ఏళ్ల సర్వేశ్‌ గుర్తింపు పొందాడు. స్వర్ణ పతకం సాధించిన ఫు చావో సువాన్‌ (చైనీస్‌ తైపీ), రజతం గెలిచిన సర్వేశ్‌ 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. తదుపరి 2.28 మీటర్ల మార్క్‌ను దాటేందుకు ప్రయత్నించి ఇద్దరూ నిర్ణీత మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యారు. 

దాంతో నిబంధనల ప్రకారం 2.25 మీటర్ల ఎత్తును తొలి ప్రయత్నంలోనే దాటిన ఫు చావో సువాన్‌కు స్వర్ణం ఖరారైంది.తొలి ప్రయత్నంలో విఫలమై, రెండో ప్రయత్నంలో 2.25 మీటర్ల ఎత్తును దాటిన సర్వేశ్‌కు రజతం దక్కింది. సాంగ్‌హైక్‌ వూ (దక్షిణ కొరియా; 2.22 మీటర్లు) కాంస్య పతకం అందుకున్నాడు. 1970 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల హైజంప్‌లో భీమ్‌ సింగ్‌ భారత్‌కు కాంస్యం రూపంలో చివరిసారి పతకం గెలుచుకోగా... 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సర్వేశ్‌ మళ్లీ హైజంప్‌లో భారత్‌కు రజతం రూపంలో పతకాన్ని అందించాడు.

హరిత.. అరంగేట్రంలోనే...
అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రయత్నంలోనే స్ప్రింటర్‌ హరిత భద్ర పతకంతో మెరిసింది. మహిళల 200 మీటర్ల ఫైనల్‌ రేసును హరిత 23.20 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. మహారాష్ట్రకు చెందిన హరిత గత ఏడాది లండన్‌లోని లాఫ్‌బరా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ స్పోర్ట్స్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి అథ్లెటిక్స్‌ కెరీర్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించింది. 

ఈ ఏడాది ఇంటర్‌స్టేట్‌ చాంపియన్‌షిప్‌లో 23.14 సెకన్లతో స్వర్ణం గెలిచిన హరిత ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. అదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించి తన మెడలో కాంస్య పతకాన్ని వేసుకుంది. ఒకవైపు అథ్లెటిక్స్‌లో కొనసాగుతూ మరోవైపు సొంతంగా నగలను డిజైన్‌ చేసి ఆన్‌లైన్‌లో విక్రయించే హరిత స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ను ఆదర్శంగా తీసుకుంటానని తెలిపింది.  

తేజస్విన్‌ శంకర్‌ కొత్త చరిత్ర 
ఆసియా క్రీడల డెకాథ్లాన్‌ ఈవెంట్‌లో రెండుసార్లు పతకాలు గెలిచిన తొలి భారతీయ డెకాథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు నెలకొల్పాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన తేజస్విన్‌ ఈసారి కాంస్య పతకం అందుకున్నాడు. పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్‌ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్‌ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ 7934 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. 

యుమా మారుయామ (జపాన్‌; 8123 పాయింట్లు) స్వర్ణం, జింగ్‌హువా చెన్‌ (చైనా; 8012 పాయింట్లు) రజతం సాధించారు. భారత్‌కే చెందిన తౌఫీక్‌ నౌషాద్‌ ఐదు ఈవెంట్స్‌ తర్వాత వైదొలిగాడు. గతంలో భారత్‌ తరఫున ఆసియా క్రీడల డెకాథ్లాన్‌లో ఖుర్షీద్‌ అహ్మద్‌ (1951; కాంస్యం), రోనీ ఒబ్రెయిన్‌ (1954; కాంస్యం), గుర్‌బచన్‌సింగ్‌ రణ్‌ధావా (1962; స్వర్ణం), ఎంజీ శెట్టి (1970; రజతం), సురేశ్‌ బాబు (1974; కాంస్యం) ఒక్కోసారి పతకం గెలిచారు.

పారుల్‌... ఈసారి కాంస్యం... 
ఆసియా క్రీడల్లో 2010లో ప్రవేశపెట్టిన మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో వరుసగా ఐదోసారి భారత్‌ ఖాతాలో పతకం చేరింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసిన పారుల్‌ చౌధరీ ఈసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పారుల్‌ 9 నిమిషాల 08.67 సెకన్లతో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 2010 గేమ్స్‌ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సుధా సింగ్‌ స్వర్ణం, 2014 గేమ్స్‌లో లలిత కాంస్యం... 2018 గేమ్స్‌లో సుధా సింగ్‌ రజతం గెలిచారు. 

మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ నందిని ఆరో స్థానంలో నిలువగా... పురుషుల లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌ మురళీ, డేవిడ్‌ సాల్మన్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య రామరాజ్, అను రాఘవన్‌... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో తమిళ్‌రాసన్‌ సంతోష్‌ కుమార్‌ కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. 

అనాహత్, అభయ్‌లకు రజతాలు
నగోయా: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించి లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలని ఆశించిన భారత స్క్వాష్‌ స్టార్స్‌ అనాహత్‌ సింగ్, అభయ్‌ సింగ్‌లకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన సింగిల్స్‌ ఫైనల్స్‌లో అనాహత్, అభయ్‌ ఓడిపోయి రజత పతకాలు గెల్చుకున్నారు. 

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ శివసంగరి సుబ్రమణియం (మలేసియా) 11–4, 11–4, 11–7తో అనాహత్‌ను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎన్జీ ఇయాన్‌ యో (మలేసియా) 11–9, 11–5, 11–5తో అభయ్‌పై గెలిచి పసిడి పతకంతోపాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement