భారత్‌ పసిడి 'కూత' | Gold medals for mens and womens kabaddi teams at the 2026 Asian Games | Sakshi
Sakshi News home page

భారత్‌ పసిడి 'కూత'

Sep 27 2026 4:41 AM | Updated on Sep 27 2026 4:41 AM

Gold medals for mens and womens kabaddi teams at the 2026 Asian Games

పురుషుల, మహిళల కబడ్డీ జట్లకు స్వర్ణాలు

మారథాన్‌లో సావన్‌ బర్వాల్, షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌కు రజతాలు 

షూటింగ్, స్క్వాష్, మహిళల 400 మీ.లలో కాంస్యాలు 

ఏడో రోజు భారత్‌కు 7 పతకాలు 

ఆసియా క్రీడల పట్టికలో ప్రస్తుతం 10వ స్థానం

భారత కబడ్డీ జట్లు నిరాశపర్చలేదు...ఆసియా క్రీడల్లో తమ స్థాయిని మళ్లీ చూపిస్తూ పురుషుల, మహిళల కబడ్డీ టీమ్‌లు తమ స్వర్ణాలను నిలబెట్టుకున్నాయి. అథ్లెటిక్స్‌లో కూడా భారత్‌ మూడు పతకాలతో మెరిసింది. మారథాన్‌ సావన్‌ అనూహ్యంగా రజతాన్ని అందించగా, షాట్‌పుటర్‌ తజీందర్‌ కూడా సిల్వర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వైపు ప్రాచి కూడా ఏషియాడ్‌లో వరుసగా రెండో పతకాన్ని అందుకోగా...సీనియర్‌ స్క్వాష్‌ స్టార్‌ జోష్న తన భాగస్వామి సెంథిల్‌తో కలిసి కంచు మోత మోగించింది. ఓవరాల్‌గా ఏడో రోజు 7 పతకాలతో భారత బృందం మురిపించగా... బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

హోరాహోరీ పోరులో... 
మహిళల కబడ్డీలో భారత జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్‌ 37–34 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. ఈ క్రీడల్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఏకపక్ష విజయాలు సాధించిన భారత్‌కు తుది పోరులో మాత్రం పోటీ ఎదురైంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి భారత్‌ 22–16తో ఆధిక్యంలో నిలిచింది. వీటిలో 16 రెయిడ్‌ పాయింట్లు సాధించిన జట్టు 3 బోనస్‌ పాయింట్లు, ఒక ఆలౌట్‌ను స్కోర్‌ చేసింది. అయితే రెండో అర్ధ భాగంలో కోలుకొని వరుసగా పాయింట్లు సాధించిన ఇరాన్‌ గట్టి పోటీనిస్తూ స్కోరును దాదాపు సమంగా 26–27 వద్దకు తీసుకొచ్చింది. 

అయితే ఈ దశలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజు దేవి సూపర్‌ రైడ్‌తో మన జట్టు మళ్లీ ముందంజ వేసింది. ఆ తర్వాత కెప్టెన్‌ పుష్ప రాణా ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో జట్టుకు పట్టు చిక్కింది. ఈ దశలో ఇరాన్‌ సూపర్‌ టాకిల్‌తో కొంత పోరాడినా... చివరకు భారత మహిళలదే పైచేయి అయింది. 2010 ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని మొదటి సారి ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2010, 2014, 2022, 2026లలో భారత్‌ పసిడి గెలవగా, 2018లో మాత్రం ఇరాన్‌కు బంగారు పతకం దక్కింది.

పురుషులకు తొమ్మిదో స్వర్ణం... 
కబడ్డీలో భారత పురుషుల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఏకంగా 9వ స్వర్ణాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 40–34 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను ఓడించింది. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పవన్‌ సెహ్రావత్‌ లేకుండానే తుది పోరులో బరిలోకి దిగిన భారత్‌ ఆరంభంలో తడబడింది. అయితే అర్జున్‌ దేశ్వాల్, దేవాంక్‌ వరుస పాయింట్లు రాబట్టడంతో కోలుకుంది. అర్ధభాగం ముగిసే సరికి భారత్‌ 17–18తో వెనుకబడింది. 

అయితే రెండో అర్ధభాగంలో జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కీలక దశలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడంతో ఆధిక్యం 29–24కు పెరిగింది. సమయం దగ్గరవుతుండటంతో భారత్‌ దూకుడు తగ్గించి జాగ్రత్తపడింది. ఈ దశలో ఇరాన్‌ ఎంత ప్రయత్నించినా పాయింట్లు రాబట్టడంలో విఫలమైంది. 1990 ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా 7 స్వర్ణాలు గెలుచుకున్న భారత్‌ 2018 క్రీడల్లో కాంస్యానికి పరిమితమైంది. అయితే 2022లో మళ్లీ పసిడిని అందుకున్న మన బృందం ఈ సారి దానిని నిలబెట్టుకుంది.

తజీందర్‌ వెండి వెలుగులు... 
ఆసియా క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అథ్లెŠట్‌ తజీందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ కల నెరవేరలేదు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో తజీందర్‌ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గుండును అతను 20.64 మీటర్ల దూరం విసిరాడు. ఇరాన్‌ అథ్లెట్‌ మొహమ్మద్‌ రెజా (20.81 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా, మొహమ్మద్‌ తొలు (సౌదీ అరేబియా–20.48 మీటర్లు) కాంస్యం అందుకున్నాడు. పంజాబ్‌కు చెందిన తూర్‌ 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు.  

ప్రాచి చౌదరికి కాంస్యం  
గత ఆసియా క్రీడల్లో మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో రజతం సాధించిన భారత అథ్లెట్‌ ప్రాచి చౌదరి ఈ సారి వ్యక్తిగత విభాగంలో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 53.21 సెకన్లలో పరుగు పూర్తి చేసిన ఉత్తరప్రదేశ్‌ అథ్లెట్‌ ప్రాచి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో సల్వా నాసర్‌ (బహ్రెయిన్‌–49.29 సెకన్లు) స్వర్ణం సాధించగా, జెహ్రీ జరీ (ఇరాన్‌–52.38 సెకన్లు) రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల బరిలోకి నిలిచిన మరో భారత అథ్లెట్‌ కిరణ్‌ పహల్‌ ఐదో స్థానంతో ముగించింది.  

సిల్వర్‌ సావన్‌
పురుషుల మారథాన్‌ రేస్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం లభించింది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన సావన్‌ బర్వాల్‌ రజత పతకం గెలుచుకున్నాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సావన్‌ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన ఇచిటకా యమషిత (2 గంటల 10 నిమిషాల 49 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, ప్యూ ఫెంగ్‌ (చైనా – 2 గంటల 12 నిమిషాల 13 సెకన్లు)కు కాంస్యం దక్కింది. 1982 ఆసియా క్రీడల్లో హోసూర్‌ కుక్కప్ప సీతారన్‌ కాంస్యం గెలిచిన తర్వాత మారథాన్‌కు మళ్లీ ఇప్పుడే పతకం దక్కడం విశేషం. 

అంతకు ముందు 1951 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఛోటా సింగ్, సూరత్‌ సింగ్‌ మారథాన్‌లో స్వర్ణ, కాంస్యాలు నెగ్గారు. పతకాన్ని గెలిచే క్రమంలో సావన్‌ కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. గత ఏప్రిల్‌లోనే తానే నెలకొల్పిన 2 గంటల 11 నిమిషాల 58 సెకన్ల టైమింగ్‌ను అతను బద్దలు కొట్టాడు. ఈ రేస్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్‌ కార్తీక్‌ కర్కేరా 17వ స్థానంతో ముగించాడు.  హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా జోగీందర్‌ నగర్‌ సావన్‌ స్వస్థలం. అతని తండ్రి కుల్దీప్‌ ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేశాడు. స్కూల్‌ గ్రౌండ్‌లో పరుగెడుతూ ఆసక్తి పెంచుతున్న సావన్‌ 14 ఏళ్ల వయసులోనే 1500 మీటర్ల పరుగులో శిక్షణ పొందాడు. 

2015లో అండర్‌–18 కేటగిరీలో తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అతను మరో మూడేళ్ల తర్వాత ఫెడరేషన్‌ కప్‌లో 5000 మీటర్ల పరుగుతో తన సీనియర్‌ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సావన్‌... 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా హాఫ్‌ మారథాన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. గత ఏడాది జాతీయ క్రీడల్లో 5,000 మీటర్లు, 10,000 మీటర్లలో స్వర్ణం సాధించిన సావన్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో అతను శిక్షణ పొందుతున్నాడు.

షూటింగ్‌లో మరో రజతం 
భారత్‌కు షూటింగ్‌ మరో పతకాన్ని అందించింది. మహిళల 50 మీటర్ల 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో మన జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. తిలోత్తమ సేన్, విదర్స వినోద్, ఆషి చోక్సీలతో కూడిన భారత జట్టు మొత్తం 1763 పాయింట్ల స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోరులో చైనా (1773 పాయింట్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్‌ (1754 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్‌  వ్యక్తిగత విభాగంలోనూ మెరుగైన ప్రదర్శనే కనబర్చినా... భారత షూటర్లకు అదృష్టం కలిసి రాలేదు. తిలోత్తమ నాలుగో స్థానంతో విదర్స ఐదో స్థానంతో ముగించారు. ఈ ఆసియా క్రీడల మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం సాధించిన విదర్సకు ఇది రెండో పతకం కాగా... ఆషి 2022 ఆసియా క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గింది.

స్క్వాష్‌లో కాంస్య పతకం
స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. భారత జోడి జోష్నా చిన్నప్ప–వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ శనివారం జరిగిన సెమీఫైనల్లో పరాజయంపాలైంది. హాంకాంగ్‌కు చెందిన టాంగ్‌ మింగ్‌ హాంగ్‌–లీ కా యి చేతిలో భారత ద్వయం 1–2 (10–11, 11–2, 10–11) స్కోరుతో ఓటమిని ఎదుర్కొంది. అయితే ఈ పోరు స్వల్ప వివాదంతో ముగిసింది. చెరో గేమ్‌ గెలిచిన తర్వాత మూడో గేమ్‌ కూడా హోరాహోరీగా సాగింది. 10–10తో స్కోరు సమంగా ఉన్న సమయంలో భారత్‌ పాయింట్‌ సాధించి సంబరాలు చేసుకుంది. 

అయితే భారత ద్వయం అరుస్తూ ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బ తీశారంటూ రిఫరీ ఈ పాయింట్‌ను అనుమతించకుండా మళ్లీ ఆడించారు. ఈ సారి హాంకాంగ్‌ది పైచేయి కావడం జోష్నా–సెంథిల్‌ జోడి నిరాశగా వెనుదిరిగింది. నిజానికి 10–7తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌ 3 మ్యాచ్‌ పాయింట్లు చేజార్చుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో జోష్నాకు ఇది 6వ పతకం కావడం విశేషం. వరుసగా 2010, 2014, 2018, 2022, 2026లలో కలిపి ఆమె 2 రజతాలు, 4 కాంస్యాలు నెగ్గింది. సెంథిల్‌కు ఆసియా క్రీడల్లో ఇదే తొలి పతకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement