క్యూబాలో భారత ప్రతినిధి బృందం (ఇన్‌సెట్: క్యూబా ప్రధాని మాన్యువెల్ మెరేరో క్రూజ్‌తో)
పర్యటన
క్యూబాకు వెళ్లడం నాకు కేవలం ఒక విదేశీ పర్యటన కాదు– అది ఒక రాజకీయ అధ్యయన యాత్ర. ఫిడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ చర్చల్లో పాల్గొనడానికి, క్యూబా ప్రజల జీవనాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి లభించిన అరుదైన అవకాశం. దశాబ్దాలుగా కొనసాగుతున్న సామ్రాజ్యవాద దిగ్బంధనం మధ్య కూడా ఒక చిన్న దేశం తన సార్వభౌమత్వాన్నీ, సోషలిస్టు వ్యవస్థనూ ఎలా కాపాడుకుంటుందో తెలుసుకోవడమే ఈ ప్రయాణ ముఖ్యోద్దేశం. 2026 ఆగస్టు 10 నుండి 13 వరకు హవానాలో జరిగిన ‘ఫిడెల్ లెగసీ అండ్ ఫ్యూచర్’ అంతర్జాతీయ కొలోక్వియంలో, ఏడుగురు సభ్యుల భారత ప్రతినిధి బృందంలో భాగస్వామిగా నేనూ పాల్గొ న్నాను. ఈ కొలోక్వియంలో జరిగిన విస్తృత చర్చలతో పాటు, ఫిడెల్ కాస్ట్రో రుజ్ సెంటర్, విప్లవ చరిత్రతో ముడిపడిన చారిత్రక ప్రదేశాలు, చే గువేరా జ్ఞాపకాలు, మ్యూజియాలు, ఆసుపత్రులు, హవానా పాత నగరం తదితర ప్రాంతాలను సందర్శించాం. వీటి ద్వారా క్యూబాను దాని చరిత్ర, విప్లవం, సోషలిజం, ప్రజల జీవన విధానం వంటి వివిధ కోణాల్లో కొంతన్నా అర్థం చేసుకునే అవకాశం మాకు దక్కింది.
ఆ నేలపై అడుగిడిన వేళ...
ఫిడెల్, చే, గ్రాన్మా, మోంకాడా, సియెర్రా మాస్ట్రా... ఇంతకాలం పుస్తకాల్లో చదివిన ఈ చారిత్రక పేర్లన్నీ మేము నిలబడిన ఆ నేలపై సజీవంగా కనిపించాయి. హవానాలో అడుగుపెట్టగానే మాకు కనిపించింది కేవలం పుస్తకాల్లోని విప్లవం గానీ, పర్యాటక క్యూబా అందాలు గానీ కాదు. అక్కడ మాకు స్వాగతం పలికిన వాస్తవాలు: తీవ్రమైన విద్యుత్ కోతలు, తాగునీటి కొరత, ఇంధన సంక్షోభం, చీకట్లో మునిగిన నగర వీధులు. ఒకప్పుడు ఉచిత విద్య, సార్వత్రిక వైద్యం, శాస్త్ర–సాంకేతిక రంగాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన క్యూబా నేడు ఇంతటి ఇంధన, ఔషధాల కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?
కొలోక్వియం ప్రారంభ ఉపన్యాసంలో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్–కానెల్ కూడా దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ తీవ్రతను దాచకుండా వివరించారు. థర్మల్ విద్యుత్ సామర్థ్యంలో సుమారు 1,400 మెగావాట్లను పునరుద్ధరించినప్పటికీ, తీవ్రమైన ఇంధన కొరత కారణంగా విద్యుత్ కోతలు తప్పడం లేదని తెలిపారు. వైద్య రంగంలో ఉన్న పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రాథమిక మందులలో కేవలం 30 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు. దేశ అధ్యక్షుడు స్వయంగా ఈ ఇంధన, ఆరోగ్య సంక్షోభాలను ప్రజల ముందు ఉంచి, లోపాలను అంగీకరించారు. సంక్షోభాలను ధైర్యంగా అంగీకరించి, దానిపై పోరాడటం క్యూబా నైజం. విజయాలను అభినందిస్తూ, లోపాలను సమీక్షించుకుంటూ, సంక్షోభ కారణాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ... క్యూబాను క్యూబాగానే అర్థం చేసుకోవాలి అని దేశాధ్యక్షుడే స్వయంగా చెప్పారు.
విప్లవం–అమెరికాతో వైరం
దాదాపు 380 ఏళ్లు స్పానిష్ వలస పాలనలో క్యూబా ప్రజల శ్రమను, సహజ వనరులను నిలువునా పిండి పిప్పి చేశారు. వలస పాలన అంతమైనా స్వేచ్ఛ మాత్రం లభించలేదు. 1953 జూలై 26న మోంకాడా బ్యారక్స్‌పై విప్లవ సింహాలు విరుచుకుపడ్డాయి. 1956లో ‘గ్రాన్మా’ పడవలో 82 మంది విప్లవకారులు మృత్యువుతో చెలగాట మాడుతూ బయలుదేరారు. సియెర్రా మాస్ట్రా పర్వతాలను అడ్డాగా చేసుకుని ప్రజలకు చేరువయ్యారు. గెరిల్లా పోరాటంతో అమెరికా అనుకూల బాటిస్టా మూలాలను కదిలించారు. 1959 జనవరి 1న బాటిస్టా పారిపోవడంతో, క్యూబా నేలపై విప్లవ విజయ పతాక ఎగిరింది! 1961 ‘బే ఆఫ్ పిగ్స్’ దాడిలో అమెరికా పంపిన అద్దె సైనికులను క్యూబా ప్రజలు మట్టికరిపించారు. అమెరికా రాక్షస ఆర్థిక దిగ్బంధనం, దుర్మార్గమైన ఆంక్షలను ధీటుగా ఎదుర్కొంటూ, 1959 విప్లవం తర్వాత క్యూబా ప్రపంచా నికే ఆదర్శవంతమైన విజయాలను సాధించింది. 100% అక్షరాస్యత సాధించి, విద్యను ఉచితంగా ప్రతి ఇంటా నింపింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉచిత వైద్య వ్యవస్థను నిర్మించింది. 1963 అల్జీరియా మిషన్ మొదలుకొని 2005లో స్థాపించిన ‘హెన్రీ రీవ్’ అత్యవసర వైద్య బృందం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలు అందించింది. నేడు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా, విదేశీ విద్యార్థులకు తమ మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్య విద్యనందిస్తూ అంతర్జా తీయ మానవత్వానికి మహోన్నత ప్రతీకగా నిలిచింది.
ఆర్థిక సంక్షోభంలోకి...
అయితే 1991లో సోవియట్ యూనియన్ పతనం క్యూబాను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. క్యూబాను పస్తులు ఉంచిచంపాలని అమెరికా రాక్షస ఆర్థిక దిగ్బంధనాన్ని బిగించింది. ఉన్నదానితోనే బతకడం, ఉన్న కొద్దిపాటి వనరులను అందరూ సమానంగా పంచుకోవడం క్యూబా సంస్కృతి అయింది. నాయ కులు సైతం ప్రజలతో పాటు క్యూలలో నిలబడ్డారు. స్వయంగా పొలంపనుల్లో పాల్గొని కష్టాలను పంచుకున్నారు. ఎంతటి కరువు వచ్చినా విద్య, వైద్యం, సామాజిక రక్షణ అనే విప్లవ సాధనాలను విడిచిపెట్టలేదు. హవానాలోని గ్రాన్మా విప్లవ మ్యూజియంలో అడుగు పెట్టి నప్పుడు చరిత్ర కళ్లముందు సాక్షాత్కరించినట్లనిపించింది. ఫిడెల్ కాస్ట్రో రుజ్ సెంటర్‌లో ప్రతి ఘట్టం ఫిడెల్ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక విప్లవకారుడి బాధ్యతను గుర్తుచేస్తుంది. చిన్న వయస్సు నుంచే తమ దేశ చరిత్రను, విప్లవ వీరుల త్యాగాలను తెలుసుకునేలా చేయడం అక్కడి సామాజిక జీవితంలో భాగంగా కనిపిస్తుంది. చే గువేరా జ్ఞాపకాలను చూడటం మరొక ప్రత్యేక అనుభవం. గొప్ప నాయకుల గొప్పతనం వారి మాటల్లో మాత్రమే కాదు... వారి నిరాడంబర జీవితం, ప్రజల కోసం చేసిన త్యాగాల్లో ఉంటుంది.
శాంటా క్లారాలో చే గువేరా భారీ విగ్రహం, ఆయన పోరాటం, త్యాగం వంటివాటిని గుర్తుచేసే ప్రతి చిహ్నం నేటి తరానికి ఒక ప్రశ్న వేస్తున్నట్టుగా ఉంటుంది: ‘వారు తమ కాలంలో ఇంతటి త్యాగాలు చేశారు. మరి మన కాలంలో మన కర్తవ్యం ఏమిటి?’ క్యూబా పర్యటనలో మేము క్యాన్సర్, కార్డియాలజీ విభాగా లను సందర్శించాము. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది చిరునవ్వుతో చిన్నారులకు చికిత్స అందించడం చూశాం. హవానాలోని ‘ఓపెన్ ఫ్యునరల్ మ్యూజియం’లో మత విశ్వాసాలు కలిగినవారి అంతిమ జ్ఞాపకాలను కూడా ఎంతో గౌరవంగా కాపాడుతున్న తీరు మమ్మల్ని ఆలోచింపజేసింది. మతం ఉన్నా లేకపోయినా మనిషిని మనిషిగా గౌరవించడం, సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడమే క్యూబా నేర్పిన పాఠం. విప్లవం అంటే కేవలం అధికార మార్పు కాదు– మనిషి గౌరవాన్ని కాపాడటం, సమానత్వాన్ని నిర్మించడం, ప్రజల కష్టాలను మన కష్టాలుగా భావించడం, అలాగే సామ్రాజ్యవాదానికి తలవంచకుండా నిలబడటం. క్యూబా ప్రజలకు విప్లవ జేజేలు!
బి. వెంకట్
వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం
ప్రధాన కార్యదర్శి


