30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు | 30 year friendship turns into Rs 97 lakh fraud Man sells stranger vacant flat to couple | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు

Jun 27 2026 12:26 PM | Updated on Jun 27 2026 2:23 PM

30 year friendship turns into Rs 97 lakh fraud Man sells stranger vacant flat to couple

‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఆ మాటల్ని అందరమూ మనస్ఫూర్తిగా నమ్ముతాం. త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాం. కానీఆ నమ్మకాన్ని వమ్ముచేసిన  ఒక  కేటుగాడు, తన  స్నేహితుడి నట్టే ముంచాడు. నమ్మకమున్న చోటే నమ్మకద్రోహం ఉంటుందని నిరూపించిన వైనమిది.   ఏళ్ల తరబడి ఉన్న నమ్మకమే మోసపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. మనోడే కదా అని నమ్మిదే, ప్రశ్నించడం మానేస్తే, వారు చెప్పే అబద్ధాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతే  మునిగిపోక తప్పదు.చైనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.దాదాపు ముప్పై ఏళ్ల నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తాళం మార్చేసి, తనకు సంబంధం లేని ఆస్తిని స్నేహితులకు అమ్మేశాడు..చివరికి ఏం జరిగింది? తెలుసుకుందాం పదండి.

సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ మరియు సిన్మిన్ ఈవెనింగ్ న్యూస్ కథనాల ప్రకారం.. షాంఘైకి చెందిన ‘సన్’ అనే వ్యక్తి, దాదాపు 30 ఏళ్ల స్నేహానికి వెన్నుపోటు పొడిచాడు.  కష్టకాలంలో తనకు అండగా ఉన్నారన్న కృతజ్ఞత లేకుండా, స్నేహితుడిని, అతని భార్యను మోసం చేసి,  తనది కాని ఆస్తికి యజమానిగా నటించి వారి వద్ద నుండి సుమారు రూ. 97 లక్షలు కాజేశాడు.

అసలేం జరిగింది?
సన్‌ గతంలో రెండు రిటైల్ షాపులు నడిపేవాడు. కానీ అవి మూతపడ్డాయి. గతంలో కూడా అతను ఒక మోసం కేసులో జైలు శిక్ష అనుభవించి 2017లో విడుదలైయ్యాడు. జైలు నుండి వచ్చాక, అతను ముప్పై ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న వలస కూలీలైన దంపతులను ఆశ్రయించాడు. ఆ దంపతుల ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకపోయినా, సన్‌కు  కడుపునిండా భోజనం పెట్టి, అడిగినప్పుడల్లా  డబ్బు ఇస్తూ మానసికంగా ఎంతో  అండగా నిలిచారు.

కాలక్రమేణా, సన్ వారి ముందు ఒక ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. తనకు షాంఘైలో ఆస్తులు ఉన్నాయని, విలేజ్ కమిటీకి చెందిన బంధువులతో బలమైన పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. దాంతో ఆ దంపతులు తమకు ఒక తక్కువ ధరలో ఇల్లు చూపెట్టమని సన్‌ను కోరారు. తనకున్న పరిచయాలతో తక్కువ ధరకే ఇల్లు ఇప్పిస్తానని సన్ నమ్మబలికాడు. అంతే  కపటబుద్ధిని ప్రదర్శించడం మొదలెట్టాడు.

2023లో షురూ
2023 నుండి సన్ ఆ దంపతుల వద్ద నుండి అడ్వాన్స్ పేమెంట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్‌స్టాల్‌మెంట్ల పేరుతో  లక్షల రూపాయల డబ్బు వసూలు చేశాడు. 2025 నాటికి ఈ మోసం మరింత ముదిరింది. తనకు ఒక రీలోకేషన్ ఫ్లాట్ దొరికిందని, డీల్ ఫైనల్ చేయడానికి మరో 4,00,000 యువాన్లు (సుమారు రూ. 55.5 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు.

కానీ, అసలు ఆ ఇల్లు అతనిది కాదు. సన్ ఒక రీసెటిల్మెంట్ హౌసింగ్ ఎస్టేట్‌లో నెలల తరబడి ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌ను గుర్తించాడు. వెంటనే ఒక తాళాలు తయారుచేసే వ్యక్తిని పిలిచి, తన తాళాలు పోయాయని అబద్ధం చెప్పి, ఎలాంటి యాజమాన్య పత్రాలు చూపించకుండానే ఆ ఇంటి తాళాన్ని మార్పించేశాడు. ఆ తర్వాత సన్ ఆ దంపతులను ఆ ఫ్లాట్‌కు తీసుకెళ్లి, కొత్త తాళం చెవులు వారి చేతిలో పెట్టి, ఒక నకిలీ సేల్స్ అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా చేయించాడు.

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్‌
మోసం వెలుగులోకి వచ్చిందిలా..
మోసం ఎన్నాళ్లో సాగదు కదా.  పాపాల పుట్ట పగలక మానదు. కరెక్ట్‌గా అదే జరిగింది. ఆ ఫ్లాట్ అసలు యజమాని 'వాంగ్' తన ఇల్లు ఖాళీగా ఉండటంతో అద్దెకు ఇవ్వడం కోసం ఒక ఏజెంట్‌ను పురమాయించాడు.  గత ఏడాది మేలో వాంగ్ ఒక అద్దెకు దిగే వ్యక్తిని తీసుకుని తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లినప్పుడు, అతని తాళం చెవి పని చేయలేదు. దాంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఎవరో తాళం మార్చినట్లు తెలిసింది. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల దర్యాప్తులో ఈ మోసానికి పాల్పడింది సన్ అని తేలింది. వారు అతడిని అరెస్ట్ చేశారు. తాను వసూలు చేసిన డబ్బునంతా అప్పు తీర్చడానికి, తన సొంత ఖర్చులకు వాడేసినట్లు సన్ ఒప్పుకున్నాడు. బాధితులు ఇంకా చివరి పేమెంట్ చేయకముందే ఈ మోసం బయటపడింది, కానీ అప్పటికే వారు 97 లక్షల రూపాయల వరకు   చెల్లించారు.

కోర్టు తీర్పు: ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు, సన్‌కు మోసం కేసులో 10 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష విధించడమే కాకుండా,సుమారు రూ. 13.8 లక్షలు జరిమానా కూడా విధించింది. ‌

ఇదీ చదవండి: తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement