కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని జ్ఞానేశ్ కుమార్ తనకు సూచించారని థామ్సన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేత జోసెఫ్ స్పందించారు. 2017లోనే థామ్సన్ బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి తానే ఆయనను ఆహ్వానించానని జోసెఫ్ వెల్లడించారు.
థామ్సన్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో విమాన ప్రయాణంలో జ్ఞానేశ్ కుమార్ తనను కలిశారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని ఆయన సూచించినట్లు తెలిపారు. కేరళలోని పతనంతిట్ట నుంచి పోటీ చేసి గెలిస్తే ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా అవకాశం లభిస్తుందని చెప్పినట్లు థామ్సన్ పేర్కొన్నారు. అయితే తాను ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలిపారు.
థామ్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత జోసెఫ్ ఫేస్‌బుక్ ద్వారా థామ్సన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా రాజకీయ కార్యకర్తలు తమ మధ్య జరిగిన వ్యక్తిగత చర్చలు, సమావేశాల వివరాలను బహిరంగంగా వెల్లడించరని.. అయితే థామ్సన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తాను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు. 2017లో తాను బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంఘ్ పరివార్‌కు చెందిన ఓ సీనియర్ నేత తనను సంప్రదించారని జోసెఫ్ తెలిపారు. థామ్సన్‌ను కొచ్చిలో నిర్వహించనున్న మైనారిటీ మోర్చా కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆ నేత తనను కోరినట్లు చెప్పారు. థామ్సన్ తమతో కలిసి రావడానికి ఆసక్తి చూపుతున్నారని కూడా అప్పట్లో తనకు చెప్పినట్లు జోసెఫ్ పేర్కొన్నారు.
2017 జూన్ 26న మార్ క్రిసోస్టమ్‌ను సన్మానించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి థామ్సన్ హాజరయ్యారని జోసెఫ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో పెట్టారు. వాటిలో థామ్సన్ వేదికపై ఉండటంతో పాటు ప్రసంగిస్తున్న దృశ్యాలు ఉన్నాయని చెప్పారు. అప్పటి యూడీఎఫ్ నేత, మాజీ మంత్రి కేఎం మాణి కూడా కార్యక్రమంలో పాల్గొన్నట్లు జోసెఫ్ పేర్కొన్నారు.
బీజేపీ కార్యక్రమానికి హాజరైన థామ్సన్ అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారని జోసెఫ్ తెలిపారు. అనంతరం 2017 నుంచి 2020 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో థామ్సన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే జోసెఫ్ చేసిన ఈ ఆరోపణలకు థామ్సన్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. అలాగే థామ్సన్ చేసిన బీజేపీ టికెట్ ఆఫర్ ఆరోపణలపై జ్ఞానేశ్ కుమార్ కూడా బహిరంగంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం


