ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. తన విమానాల్లో ఓ సాఫ్ట్‌వేర్ సమస్యను గుర్తించింది. ల్యాండింగ్‌కు ముందు విమానం అనుకున్న మార్గాన్ని మార్చాల్సిన ప్రత్యేక పరిస్థితిలో.. ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమస్య భారత్‌లో నడుస్తున్న 96 విమానాలకు వర్తించనుంది. మరి ఈ సాఫ్ట్‌వేర్ లోపం నిజంగా అంత ఆందోళన చెందాల్సిన విషయమేనా?
ఈ సమస్యపై గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా 737 విమానాలు నడుపుతున్న అన్ని ఎయిర్‌లైన్స్‌కు సమాచారం ఇచ్చినట్లు బోయింగ్ తెలిపింది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అయితే దీనివల్ల విమానాన్ని మాన్యువల్‌గా నడపలేని పరిస్థితి మాత్రం ఉండదని బోయింగ్ స్పష్టం చేసింది. భారత్‌లో ఎయిర్ ఇండియా వద్ద సుమారు 53, ఆకాశ ఎయిర్ వద్ద 43 బోయింగ్ 737 మ్యాక్స్(MAX) విమానాలు ఉన్నాయి.
సమస్య ఏంటంటే..
ఈ సమస్య కాక్‌పిట్ సాఫ్ట్‌వేర్‌లోని ఓ అప్‌డేట్ కారణంగా తలెత్తినట్లు సమాచారం. సాధారణంగా విమానం ఒక నిర్దిష్ట మార్గంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతుంది. అయితే ఏదైనా కారణంతో ల్యాండింగ్ సాధ్యం కాక మిస్డ్ అప్రోచ్ తీసుకోవాల్సి వస్తే.. ఆ తర్వాతి ప్రయత్నంలో మొదట అనుకున్న మార్గానికి భిన్నంగా విమానాన్ని తీసుకెళ్లాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితిలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ డిసెంగేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు బోయింగ్ గుర్తించింది. అంటే ఆటోమేషన్ సహాయం తగ్గిపోతుంది. అయితే దీనివల్ల విమానానికి వచ్చిన ప్రమాదం ఏం ఉండని.. గాలిలో అదుపు తప్పడం లేదంటే పైలట్లు విమానాన్ని నడపలేని పరిస్థితి ఎదురుకాదని బోయింగ్ చెబుతోంది.
ఈ పరిస్థితిని పైలట్లు సురక్షితంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న విధానాలను పాటించాలని సూచించింది. మిస్డ్ అప్రోచ్ తర్వాత సిస్టమ్‌ను రీసెట్ చేయాలని కూడా బోయింగ్ సూచించినట్లు సమాచారం. సమస్యను పూర్తిగా తొలగించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సిద్ధం చేస్తోంది.
భారత విమానాలపై ప్రభావం
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడుపుతున్న భారత విమానయాన సంస్థల్లో ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. తాజా పరిణామంపై సదరు ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఆకాశ ఎయిర్ ఈ సమస్యపై బోయింగ్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. తమ విమానాల కార్యకలాపాల భద్రతపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారమే విమానాలను సురక్షితంగా నడుపుతున్నామని పేర్కొంది. అయితే తమ విమానాల్లో ఏదైనా ఈ సమస్యను ఎదుర్కొందా అనే విషయాన్ని ఆకాశ ఎయిర్ వెల్లడించలేదు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి వెంటనే స్పందన రాలేదు. ఈ సమస్యపై భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలన చేపట్టిందా? విమానయాన సంస్థలకు ఏదైనా ప్రత్యేక సూచన జారీ చేసిందా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
బోయింగ్‌పై ఇప్పటికే నిఘా
కిందటి ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత భారత విమానయాన రంగంలో బోయింగ్ విమానాల భద్రతపై మరింత దృష్టి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ లండన్–బెంగళూరు మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాన్ని పైలట్ నివేదించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ సమస్య కారణంగా గ్రౌండ్ చేశారు. అయితే బోయింగ్ తర్వాత చేసిన పరీక్షల్లో ఎలాంటి అసాధారణత కనిపించలేదని ప్రభుత్వం తెలిపింది.
అయితే ఆ రెండు ఘటనలు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించినవి కాగా.. ఇప్పుడు బయటపడిన సాఫ్ట్‌వేర్ సమస్య 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించినది. అయితే భారత్‌లో బోయింగ్ విమానాలపై భద్రతా పరిశీలన కొనసాగుతున్న సమయంలోనే ఈ కొత్త సాఫ్ట్‌వేర్ సమస్య వెలుగు చూడడం గమనార్హం.
ఎందుకు అంత ప్రాధాన్యం?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2,400కు పైగా 737 MAX విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. అయితే ఈ విమానాలు గతంలో రెండు ఘోర ప్రమాదాల కారణంగా వార్తల్లోకి ఎక్కాయి. 2018లో ఇండోనేషియాలో లయన్ ఎయిర్ 737 MAX 8 ప్రమాదంలో 189 మంది, 2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 MAX 8 ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ రెండు ప్రమాదాల తర్వాత ఈ మోడల్ విమానాల సేవల్ని ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం నిలిపివేశారు. తిరిగి ప్రారంభం అయ్యాక కూడా.. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో వార్తల్లోకి ఎక్కాయి.
2024 జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 విమానంలో గాల్లో ఉండగానే డోర్ ప్లగ్ ఊడిపోవడంతో మరోసారి ఈ మోడల్ తయారీ, నాణ్యత నియంత్రణపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సమస్య మాత్రం ప్రత్యేక ల్యాండింగ్ పరిస్థితిలో ఆటోమేషన్ తగ్గిపోయే సాఫ్ట్‌వేర్ లోపం. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు బోయింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండి: ఇరాన్ వార్నింగ్.. వారంలో ఏదైనా జరగొచ్చన్న ట్రంప్


