బొగొటా: కొలంబియాలో నిన్న ( సోమవారం) 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం భారీ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 169 మంది మృతి చెందగా, సుమారు 570 మంది గాయపడ్డారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
భూకంపం ధాటికి 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు దెబ్బతిన్నాయి. కనీసం 61 భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు. ప్రధాన భూకంపం తర్వాత సైతం దాదాపు 21 ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
భూకంపం విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెరీరాలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన దృశ్యాలు, మనిజాలెస్‌లోని ప్రసిద్ధ నియో-గోతిక్ కేథడ్రల్ పక్క టవర్ కూలిపోయిన దృశ్యాలు భూకంప తీవ్రతను చూపిస్తున్నాయి. కాలీలో శిథిలాల కింద చిక్కుకున్న ఆరు నెలల చిన్నారిని, ఆమె తల్లిని రక్షకులు సురక్షితంగా బయటకు తీశారు. మరో ఘటనలో ఆసుపత్రి కిటికీల నుంచి తాళ్ల సహాయంతో పలువురిని బయటకు తీసుకొచ్చారు.
భూకంప కేంద్రానికి సమీపంలోని కొలంబియా పసిఫిక్ ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన ఈ ప్రాంతంలో ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు సంభవిస్తుంటాయి. కొలంబియా జియోలాజికల్ సర్వీస్ ప్రకారం, ఇది 21వ శతాబ్దంలో దేశంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం. భూకంప కేంద్రం భూగర్భంలో లోతుగా ఉన్నప్పటికీ, 7.4 తీవ్రత కారణంగా జనసాంద్రత ఉన్న లోయ ప్రాంతాల్లో ప్రకంపనలు భారీ నష్టాన్ని కలిగించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


