అమెరికాలో కీలక మౌలిక వసతులపై సైబర్ దాడుల ముప్పు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి హ్యాకర్ల లక్ష్యంగా మారింది తాగునీటి సరఫరా వ్యవస్థలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాటర్ సిస్టమ్స్, వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లపై జరిగిన సైబర్ దాడులు భద్రతా వర్గాలను అప్రమత్తం చేశాయి. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? అని అమెరికా దర్యాప్తు సంస్థలు పరిశీలన ప్రారంభించాయి.
జూలై చివరి వారంలో మిన్నెసోటాలోని 30కి పైగా స్థానిక నీటి సరఫరా వ్యవస్థలు సమన్వయ సైబర్ దాడులకు గురయ్యాయి. ఆ తర్వాత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), సైబర్ భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. కనీసం ఏడు రాష్ట్రాల్లోని నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థల్లోకి హ్యాకర్లు చొరబడినట్లు అధికారులు గుర్తించారు.
అమెరికాలోని నీటి సరఫరా వ్యవస్థలు కోట్లాది మంది ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నాయి. సరస్సులు, నదులు, భూగర్భ జలాల నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి.. పైపుల ద్వారా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.
నీటి ఒత్తిడి, పంపుల పనితీరు, రసాయనాల మోతాదు వంటి అంశాలను నియంత్రించే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లు (PLCs) ఈ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు ఇవే పరికరాలు హ్యాకర్ల టార్గెట్‌గా మారాయి. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన కంట్రోల్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి వాటిలోకి ప్రవేశించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
బలహీనమైన పాస్‌వర్డ్‌లు, భద్రతా లోపాలు, అప్‌డేట్ చేయని సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడే అవకాశం ఉంటుంది. ఒకసారి నియంత్రణ వ్యవస్థలపై పట్టు సాధిస్తే.. పాస్‌వర్డ్‌లను మార్చడం, ఆదేశాల్లో మార్పులు చేయడం, పరికరాల పనితీరును ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది.
ఈ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్ల పాత్ర ఉందా? అనే అంశంపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్‌కు అనుబంధంగా పనిచేసే సైబర్ గ్రూపులు గతంలో కూడా కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు ఉన్నాయని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏ దేశాన్నీ ఈ దాడులకు బాధ్యుడిగా ప్రకటించలేదు. మరోవైపు ఇరాన్ పేరుతో మరో దేశం లేదంటే గ్రూప్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందా? అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం జరిగిన దాడుల వల్ల తాగునీరు కలుషితమైనట్లు.. ప్రజల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నీటి వ్యవస్థలను మాన్యువల్‌గా నిర్వహించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ప్రజలకు నీటిని మరిగించి వినియోగించాలని సూచనలు కూడా ఇచ్చారు.
సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి దాడుల అసలు లక్ష్యం కేవలం నీటి సరఫరాను నిలిపివేయడం మాత్రమే కాకపోవచ్చు. ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీయడం కూడా సైబర్ యుద్ధ వ్యూహాల్లో భాగమని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా నీటి సరఫరా సంస్థలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి. నీటి వ్యవస్థలను నేరుగా ఇంటర్నెట్‌కు అనుసంధానం చేయకుండా చూడటం, బలమైన ఫైర్‌వాల్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, మల్టీ-లేయర్ అథెంటికేషన్ అమలు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను మార్చడం, అవసరం లేని రిమోట్ యాక్సెస్‌లను నిలిపివేయడం, అత్యవసర పరిస్థితుల్లో వ్యవస్థలను మాన్యువల్‌గా నడిపించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగవని.. విద్యుత్, నీరు, రవాణా వంటి కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని తాజా ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.


