నాగ్‌పుర్: నాగ్‌పుర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని బోర్‌ఖేడి స్టేషన్ దాటిన తర్వాత రైలు కిటికీపై బయట నుంచి రాయి బలంగా తగలడంతో మూడు బోగీల కిటికీ అద్దాలు పగుళ్లకు గురయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ప్రయాణికులు కిటికీకి అతి సమీపంలో కూర్చున్న సమయంలో రాయి తగలడంతో అద్దం ముక్కలు లోపలికి ఎగిరిపడ్డాయి. అయితే ఎవరూ గాయపడలేదు. నాగ్‌పుర్ నుంచి ముంబై వెళ్తున్న ప్రయాణికులు రైలులో భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిటికీ అద్దం పగిలిపోయిందని వీడియోలో ఒక ప్రయాణికుడు చెప్పడం వినిపించింది. రాయి తగిలిన ఘటనలో ఏ-1, బీ-2, బీ-5 బోగీల కిటికీ అద్దాలు దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి 8.46 గంటలకు సమాచారం అందడంతో బోర్‌ఖేడి-సింధి మార్గంలో 803 నుంచి 796 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. బోర్‌ఖేడి, బ్రాహ్మణి గ్రామాల పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. స్థానిక పోలీసు పాటిల్, గ్రామస్థులను విచారించినప్పటికీ అనుమానాస్పద వ్యక్తి లేదా ఘటనకు సంబంధించిన స్పష్టమైన ఆధారం లభించలేదు.
రైలు ఎస్కార్ట్ సిబ్బంది, ప్రయాణికుల సమాచారం ప్రకారం.. రాత్రి 8.27 గంటల సమయంలో బయట నుంచి వచ్చిన రాయి రైలు కిటికీలను తాకింది. అయితే దాన్ని ఎక్కడి నుంచి విసిరారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై గుర్తుతెలియని వ్యక్తిపై సెప్టెంబర్ 26న తెల్లవారుజామున 2.55 గంటలకు కేసు నమోదు చేశారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద క్రైమ్ నంబర్ 325/2026గా కేసు నమోదైంది. రాయి విసిరిన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. రైలు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
A stone smashed into an AC coach of the Nagpur–Mumbai Duronto Express like a bullet, injuring 4 passengers. Are we really safe while travelling by train? @RailwaySeva @Central_Railway, passangers safety cannot be taken for granted. https://t.co/vEVJVfh11F
— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) September 26, 2026


