నన్ను బీజేపీ తరఫున పోటీ చేయాలని సూచించారు  | Former IAS Jiji Thomson alleges CEC Gyanesh Kumar urged him to run as a BJP | Sakshi
Sakshi News home page

నన్ను బీజేపీ తరఫున పోటీ చేయాలని సూచించారు 

Sep 27 2026 5:54 AM | Updated on Sep 27 2026 5:54 AM

Former IAS Jiji Thomson alleges CEC Gyanesh Kumar urged him to run as a BJP

జ్ఞానేశ్‌కుమార్‌ సలహాను బయటపెట్టిన నాటి ఐఏఎస్‌ థామ్సన్‌

న్యూఢిల్లీ: ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2016లో ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులుగా కొనసాగుతున్న కాలంలో థామ్సన్, జ్ఞానేశ్‌ ఢిల్లీకి ఒక విమానంలో వెళ్లేటప్పుడు జరిగిన సంభాషణను థామ్సన్‌ గుర్తుచేసుకున్నారు. ‘‘ఐఏఎస్‌గా రిటైర్‌ అయ్యాక ఏం చేస్తావని జ్ఞానేశ్‌ అడిగారు. 

చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తా అని చెప్పా. అలా చేయొద్దు. మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. కేరళలోని పత్తనంథిట్ట నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీచెయ్యి. గెలిస్తే మంత్రి కూడా అయిపోవచ్చు’’అని ఆయన సూచించారని థామ్సన్‌ తెలిపారు. తనకు రాజకీయాలు అంటే ఇష్టంలేదు అని ఆనాడే ఆయనకు చెప్పేశానని గుర్తుచేసుకున్నారు. ‘‘నేనైతే రిటైర్‌ అయ్యాక ఎంపీగా పోటీచేస్తా. 

గెలిస్తే కేంద్ర మంత్రిని అవుతా’’అని జ్ఞానేశ్‌ తనతో చెప్పారని థామ్సన్‌ వెల్లడించారు. థామ్సన్‌ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. థామ్సన్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ స్పందించారు. ‘‘ఈ లెక్కన ఆనాడు ఐఏఎస్‌గా ఉన్న జ్ఞానేశ్‌ను బీజేపీ తమ తదుపరి ఎన్నికల అభ్యర్థుల రిక్రూట్‌ ప్రక్రియ కోసం ఉపయోగించుకుంది. అందుకు తమకు సాయపడిన జ్ఞానేశ్‌ను ఇప్పుడు సీఈసీ పదవిలో షా, మోదీ ద్వయం కూర్చోబెట్టారు. అలా భారత్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా మార్చేశారు’’అని ఆరోపించారు. థామ్సన్‌ 2024 జనవరిలో రిటైర్‌ అయ్యారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement