కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇన్ని స్థానాల్లో పోటీ? | Congress Wants 150 Seats In UP Samajwadi Party Says Top Leaders Will Decide | Sakshi
Sakshi News home page

కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇన్ని స్థానాల్లో పోటీ?

Sep 27 2026 5:02 AM | Updated on Sep 27 2026 5:06 AM

 Congress Wants 150 Seats In UP Samajwadi Party Says Top Leaders Will Decide

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య వచ్చే నెలలో చర్చలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్‌ 403 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలను కోరాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తుది సీట్ల పంపకంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్‌ మూడు విభాగాలుగా విభజించినట్లు సమాచారం. వీటిలో 150 స్థానాలను తొలి ప్రాధాన్య విభాగంలో చేర్చింది. పొత్తు చర్చల్లో ఈ స్థానాలను కోరనుంది. అయితే తుది ఒప్పందంలో తమకు దక్కే స్థానాల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండకూడదని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త 
పొత్తు ఖరారైన తర్వాత అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్టీ బలాబలాలు, అభ్యర్థుల అవకాశాలను గుర్తించే ప్రక్రియను కాంగ్రెస్‌ చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది. దళితులు, బ్రాహ్మణులతో పాటు అత్యంత వెనుకబడిన వర్గాల్లో మద్దతు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీకి ఈ ప్రయత్నాల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు అఖిలేశ్‌ యాదవ్‌ ఇటీవల రాయ్‌బరేలీ నుంచి ‘పీడీఏ రథయాత్ర’ ప్రారంభించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న ఈ యాత్రను రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని అఖిలేశ్‌ స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ 37, కాంగ్రెస్‌ 6 స్థానాలు గెలుచుకున్నాయి. రెండు పార్టీలు కలిసి 43 స్థానాలు సాధించాయి. 2019లో ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు ఒక స్థానం మాత్రమే దక్కింది.  2027 ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే సీట్ల సర్దుబాటు చర్చల్లో కాంగ్రెస్‌ 150 స్థానాల డిమాండ్‌, తుది పొత్తు పరిమితులు కీలకంగా మారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement