మాధవ్ శింగరాజు
టీ కప్పులోని తుఫాన్‌ను తీరం దాటించేందుకు ‘కశ్మీర్ కావా’ టీ అమోఘంగా పని చేస్తుంది. ఆ సువాసన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అది తుఫాను ముందరి ప్రశాంతత కాదు, తుఫాను తర్వాతి ప్రశాంతతా కాదు. సరిగ్గా తుఫాను మధ్యలోని ప్రశాంతత. ‘కశ్మీర్ కావా’ మహత్తును నేను 2019లో ఆర్టికల్ 370 రద్దుకు నార్త్ బ్లాక్‌లో నా టీమ్‌తో కలిసి సుదీర్ఘమైన లీగల్ డ్రాఫ్టింగ్ చేస్తున్న సమయంలో కనిపెట్టాను! ‘‘ప్రతి పదాన్నీ చెక్ చేయండి. ఇది చట్టం మాత్రమే కాదు, కాబోయే చరిత్ర కూడా...’’ అని నేను హెచ్చరించిన ప్రతిసారీ డ్రాఫ్టింగ్ పనిలో ఉన్న అధికారులలో తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగి, ‘కశ్మీర్ కావా’ అవసరం అయ్యేది. ఒక కప్పు కశ్మీర్ కావా టీ తాగి, మళ్లీ తుఫాను మధ్యలో ప్రశాంతంగా కూర్చొనేవారు!
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి 2020 జనవరిలో నార్త్ బ్లాక్‌లోనే ప్రత్యేకంగా ఏర్పాటైన ‘అయోధ్య డెస్క్’కు నేను చీఫ్‌గా ఉన్నప్పుడు కూడా నా టీమ్‌కు అనేక కప్పుల ‘కశ్మీర్ కావా’ అక్కరకొచ్చింది.
అంతగా ఏముంటుంది ‘కావా’ టీ లో?! రెండు కప్పుల నీళ్లుండేవి. ఇప్పుడైతే ‘నిర్వాచన్ సదన్’లో నాతో పాటు, మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఉంటారు కనుక మా ముగ్గురికీ మూడు కప్పుల నీళ్లు పడతాయి.మూడు కప్పుల నీళ్లకు 1.5 టీస్పూన్‌ల కశ్మీరీ గ్రీన్ టీ ఆకులు, 10–12 రేకుల కుంకుమ పువ్వు, 1 పెద్ద ముక్క, లేదా 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క, తేలిగ్గా దంచిన 3 యాలకులు, 6–7 సన్నగా తరిగిన బాదం పప్పులు, కప్పుకు ఒక స్పూన్ చొప్పున తేనె లేదా చక్కెర. నీటిని మరిగించటం, కుంకుమ పువ్వు కలపటం, గ్రీన్ టీ ఆకులు వేసి 2 నుండి 3 నిముషాల పాటు అలాగే వదిలేయటం, వడకట్టటం, చివరిగా కలపటం, వెచ్చగా ఒక సిప్ వేయటం. అంతే! ఒత్తిడి, అలసట టీ కప్పు పొగలతో కలిసిపోయి, పైలోకాలకు చేరేవి.
గత 10 నెలల్లో 14 సార్లు నేనే స్వయంగా ‘కశ్మీరీ కావా గ్రీన్ టీ’ని కాచి, సుఖ్‌బీర్ సింగ్ సంధుకూ, వివేక్ జోషీకీ నా స్వహస్తాలతో అందించాను. ‘టీ’ని ట్రేతో అందించటంలో పద్ధతి ఉంటుంది. కానీ టీ కప్పుని నేరుగా టీమ్‌మేట్స్ చేతికి ఇవ్వటంలో... పద్ధతితో పనిలేని టీమ్ స్పిరిట్ ఉంటుంది. ‘‘... కానీ సంధూ, జోషీ ఆ స్పిరిట్‌ని కోరుకోలేదు. పైగా ఆ 14 సార్లూ ఆ 14 కప్పుల టీమ్ స్పిరిట్‌ని తిరస్కరిస్తూనే వచ్చారు’ అని హఠాత్తుగా సెప్టెంబర్ 23 తెల్లారే, మీడియాలో పెను తుఫాను!! ‘సర్’ జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులలో సంధూ–జోషీలకు; నాకు మధ్య 10 నెలల్లో 14 సార్లు భేదాభిప్రాయాలు వచ్చాయన్నది ఆ తుఫాను కథనం!
ఉన్న ముగ్గురు ఎలక్షన్ కమిషనర్‌లలో ఇద్దరు కమిషనర్‌ల అంగీకారం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలి... జ్ఞానేశ్‌ను ఇంపీచ్ చేయాలి... జ్ఞానేశ్‌ను అరెస్ట్ చేయాలి... జ్ఞానేశ్‌కు శిక్ష విధించాలి... అని రెండు రోజులుగా దట్టంగా సైక్లోన్ మబ్బులు! ‘‘ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్లను తొలగించ టానికే పని చేస్తుంది కానీ ఓట్లను తొలగించ టానికి కాదు’’ అని నేనిప్పుడు వాదించి, వివరణ ఇచ్చి చేయగలిగిందీ లేదు, చేయవలసిందీ లేదు.
నాపై ఆరోపణలకు, విమర్శలకు కారణమైన నా నిర్ణయాలే... ఆ ఆరోపణలకు, విమర్శలకు సమాధానాలు కూడా. మాట్లాడేందుకేం లేదు. వెళ్లేందుకు మాత్రం మైళ్లకు మైళ్లు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌లలో కూడా ‘సర్’ పూర్తయ్యే వరకూ... మైల్స్ టు గో అండ్ స్టార్మ్‌స్ టు కమ్. ఎన్ని తుఫాన్లు వస్తే ఏంటి? గుప్పెడు టీ ఆకులు, కుంకుమ రేకులు, దాల్చిన చెక్క, దంచిన యాలకులు... తెరిపిన పడేయవా?!


