మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకు సమ్మె వాయిదా పడటంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సమ్మె వాయిదా చర్చల్లో మరో అంశం తెరపైకి వచ్చింది. బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమల్లోకి వస్తే.. ప్రస్తుతం పనిచేస్తున్న శనివారాలు కూడా సెలవులుగా మారనున్నాయి. దీంతో ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థపై ఓ రకమైన అభిప్రాయంతో ఉన్న ఖాతాదారుడికి మరింత అసహనం పెరుగుతోంది. ‘నెలలో రెండు శనివారాలు సెలవే కదా.. మిగిలిన రోజుల్లో బంద్ ఉంటే మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నాడు..
ప్రస్తుతం ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు అధికారికంగా సెలవు ఉంటోంది. మొదటి, మూడో, ఒక్కోసారి ఐదో శనివారాల్లో శాఖలు పనిచేస్తున్నాయి. వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలైతే ఈ శనివారాలు కూడా సెలవే కానుంది. అంటే.. నెలలో అన్ని శనివారాల్లోనూ బ్యాంకు బ్రాంచ్ తలుపులు మూసే పరిస్థితి. ప్రస్తుతానికి దీనిపైనే చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆరోజే సమయం ఉన్నవారికి?
ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా వారంలో మిగిలిన రోజుల్లో పని ఒత్తిడి ఉండేవారికి శనివారం బ్యాంకు పనులు చక్కబెట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఖాతాలో మార్పులు, కేవైసీ, డాక్యుమెంటేషన్, నగదు లావాదేవీలు, రుణాలకు సంబంధించిన కొన్ని పనులు వంటి వాటి కోసం బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తే.. పనిచేసే శనివారం వారికి మరో అవకాశం.
ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోతే? బ్యాంకు పని కోసం సెలవు పెట్టుకోవాలి.. లేదంటే మరో పని రోజు దొరికే వరకు ఆగాలి. ఇప్పటికే బ్రాంచ్ పని వేళలు, కౌంటర్ సమయాలు, రద్దీ కారణంగా బ్యాంకు పనులు చక్కబెట్టుకోవడం కష్టంగా ఉంటే.. పనిచేసే శనివారం కూడా అందుబాటులో లేకపోవడం ఖాతాదారులకు అదనపు ఇబ్బందే. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, రోజువారీ పనుల్లో బిజీగా ఉండేవారికి శనివారం దొరికే ఆ ఒక్క అవకాశం కూడా కీలకమే.
అక్కడ మరింత ఘోరం!
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు. పట్టణాలు, నగరాలతో పోలిస్తే అక్కడ బ్యాంకింగ్ శాఖలు, సిబ్బంది, ప్రత్యామ్నాయ సేవల అందుబాటు పరిమితంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. దీంతో బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనుల కోసం అందుబాటులో ఉన్న పని రోజుల్లోనే సమయం కేటాయించడం కస్టమర్లకు మరింత కష్టంగా మారొచ్చు. దూర ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చే వారికి శనివారం లభించే అదనపు అవకాశం పోతే.. తదుపరి పని రోజు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి రావొచ్చు.
డిజిటల్ బ్యాంకింగ్ ఉన్నా..
యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు కొనసాగుతాయి. కాబట్టి రోజువారీ డిజిటల్ లావాదేవీలకు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చు. కానీ ప్రతి పని మొబైల్‌లోనే పూర్తయ్యే పరిస్థితి లేదు. బ్రాంచ్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సిన పనుల విషయంలో మాత్రం కస్టమర్‌కు అందుబాటులో ఉండే ఒక రోజు తగ్గుతుంది.
ముఖ్యంగా శనివారం–ఆదివారం వరుసగా సెలవులు ఉండటంతో పాటు మధ్యలో మరో సెలవు వస్తే.. బ్రాంచ్ సేవలకు గ్యాప్ మరింత పెరగొచ్చు. అత్యవసరంగా బ్రాంచ్ సేవ అవసరమైనప్పుడు కస్టమర్లు తదుపరి పని రోజు వరకు వేచి చూడాల్సి రావచ్చు.
ఉద్యోగులకు సరే.. కస్టమర్లకు?
‘‘మాతో బలవంతంగా ఆదివారం పని చేయిస్తారా? దీనిని ఖండిస్తూ మరోరోజు సమ్మె చేపడతాం’’ అంటూ బ్లాక్ సండే పేరిట నిన్న విధులు నిర్వర్తించిన బ్యాంకింగ్ ఉద్యోగులు ఇప్పుడు రగిలిపోతున్నారు. మరి ఇలాంటివాళ్లు శనివారాలను సెలవుగా తీసుకున్న తర్వాత.. కస్టమర్ల కోసం ఒక పని రోజులో కాసేపు అదనంగా పనిచేయడానికి సిద్ధమవుతారా? అన్నదే ఇప్పుడు ఖాతాదారుల ప్రశ్న.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంతో ఉద్యోగులకు వారానికి రెండు రోజుల సెలవు లభిస్తుంది. అయితే తగ్గే బ్రాంచ్ సేవల రోజును కస్టమర్లకు ఎలా భర్తీ చేస్తారన్నదే అసలు విషయం. మిగిలిన రోజుల్లో పని గంటలు పెంచి సేవల లోటును భర్తీ చేస్తామని చెబుతున్నా.. ఇప్పటికే పని రోజుల్లోనే బ్రాంచ్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న పరిస్థితుల్లో మరో రోజు తగ్గితే ఖాతాదారుల కష్టాలు మరింత పెరగొచ్చు. ఉద్యోగుల సౌలభ్యం కోసం ఒక అదనపు సెలవు.. అదే సమయంలో కస్టమర్లకు ఒక పని రోజు తక్కువ. మరి ఈ లెక్కలో ఖాతాదారుడి సౌలభ్యం ఎక్కడ?.
ఇదీ చదవండి: భారత్‌కు సరికొత్త సంక్షోభం! ఈసారి..


