ఫగ్వారా: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించడంతో ఆదివారం తెల్లవారుజామున భారీగా విద్యార్థులు నిరసనలకు దిగారు. అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ పరిణామాలపై కాక్‌రోచ్ జంతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. హాస్టళ్లలో కూడా భద్రత లేదనే భావన మహిళల్లో కలగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 2026లో మహిళలు తమ ప్రాథమిక భద్రత కోసం నిరసనలు చేయాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.
భారీగా పోలీసుల మోహరింపు
ఫగ్వారాలో ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి. దీంతో క్యాంపస్‌లో భారీగా పోలీసులను మోహరించారు. విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
అత్యాచారంపై దర్యాప్తు కొనసాగింపు
విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే క్యాంపస్‌లో విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు అధికారులు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. నిందితుల గుర్తింపు కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ వ్యవహారంలో పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2 వేల మందికి పైగా పోలీసులు
భద్రతా చర్యల్లో భాగంగా పంజాబ్ పోలీసులు ఎల్‌పీయూలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. క్యాంపస్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు 2,000 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫయాజ్ ఫరూఖీ తెలిపారు. మరోవైపు హాస్టళ్లలో కూడా పరిస్థితి అదుపులో లేదంటూ వస్తున్న వార్తలను జలంధర్ పోలీస్ కమిషనర్ సతీందర్ సింగ్ ఖండించారు. అన్ని హాస్టళ్లను తనిఖీ చేశామని, పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు.
10 రోజుల పాటు తరగతులు రద్దు
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 28 నుంచి 10 రోజుల పాటు రెగ్యులర్ తరగతులను నిలిపివేస్తున్నట్లు ఎల్‌పీయూ ప్రకటించింది. మిడ్‌టర్మ్ పరీక్షలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాయిదా వేసింది. ఇంటికి వెళ్లాలనుకునే విద్యార్థులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
విద్యార్థులకు యూనివర్సిటీ విజ్ఞప్తి
విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, యూనివర్సిటీ అధికారుల సూచనలను పాటించాలని ఎల్‌పీయూ కోరింది. అవసరం లేకుండా క్యాంపస్‌లో తిరగడం లేదా ఆందోళనలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనడం మానుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఉజ్జయినిలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లదాడి


