Photo Credit: BCCI Twitter
తిరువనంతపురం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ సెంచరీతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. గ్రీవ్స్ (108 బంతుల్లో 101, 12 ఫోర్లు) శతకానికి తోడు మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (62) అర్థశతకం సాధించాడు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించి జట్టుకు శుబారంభం అందించారు. ఈ దశలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్‌తో విండీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా కోల్పోని విండీస్ ఆ తర్వాత కుల్దీప్ మాయజాలంతో వరుసగా వికెట్లను చేజార్చుకుంది. జస్టిన్ గ్రీవ్స్, జువెల్ ఆండ్రూలను రెండు వరుస బంతుల్లో ఔట్ చేసిన కుల్దీప్ టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.
ఈ దశలో మిడిలార్డర్‌లో అమిర్ జాంగో (43 బంతుల్లో 58 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో రోస్టన్ చేజ్ (24) పరుగులు చేయడంతో విండీస్ 290 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయగా, ప్రసిధ్ క్రిష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకముందు విండీస్‌తో తొలి వన్డే ద్వారా టీమిండియా తరఫున కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ నమన్ ధిర్ ఈ మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ చేతుల మీదుగా నమన్ ధిర్ క్యాప్ అందుకున్నాడు.
ఇదీ చదవండి: మిల్లర్ ప్రపంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు


