జాలితో మనం పెట్టే ఆహారమే కోతులను హింసాత్మకంగా మారుస్తోందా?
ప్రాసెస్డ్ ఫుడ్ వల్లనే కోతుల్లో దుందుడుకు స్వభావం పెరుగుతోంది
సహజ వాతావరణంలో స్వతంత్రంగా జీవించనివ్వటమే మనకు, కోతులకూ మేలు
సాక్షి, స్పెషల్ డెస్క్ : మన దేశంలో కోతులు, హనుమాన్ లంగూర్లను దైవస మానంగా భావించి భక్తితో లేదా జాలితో వాటికి బిస్కెట్లు, బ్రెడ్లు, వేపుళ్లు, సమోసాలు, స్వీట్లు వంటి ఆహార పదా ర్థాలను పెట్టటం రోడ్ల పక్కన, దేవాలయాల దగ్గర సర్వసాధా రణంగా కనిపించే దృశ్యాలు. అయితే, మనం చేసే ఈ చిన్న ‘ఉపకారం’ వాటి ఆరోగ్యానికే కాక, తిరిగి మన భద్రతకే పెనుముప్పుగా మారుతోంది. ఇటీవలి కాలంలో కోతులు మనుషులపై తీవ్రంగా దాడులు చేయటానికి, చేతుల్లోని వస్తువులను లాక్కోవటానికి మనం అలవాటు చేస్తున్న ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ప్రధాన కారణమని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం మారి.. అసహనం పెరిగి..
కోతులు, లంగూర్లు సహజంగా అడవుల్లో దొరికే ఆకులు, కాయలు, పండ్లు, బెరడులు తిని జీవించే శాకాహార జీవులు. వాటి జీర్ణవ్యవస్థ అధిక పీచుపదార్థాలు కలిగిన సహజాహారాన్ని అరిగించుకోవటానికి అనువుగా రూపొందినది. వీటికి మనం తినే ఉప్పు, నూనె, శుద్ధి చేసిన చక్కెర, మైదాతో తయారైన కృత్రిమ పదార్థాలు పెట్టటం వల్ల కడుపుబ్బరం, తీవ్రమైన అసిడిటీ, జీర్ణకోశ సమస్యలు, మధుమేహం తలెత్తుతాయి. ప్రాసెస్డ్ ఆహారంలోని కృత్రిమ చక్కెరలు కోతుల్లో ఒకేసారి విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేసి, వాటి నాడీవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. శరీరంలో కలిగే ఈ అనారోగ్యకరమైన మార్పులు, శారీరక అసౌకర్యం వాటి ప్రవర్తనను మార్చేస్తాయి. దీనివల్లే అవి అత్యంత అసహనంగా, ఆవేశంగా ప్రవర్తిస్తాయంటున్నారు.
స్వతంత్రంగా జీవించనివ్వటమే మేలు
అడవుల్లో ఆహారాన్ని వెతుక్కునే సహజ స్వభావాన్ని కోల్పోయి, నగరాల్లో సులువుగా దొరికే కేలరీలు అధికంగా ఉండే ఆహారానికి ఇవి బానిసలవుతాయి. ఎవరైనా ఆహారం ఇవ్వకపోయినా, ఆలస్యం చేసినా అవి కోపంతో మనుషులపై భౌతిక దాడులు చేసి, గాయపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారానికి అలవాటు పడటం వల్ల కోతులు అడవులను వీడి జనావాసాలు, రహదారుల వైపు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించటం లేదా రోగాల బారిన పడటంతోపాటు నగరాల్లో జనంపై దాడులు పెరగటానికి ఇది కారణమవుతోంది.
కుక్క కాట్ల తర్వాత అంత ఎక్కువగా జరుగుతున్నది కోతుల దాడులే. అందుకే, అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడా అధికారులు ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కోతులకు ఆహారం ఇవ్వటం వాటి మనుగడకే ప్రమాదమని స్పష్టం చేస్తున్నారు. భక్తి, జాలి చూపించాల్సింది వన్యప్రాణులకు ఆహారం విసరటంలో కాదు, వాటిని తమ సహజ వాతావరణంలో స్వతంత్రంగా జీవించనివ్వటం కోసం అడవులను పెంపొందించటం వంటి పనుల్లోనే ఉందన్నది వన్యప్రాణి నిపుణుల మాట. కోతులకు ఆహారం వేయటం ఆపటం ద్వారానే మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణను దీర్ఘకాలంలోనైనా నివారించగలం.


