ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం సృష్టించాడు. ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్న అతి పిన్న వయస్కుడైన అతను ఇ స్పోర్ట్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇ స్పోర్ట్స్‌లో భాగంగా ఉన్న ‘పుయో పుయో చాంపియన్స్’ ఈవెంట్‌లో అతను ఈ పసిడిని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో కురిహారా 10–2తో తనరక్ వాంగ్ (థాయిలాండ్)ను ఓడించాడు. పుయో పుయో చాంపియన్స్ ఒక రకమైన పజిల్ వీడియో గేమ్. ప్లే స్టేషన్ 4పై దీనిని ఆడవచ్చు.
ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న కురిహారా ఫైనల్లో ఓడించిన ప్రత్యర్థి వయసు 28 ఏళ్లు. దాంతో ఈ గెలుపు తర్వాత అతను కనీసం నవ్వలేదు కూడా! తన విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నానని, దాదాపు మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిపై గెలవడం తనకూ బాగా ఇబ్బందికరంగా ఉందని కురిహారా వ్యాఖ్యానించాడు. అయితే పతకం, దాంతో పాటు జ్ఞాపికగా ఇచ్చిన బొమ్మ చాలా బాగున్నాయని అతను సంతోషం ప్రకటించాడు. ‘పుయో పుయో’లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రొఫెషనల్ లైసెన్స్ అందుకున్న కురిహారా అప్పటినుంచే తనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్లయిన ప్రత్యర్థులను వరుసగా ఓడిస్తూ వస్తున్నాడు. చదువును, ఆటలను సమన్వయం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఈ జపాన్ అబ్బాయి చెప్పాడు.


