విశ్లేషణ
రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి నీరో ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతుంది. వాతావరణ సంక్షోభం ప్రాణా లను, ఆస్తులను హరిస్తూ, జీవి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ కాలంలో, మనకూ చాలామంది ఆధునిక నీరోలు కనిపిస్తున్నారు. 2021 నవంబర్‌లో గ్లాస్గో (స్కాట్ లాండ్)లో జరిగిన కాప్26 సదస్సు చాలా ఆశలు రేకెత్తించింది. ఆ సదస్సు నుంచి బయటకు వచ్చిన ప్రముఖ మాట ‘నెట్ జీరో’. చాలామంది నెట్ జీరో అంటే సున్నా అనుకుంటారు. కానీ కాదు. నెట్ జీరో అనేది చాలా విషయాలను దాచిపెట్టే, గందరగోళపరిచే లక్ష్యం.
లక్ష్యం కాదు, ఒక సమీకరణం
నెట్ జీరో అనేది యథాతథ స్థితిని కొనసాగించే లక్ష్యం. పైకి మాత్రం పెద్ద ముందడుగులా కనిపిస్తుంది. దీని నిర్వచనం ప్రకారం, వాతావరణంలోకి వెళ్ళే గ్రీన్ హౌస్ వాయువులకు, వాటిని ‘తొలగించే’ ప్రక్రియకు మధ్య సమతుల్యత సాధించడమే నెట్ జీరో. అంటే ఉద్గారాలు కొనసాగుతూనే ఉంటాయి, దృష్టి మాత్రం తొలగింపుపై పెడతారు. పది రెట్లు వెలువడితే, అంతే తొలగించాలన్నది వాగ్దానం. కానీ ఆ తొలగింపు సాంకేతికత ఇంకా పెద్ద స్థాయిలో రుజువు కాలేదు. ఇది వర్తమానంలో ఉద్గారాలు విడుదల చేసేవారి మీద ఒత్తిడిని తగ్గించి, ప్రపంచాన్ని ఒక తప్పుడు నిశ్చింతలో పడే స్తుంది. ఉద్గారాలకు అత్యధిక బాధ్యులైన ప్రభుత్వాలు, కార్పొరేట్లే దీన్ని ప్రచారం చేయడం సమస్య తీవ్రతను గుర్తించడంలో వైఫ ల్యాన్ని సూచిస్తుంది. పైగా అన్ని ఉద్గారాలు కార్బన్ మాత్రమే కాదు. చాలా విష వాయువులు మరింత ప్రమాదకరమైనవి. కానీ నెట్ జీరో చట్రం కార్బన్ కే పరిమితం; గాలి, నీరు, నేలలను దెబ్బతీసే వేలాది ఇతర ఉద్గారాలు దీని లెక్కల్లోకి రావు. కార్బన్ క్యాప్చర్, కార్బన్ ట్రేడింగ్‌లనే ప్రధాన సాధనాలుగా ఆధారపడటం వల్ల, ‘కాలుష్యం కలిగించినవాడే మూల్యం చెల్లించాలి’ అనే సూత్రాన్ని నెట్ జీరో కప్పిపెడుతుంది. పర్యావరణ కాలుష్య నేరస్థులు మూల్యం చెల్లిస్తారు గానీ, స్థానిక బాధితులకు కాదు, కాగితాలపై మరెక్కడో. అంతర్జాతీయ చట్టపరమైన కట్టడి లేకపోవడం వల్ల, కార్బన్ ట్రేడింగ్, కార్బన్ క్యాప్చర్ మోసాలుగా మారుతున్నాయని విమర్శలు పెరుగుతున్నాయి.
గ్లాస్గో నుంచి గుంటూరు దాకా...
అంతర్జాతీయ వాతావరణ దౌత్యంలోనే నెట్ జీరో ఇంత అస్పష్టంగా ఉంటే, భారత రాష్ట్ర ప్రభుత్వాల స్థాయికి వచ్చేసరికి ఇది ఒక లెక్కల చట్రంగా కాక, ఫ్యాషన్ ప్రకటనగా మారింది. కార్బన్ ట్రేడింగ్ లేకుండా సూత్రప్రాయంగా నెట్ జీరో నిలబడలేదు. ‘తొల గింపు’ అనేది క్రెడిట్లు, రిజిస్ట్రీలు, ధ్రువీకరణ వ్యవస్థల ద్వారానే రుజువవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థాయిలో ఈ సంబంధమే పూర్తిగా కనిపించదు. గ్రామాలు, కాలేజీలు, వ్యర్థాల ప్రాజెక్టులు, ఒక పూర్తి కొత్త నగరం కూడా ఎలాంటి క్రెడిట్, రిజిస్ట్రీ, ధ్రువీకరణ ప్రస్తావన లేకుండానే ‘నెట్ జీరో’గా ప్రకటించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ‘నెట్ జీరో’ను ప్రస్తావించారు. కుప్పం నియోజకవర్గంలోని నలగాంపల్లె గ్రామాన్ని రాష్ట్రానికే ‘నెట్ జీరో మోడల్’గా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలను ఇందులో చేర్చారు. ఆంధ్రా యూనివర్సిటీని ‘నమూనా నెట్ జీరో క్యాంపస్’గా మార్చాలని పిలుపునిచ్చారు– ప్రతి సందర్భంలోనూ బేస్‌లైన్, హద్దు, పర్యవేక్షణ విధానం ఏదీ ప్రకటించకుండానే.
తెలంగాణలో ఇదే పోకడ ఒక అధికారిక ఉత్తర్వులో నమోదైంది. మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్టీ నెంబర్ 641 (02–07–2026), రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల భూమిని ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం కోసం జీహెచ్‌ఎంసీకి బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు. జపాన్ లోని కితక్యుషు నగరంతో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్నేహ ఒప్పందం కింద, ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థను, నెట్ జీరో లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో’ ఎకో–టౌన్ ఏర్పాటుకు ఈ భూమి కేటాయించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఒక్క వాక్యాన్ని పక్కనపెడితే, మిగతా ఉత్తర్వు కేవలం ఒక వ్యర్థాల కేంద్రా నికి భూమి బదిలీ, లైసెన్సు ఆమోదం మాత్రమే. ఇక్కడ ‘నెట్ జీరో’ అంటే ఏమిటో, హద్దు ఏమిటో, బేస్‌లైన్ ఏమిటో, ఎవరు ధ్రువీక రిస్తారో ఎక్కడా నిర్వచించలేదు. జపాన్ లో ‘ఎకో–టౌన్’ అంటే పరిశ్రమల వ్యర్థాలను రీసైకిల్ చేసే మూసిన లూప్ వ్యవస్థలు; కానీ ఇక్కడ ఆమోదమైంది మామూలు మున్సిపల్ వ్యర్థాల కేంద్రమే. దానికి ఎకో–టౌన్, నెట్ జీరో పేర్లు మాత్రమే అదనం.
నగర స్థాయిలో ఇదే ధోరణి తెలంగాణ ‘ఫ్యూచర్ సిటీ’ (భారత్ ఫ్యూచర్ సిటీ, ‘నాలుగో నగరం’)లో కనిపిస్తుంది. శ్రీశైలం, నాగా ర్జునసాగర్ రహదారుల మధ్య 30,000 ఎకరాల్లో నిర్మించే ఈ నగరాన్ని 2025 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది; దీని కోసం కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను దీనికి బదిలీ చేశారు. మొత్తం 30,000 ఎకరాల్లో 13,973 ఎకరాలు గతంలో హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం కేటా యించినవే. అంటే ‘భారతదేశపు తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ’ అని పిలుస్తున్న దీనిలో సగానికి పైగా భూమి, అంతకన్నా ఎక్కువ ఉద్గారాలు వెలువడే పరిశ్రమల కోసం కేటాయించినదే. ఇప్పటికే స్థలాల అమ్మకపు ప్రకటనల్లో హెచ్‌ఎండీఏ, రెరా అనుమ తులతో పాటు ‘నెట్ జీరో’ హోదాను ఒక ఆకర్షణగా వాడుతున్నారు.
కార్బన్ మార్కెటే లేదు!
ఇరు రాష్ట్రాల ప్రకటనలన్నింటిలోనూ కార్బన్ ట్రేడింగ్ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. సూత్రప్రాయంగా కార్బన్ ట్రేడింగ్ లేకుండా నెట్ జీరో నిలబడదు. ‘తొలగింపు’ క్రెడిట్లు, రిజిస్ట్రీలు, ఆడిట్ చేసిన ఆఫ్‌సెట్ల ద్వారానే అది రుజువవుతుంది. ఏ సంవ త్సరపు ఉద్గారాలతో పోల్చి నెట్ జీరో అంటున్నారో చెప్పకపోతే, ఈ దావాను నిర్ధారించలేం. కానీ భారత్ సొంతంగా నిర్మించదల్చుకున్న ఆ వ్యవస్థ – ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ రూపొందించిన కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (సీసీటీఎస్) ముసాయిదా ఇంకా అస్పష్టంగానే ఉంది. ‘కార్బన్ క్రెడిట్’ అంటే ఏమిటో నిర్వచించకుండానే డానికి మార్కెట్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఒక మంత్రిత్వ శాఖ తన ప్రధాన ఉత్పత్తినే నిర్వచించకుండా కార్బన్ మార్కెట్ రూపొందిస్తే, రాష్ట్రాలు ఆ మార్కెట్‌నైనా, మరే యంత్రాంగాన్నైనా ప్రస్తావించకుండానే నెట్ జీరో ప్రకటనలు చేస్తున్నాయి. ఇదే వీటిని లెక్కల వ్యవస్థలుగా కాక, కేవలం ప్రచార కార్యక్రమాలుగా చూపిస్తుంది. రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయించాడు. ఎందుకంటే మంటల తీవ్రతను అతను చూడలేకపోయాడు, లేదా చూడదలచుకోలేదు. భారత వాతావరణ పాలన కూడా అంతే. పద జాలంతో ఫిడేలు వాయిస్తున్నారే తప్ప, పారదర్శకత, జవాబుదారీ తనం వంటివి లేనేలేవు.
డా‘‘ దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త విధాన–వ్యవసాయ రంగ నిపుణులు


