పెళ్లయిన నెలరోజులకే 24 ఏళ్ల యువతి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఆలయానికి వెళ్లిన ఆమె, పుణ్యం వస్తుందని ఆశపడి కోతులకు పళ్లను పెడుతోంది. అయితే అవి ఒక్కసారిగా ముందుకు దూసుకు రావడంతో భయపడి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. తూత్తుకుడిలోని సౌత్ తిట్టన్‌కుళం ప్రాంతానికి చెందిన అనిత (24)కు, సురేశ్ (29)తో గత నెలలోనే వివాహమైంది. విదేశాల్లో పనిచేసే సురేష్ ఇటీవల ఇంటికి తిరిగి రావడంతో ఆ దంపతులు కజుగుమలైలోని కలుగసలమూర్తి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ప్రధాన ఆలయంలో పూజలు చేసిన తర్వాత, ఆ దంపతులు కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళైయార్ ఆలయానికి వెళ్లారు. అక్కడ కోతులకు పండ్లు తినిపిస్తుండగా, అకస్మాత్తుగా అనేక కోతులు వారిని చుట్టుముట్టాయి. దీంతో అనిత తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆ భయంతోనే అదుపు తప్పి కొండపై నుంచి కిందపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తన కళ్లెదుటే, హృదయ విదారకరంగా చనిపోయిన భార్యను చూసి సురేష్ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారిని సైతం కదిలించింది.
ఇదీ చదవండి: 30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోతులు చుట్టుముట్టడంతో ఆ భయంతోనే జారి పడిపోయి ఉంటుందని భావిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు.
ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్


