పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవారు ఒక్కోసారి కాళ్లు కదలక నడవలేకపోతారు. ఇలా జరగడాన్ని ‘ఫ్రీజింగ్ ఆఫ్ గెయిట్’ అంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇటలీలోని మిలాన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు ఆర్ఫియస్ అనే స్మార్ట్ సాక్స్‌ను తయారు చేశారు. ఈ సాక్స్‌లో ఉండే చిన్నచిన్న పరికరాలు... బాధితులు కోరిన సంగీతానికి అనుగుణంగా కాళ్లకు స్వల్పమైన కంపనాలు ఇస్తాయి. నడుస్తున్నప్పుడు ఈ కంపనాలు లయబద్ధంగా వెలువడుతూ కాళ్లు కదలడానికి సహాయపడతాయి. ఈ వినూత్న ఆలోచన ‘2026 ఏడాదికి జేమ్స్ డైసన్ అవార్డు’కు ఎంపికైంది.
ఇష్టమైన పాటల రిథమ్‌కు అనుగుణంగా కంపనాలిలా...
ఆర్ఫియస్ సాక్స్‌లో పాదాలు, కింది కాలి భాగంలో మొత్తం ఎనిమిది చిన్న వైబ్రేషన్స్ ఇచ్చే పరికరాలు ఉంటాయి. అవసరమైన ప్రాంతానికి కంపనాలు అందించడంలో ఇవి సహాయపడతాయి. ఈ సాక్స్‌ను మొబైల్ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ‘స్పాటిఫై’లో తమకు ఇష్టమైన పాటలను బాధితులు ఎంపిక చేసుకోవచ్చు. ఆ సంగీతంలోని రిథమ్‌కు తగినట్లుగా సాక్స్‌లోని పరికరాలు కాళ్లకు కంపనాలను అందిస్తాయి. ఇందుకోసం హెడ్‌ఫోన్స్ కూడా అవసరంలేదు.
ప్రస్తుతం ఈ ఆర్ఫియస్ ఇంకా ప్రాథమిక నమూనా (ప్రోటోటైప్) దశలోనే ఉంది. దీన్ని మరింత చిన్నదిగా, సౌకర్యవంతంగా తయారు చేయడంతోపాటు నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని గుర్తించే ‘ఫ్రీజ్ డిటెక్షన్ టెక్నాలజీ’ని కూడా ఇందులో చేర్చేందుకు పరిశోధక విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవి వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడేళ్లు పట్టవచ్చని వారు చెబుతున్నారు.
యువతలో పెరుగుతున్న పక్షవాతం కేసులు!
సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే పక్షవాతం ఇటీవల యువతలో పెరిగినట్లు ఓ అమెరికన్ అధ్యయనంలో తేలింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో 20 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసు వారిలో పక్షవాతం కేసులు దాదాపు రెట్టింపయ్యాయని పరిశోధకులు గుర్తించారు. అయితే స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 30 రోజుల్లో మరణించే వారి శాతం మాత్రం కొంత తగ్గింది. ఈ అధ్యయనంలో భాగంగా 20 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తొలిసారి పక్షవాతం వచ్చిన 2,076 కేసులను పరిశోధకులు గుర్తించారు.
1993–94లో ప్రతి లక్ష మంది యువతలో ఏడాదికి సుమారు 33.9 స్ట్రోక్ కేసులు నమోదవగా 2020 నాటికి ఈ సంఖ్య 62.2కు పెరిగింది. యువతలోని పక్షవాతం కేసుల్లో ప్రధానంగా ఇస్కీమిక్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మెదడులోని ఏదైనా భాగానికి రక్తాన్ని తీసుకెళ్లే నాళంలో అడ్డంకి ఏర్పడి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ఇస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. 1993–94లో ప్రతి లక్ష మందిలో ఏడాదికి 23.8 ఇస్కీమిక్ స్ట్రోక్ కేసులు నమోదైతే 2020 నాటికి ఈ సంఖ్య 47.3కు పెరిగింది.
అయితే మెదడులో రక్తనాళం చిట్లడంతో రక్తస్రావం జరగడం వల్ల వచ్చే ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, మెదడు చుట్టూ రక్తస్రావం వల్ల వచ్చే సబ్‌అరాక్నాయిడ్ హెమరేజ్ వంటి ఇతర రకాల స్ట్రోక్స్‌లో మాత్రం ఈ పెరుగుదల కనిపించలేదు. పక్షవాతానికి గురైన యువతను పరిశీలించినప్పుడు... గతంతో పోలిస్తే వారిలో హైబీపీ, డయాబెటిస్ వంటి కొన్ని సమస్యలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయన వివరాలు న్యూరాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
జంక్ ఫుడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులు
అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో గుండె జబ్బులు, కేన్సర్, డయాబెటిస్, ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో ఏ కారణంతోనైనా మరణాల ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధకులు ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలను సమగ్రంగా విశ్లేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రచురితమైన పరిశోధనలను పరిశీలించారు. ఈ విశ్లేషణలో మొత్తం 51 అధ్యయనాలున్నాయి.
ఆయా అధ్యయనాల్లో పాల్గొన్న వాలంటీర్ల ఆహార అలవాట్లను, వారి ఆహార చరిత్రను విశ్లేషించగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి.. కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పునకు మధ్య సంబంధం ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజువారీ వినియోగం పెరిగేకొద్దీ అనారోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతున్నట్లు డోస్ రెస్పాన్స్ అనాలసిస్‌లో కనిపించింది. రోజుకు అదనంగా 100 గ్రాముల అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు, కేన్సర్, ఏ కారణంతోనైనా మరణించే ముప్పు, మెటబాలిక్ సిండ్రోమ్/డయాబెటిస్ ముప్పు పెరగడంతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ పరిశోధనలో లభించిన ఆధారాలు తక్కువ స్థాయి నుంచి మధ్యస్థ స్థాయిలోనే ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.సాక్షి, హెల్త్ డెస్క్


