ముంబై: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఓ వృద్ధాశ్రమంలో నిద్రిస్తున్న వారిపై దాడి జరిగింది. ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఆశ్రమ భద్రతా సిబ్బందిలో ఒకరు ఉన్నారు. అదే ఆశ్రమంలో ఉంటున్న వ్యక్తే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అహిల్యానగర్ ఎస్పీ ఎం.సుదర్శన్ వెల్లడించారు.
విహాడ్ సమీపంలోని వృద్ధాశ్రమంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. ఆశ్రమంలోని ఇతరులతో నిందితుడికి తరచూ విభేదాలు తలెత్తేవి. భోజనం చేసేటప్పుడు ఆహారం కింద పడేయడంపై కొందరు ఆశ్రమవాసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, అతడి ప్రవర్తనపై సూచనలు చేసినట్లు తెలిపారు. దీంతో వారిపై నిందితుడు అసంతృప్తితో ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు అనుమానిస్తున్నారు.
శనివారం ఉదయం ఆశ్రమవాసులు నిద్రిస్తున్న సమయంలో.. నడిచేందుకు ఉపయోగించే కర్రలోని పదునైన లోహ భాగంతో వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకునేందుకు లేదా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడి చేసినట్లు పేర్కొన్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురిని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దాడిని ప్రత్యక్షంగా చూసిన ఆశ్రమంలోని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ప్రాంగణంలోని సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. “నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఇతర ఆశ్రమవాసులతో జరిగిన పరస్పర చర్యలపై అతడు అసంతృప్తిగా ఉన్నట్లు, తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని భావించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది” అని తెలిపారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు.


