బెంగళూరు: ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ ఆధారిత కెమెరా ఓ గిటార్‌ను ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తిగా పొరబడింది. దీంతో హెల్మెట్ ధరించకుండా వెనుక వ్యక్తిని తీసుకెళ్లారంటూ వాహన యజమానికి జరిమానా విధించింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆటోమేటెడ్ ట్రాఫిక్ నిఘా వ్యవస్థలపై చర్చకు దారితీసింది.
సౌవిక్ దత్తా తన భార్యకు చెందిన స్కూటర్‌పై హెబ్బాల్ నుంచి టిన్ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్నారు. ఆయన వీపుకు గిటార్ కేసును తగిలించుకున్నారు. ఈ దృశ్యాన్ని ట్రాఫిక్ కెమెరా తప్పుగా అర్థం చేసుకుని, గిటార్ కేసును వెనుక కూర్చున్న వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ జరిమానా విధించింది. కెమెరా తీసిన ఫొటోతో కూడిన జరిమానా నోటీసు స్కూటర్ యజమాని అయిన ఆయన భార్యకు చేరింది.
దీనిపై దత్తా బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఫిర్యాదు చేశారు. ‘‘నేను బెంగళూరులో నా గిటార్‌ను వీపుపై తగిలించుకుని నా భార్యకు చెందిన ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్నాను. నా భార్యకు ‘వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదు’ అంటూ ట్రాఫిక్ జరిమానా వచ్చింది. నోటీసు నంబర్ 86202541. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘన గుర్తింపు ఇదేనా? దయచేసి జరిమానాను రద్దు చేయండి’’ అని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ఉల్లంఘనను సరిచేసేందుకు ట్రాఫిక్ ఆటోమేషన్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనతో ఏఐ ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థల కచ్చితత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. కొంతమంది వాహనదారులు సామాజిక మాధ్యమాల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. సిగ్నల్ దాటేటప్పుడు, గ్రీన్ సిగ్నల్ ఉన్న ఇతర వాహనాలకు దారి ఇచ్చేందుకు జీబ్రా క్రాసింగ్‌ను కొద్దిగా దాటినా సిగ్నల్ ఉల్లంఘనగా కెమెరాలు గుర్తిస్తున్నాయని కొందరు ఆరోపించారు.
ట్రాఫిక్ పోలీసు స్పందన
ఈ ఘటనపై ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి స్పందిస్తూ.. ఏఐ వ్యవస్థ పొరపాటుతో ఇది ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనగా నమోదైందని తెలిపారు. ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతాయని, కొన్నిసార్లు స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చున్న చిన్నారిని కూడా హెల్మెట్ లేని వెనుక ప్రయాణికుడిగా వ్యవస్థ గుర్తిస్తుందని చెప్పారు. ఇలాంటి జరిమానాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటిని పరిశీలించి సరిచేస్తామని తెలిపారు.
‘‘నిరంతరం ఎక్కువ మొత్తంలో సమాచారం అందించడంతో ఏఐ వ్యవస్థ మరింత మెరుగవుతుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. ఇలాంటి తప్పుడు గుర్తింపులను పరిశీలించి సరిచేసేందుకు మా వద్ద ఇప్పటికే ప్రత్యేక బృందం ఉంది. ఇది కూడా అలాంటి పొరపాటే కావచ్చు. మేము దాన్ని సరిచేస్తాం’’ అని అధికారి తెలిపారు. ఏఐ ఆధారిత వ్యవస్థ ఇంకా 100 శాతం కచ్చితత్వాన్ని సాధించలేదని ఆయన అంగీకరించారు.


