‘ఫారం–6’లో మార్పులను సుప్రీంకోర్టు సమర్థించింది
నోటీసులు అందుకున్న వారు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు
అవసరమైతే ఓటర్ల తరఫున కుటుంబ సభ్యులు హాజరు కావొచ్చు
పత్రాల కోసం బీఎల్‌ఓలు ఓటర్ల ఇళ్లను సందర్శిస్తారు
ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు
కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ
సీఈసీ, ఎన్నికల కమిషనర్ల సమావేశం
తాజా పరిణామాలపై చర్చ!
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనడంతోపాటు ఎన్నికల సంఘం సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లువార్తలు వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం కీలక ప్రకటన చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఇద్దరు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే ‘సర్’కు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో భేదాభిప్రాయాలేవీ లేవని పేర్కొంది. అలాగే ఓటర్ల నమోదుకు సంబంధించిన ‘ఫారం–6’లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు సమర్థించినట్లు స్పష్టంచేసింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలతో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ 10 నెలల్లో 14 సార్లు విభేదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ కేంద్ర కేబినెట్ సెక్రెటరీకి వేర్వేరుగా పంపిన లేఖలు డిప్యూటేషన్‌పై ఉన్న ఒక అధికారికి సంబంధించినవని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ లేఖలు విధానపరమైన లేదా ఐటీ విభాగానికి సంబంధించినవి కావని వివరణ ఇచ్చింది. సంస్థాగత చర్చల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడం సాధారణమేని తెలియజేసింది. తమ ఆదేశాలకు పూర్తిగా చట్టపరమైన ఆమోదం ఉందని తేల్చిచెప్పింది.
ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందే
ఎలక్షన్ కమిషన్‌లో పనిచేసే అధికారులు కమిషనర్ల నుంచి వచ్చే అన్ని ఆదేశాలనూ కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. అధికారుల విదేశీ పర్యటనల కోసం కమిషన్ అనుమతి తీసుకోవాలని తెలిపింది. శనివారం ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. సీఈసీ, ఇద్దరు కమిషనర్లు హాజరయ్యారు. తాజా పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. అనంతరం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.
అన్ని సమావేశాలకు ఎజెండాను ముందుగానే విడుదల చేయడం, మినిట్స్ జారీ చేయడం, అధికారులందరి వార్షిక పనితీరు మదింపు నివేదికలను నిర్దేశిత కాలపరిమితిలోగా, అంటే ప్రతి ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఐటీ విభాగంపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణను ఎప్పుడూ ఉపసంహరించుకోలేదని పేర్కొంది. ఇకపై ఐటీ మాడ్యూల్స్, పోర్టల్స్‌కు సంబంధించిన అన్ని కొత్త కార్యక్రమాలపై కమిషన్ ఆమోదానికి ముందే కమిటీ ఆఫ్ ఆఫీసర్స్‌లో చర్చ జరుగుతుందని తెలియజేసింది.
తుది జాబితా ప్రచురణ తర్వాతే...
ఇటీవలి కాలంలో ‘సర్’ప్రక్రియతో సహా అనేక నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది. 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా 2025 జూన్ 24న జారీ చేసిన ఈ ‘సర్’ఉత్తర్వు ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతో వెలువడినట్లు తేల్చిచెప్పింది. 2026 మే 27న సుప్రీంకోర్టు దీనిని సమర్థించినట్లు పేర్కొంది.
ఎన్నికల సంఘం ఏకగ్రీవ ఆమోదంతో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ‘సర్’òÙడ్యూల్ 2025 అక్టోబర్ 27న, అలాగే 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన షెడ్యూల్ 2026 మే 14న జారీ చేసినట్లు వెల్లడించింది. మూడో దశలోని మిగిలిన 12 రాష్ట్రాల్లో తుది జాబితా ప్రచురణ తర్వాతే ఓటర్ల సంఖ్యకు సంబంధించిన తుది గణాంకాలు తెలుస్తాయని ఉద్ఘాటించింది. ‘సర్’కోసం ఫారం–6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమరి్థంచినట్లు గుర్తుచేసింది.
ఓటర్ల జాబితా ‘నిరంతర అప్‌డేషన్’
20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో పేరు లేనివారు, యువతీ యువకులు లేదా మొదటిసారి ఓటు వేసేవారితో సహా ఎవరైనా సరే ‘నిరంతర అప్‌డేషన్’ప్రక్రియ ద్వారా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడానికి సంబంధిత ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఈఓలను ఆదేశించింది. ఓటర్ల నమోదు కోసం సీఈఓలు, డీఈఓలు, ఈఆర్‌ఓలు తక్షణమే ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తారని ప్రకటించింది.
‘సర్’కు సంబంధించి నోటీసులు అందుకున్నవారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనునున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల ఫిర్యాదులను పరిష్కరిస్తామని పేర్కొంది. రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారుల నుంచి అందిన సూచనల ఆధారంగా ఈసీఐ పోర్టల్‌లో ఇప్పటికే పలు మార్పులు చేసినట్లు తెలియజేసింది. ‘సర్’ప్రక్రియ విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు అదనంగా ఏవైనా సౌకర్యాలు అవసరమైతే, వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ‘సర్’నోటీసులు అందుకున్న ఓటర్ల సౌలభ్యం కోసం ఢిల్లీ, మహారాష్ట్రలో గడువు తేదీలను పొడిగించడం, వారి ఇళ్ల వద్దకే వెళ్లి పత్రాలను సేకరించడం వంటి నిర్ణయాలను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటర్ల ఇంటికే బీఎల్‌ఓలు
‘సర్’ కింద నోటీసులు అందుకున్న వారు అసాధారణ సందర్భాల్లో తప్ప వ్యక్తిగత ంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం సూచించింది. మ్యాపింగ్ లేకపోవడం లేదా తార్కిక వ్యత్యాసాల కారణంగా నోటీసు అందుకున్న వ్యక్తుల విషయంలో సంబంధిత పత్రాలను సేకరించడానికి బీఎల్‌ఓలు వారి ఇళ్లను సందర్శిస్తారని, తర్వాత ఈఆర్‌ఓల నిర్ణయం కోసం ఆ పత్రాలను ఈసీఐనెట్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపింది.
నోటీసు అందుకున్న అటువంటి వ్యక్తులను విచారణ కోసం ఈఆర్‌ఓ/ఏఈఆర్‌ఓ కార్యాలయానికి పిలవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే, ఈఆర్‌ఓ నిర్ణయం మేరకు విచారణను వీలైనంత వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని వెల్లడించింది. అవసరమైతే ఓటరు తరపున విచారణకు హాజరయ్యేందుకు కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడికైనా అధికారం ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం సూచించింది. కూలీలు, పేదలు, నిరాశ్రయుల కోసం ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులపై ఉందని పేర్కొంది.


